ఆగస్ట్ 6, 2021

ఓపెన్ సిరీస్ ఛాలెంజి ఫలితాలుః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, రచనాజాలం at 9:50 ఉద. by వసుంధర

లంకె

05 ఆగస్టు 2021

నమస్తే..

ఓపెన్ సిరీస్ పోటీలో పాల్గొని విజయవంతం చేసినందుకు ధన్యవాదములు. ఈ క్రింది నవలలను మా న్యాయనిర్ణేతల బృందం విజేతలుగా ప్రకటించడం జరిగింది. మొదటి రెండునవలలకు నగదు బహుమతి పంపడం జరుగుతుంది. మొదటి ఐదు నవలలకు ప్రతిలిపి అవార్డు పంపడం జరుగుతుంది.

మొదటి బహుమతి :

రచయిత: నాగార్జున్ రెడ్డి సిద్దవటం

రచన: వలుపేలరా ప్రియా(PCOD)

సహజమైన యాస, అద్భుతమైన శిల్పంతో ప్రస్తుత సమాజంలో అత్యధిక మంది మహిళలు ఎదుర్కుంటున్న PCOD సమస్యను వివరంగా చర్చించిన ఈ రచన తెలుగు సాహిత్యంలో అరుదైన రచనగా మేము భావిస్తున్నాము. ఒక పాజిటివ్ థాట్ తో కథకు ముగింపు ఇచ్చిన ఈ రచన ఎందరికో స్పూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాము.

రెండవ బహుమతి:

రచయిత: పార్థసారథి ఆలూరి

రచన:విరించిలెవరు?

అర్థరాత్రి మహిళలు బయట తిరిగినప్పుడే నిజమైన స్వతంత్రం వస్తుందని చెప్పిన గాంధీజీ మాటలు ఎప్పుడు నిజం అవుతాయో తెలియదు కాని మహిళల పైన ఇంట్లో, సమాజంలో దాడులు జరుగుతూనే ఉంటాయి. అలాంటి దాడులు అరికట్టాలంటే మహిళలు సంఘటితం అవ్వాలి, ప్రేమ ముఖ్యమా జీవితం ముఖ్యమా అంటే జీవితమే ముఖ్యమని యువత తెలుసుకోవాలి. మహిళలపై యాసిడ్ దాడులు, సామూహిక అత్యాచారాలు ఆగాలి. తల్లితండ్రులు పిల్లలని మంచి మార్గంలో పెంచాల్సిన అవసరాన్ని తట్టి చెప్పిన ఈ రచన ప్రస్తుత సమాజానికి ఎంతో అవసరం.

తరువాతి ఉత్తమ రచనలు:

1. రచన: అపరాజిత

రచయిత: మురళీకృష్ణ

నవల నిర్మాణం, వాక్య సముదాయం ఈ రచనలో మెండుగా ఉన్నాయి. అనుబంధాల గురించి, వైవాహిక జీవితం గురించి చక్కగా వివరించడం, జీవితానికి డబ్బు అవసరం కాని అదే జీవితం కాదని రచయిత తన రచన ద్వారా మంచి సందేశాన్ని ఇచ్చారు.

2.రచన: కనువిప్పు

రచయిత: సునీత ఆకెళ్ళ

 అవసరాన్ని బట్టి తమలో ఉన్న నైపుణ్యాలను ఉపయోగించుకోవడం ఎంత అవసరమో రచయిత చక్కగా వివరించారు. స్నేహితులు కాలక్షేపం కోసం మాత్రమే కాదు కష్ట కాలంలో కూడా తోడుండి,ధైర్యం ఇవ్వాల్సిన అవసరాన్ని రచయిత చక్కగా రాశారు. 

౩.రచన: యాక్సిడెంటల్ ఇష్క్

రచయిత: అవనిక

ఎంతో మంచి వస్తువు తీసుకొని, మరింత మంచి శిల్పంతో నవల రాయడం మాత్రమే ముఖ్యం కాదు నవల రీడర్స్ ని చదివించగలగాలి. అలాంటి చదివించే గుణం ఈ రచనలో ఉన్నదని  భావిస్తున్నాము. సంభాషణలు, నవల యొక్క నడక సరైన క్రమంలో ఉండటం నవల గొప్పదనం. నిర్మాణ విషయంలో, సహజత్వం విషయంలో మరింత జాగ్రత్తలు అవసరం.

పై నవలలు మా న్యాయనిర్ణేతల దృష్టిలో ఉత్తమమైనవి కానీ ఇవే తెలుగు సాహిత్యంలో కానీ, ప్రతిలిపిలో కానీ అత్యుత్తమ నవలలుగా ప్రకటించడం లేదు. వచ్చిన నవలల్లో వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించడం జరిగింది. ఈ పోటీకి చాలా మంచి నవలలు వచ్చినప్పటికీ శిల్పం, ఎత్తుగడ, అసహజ సంఘటనలు, మలుపులు, భాష, అసంపూర్ణ ముగింపులు వారిని విజయానికి దూరం చేశాయి. 

ఈ పోటీలో పాల్గొన్న రచయితలందరికి మరోసారి ధన్యవాదములు. గెలిచిన విజేతలకు శుభాకాంక్షలు తెలుపుతూ… మరొక పోటీతో మీ ముందుకు వచ్చి ఉన్నాము. పోటీ యొక్క వివరాల కోసం పోటీలు శీర్షికలో చూడగలరు. ప్రతిలిపి నిర్వహించే పోటీలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుతూ.

ప్రతిలిపి తెలుగు విభాగం. 

ఇమెయిల్ : events@pratilipi.com

Leave a Reply

%d bloggers like this: