సెప్టెంబర్ 19, 2021

అమ్మతో- పుట్టని బిడ్డ

Posted in కథాజాలం at 1:04 సా. by వసుంధర

ఆమె బాల. బేల. పేద.

చదువుకునే వయసులో పెళ్లయింది. లాలన కోరుకునే వయసులో తల్లి కావలసి వచ్చింది.

తగిన శరీర పోషణ లేక రెండుసార్లు కడుపు జారిపోయింది. మూడోసారి వద్దనుకున్నా తప్పలేదు.

తనకే తినడానికి తిండి లేదు. కడుపులో బిడ్డ ఆకలి ఎలా తీరుస్తుంది?

ఐనా అమ్మతనం ఆమెలో ప్రజ్వరిల్లుతుంటే- ఆశలు భ్రమలై ఉత్సాహాన్నిస్తుంటే-

ఇంకా పుట్టని ఆ బిడ్డ తల్లితో ఇలా అందిః

‘సుడిగుండాల ప్రవాహంలో కొట్టుకుపోతున్న నీకు నా కలలకి ఆశలకి నిచ్చెన వేయగల శక్తి ఉందని అనుకుంటున్నావా? లోపలి పొరలు చీల్చుకుని బయటకు వస్తే అంతా వెలుగు అని అనుకున్నా ఒకప్పుడు. నన్ను కాపు కాయాల్సిన వెలుగులో మాటు వేసి కాటువేసే విషనాగులు ఎన్నో ఉన్నాయని తెలిశాక చీకటే బాగుంది.

‘విశాలమైన ఆకాశంలో జీవితంలో పడగ విప్పి నాట్యం చేస్తున్న దైవం మత్తును, మతం మాలిన్యాన్ని, కులం కుళ్లు, వర్ణ వివక్ష, జాతి బేధాన్ని నేను దాటగలనా? క్రూర మృగాల కూతల మధ్య, కీచురాళ్ల మోతల మధ్య, నెగ్గుకు రాగలనా? ముందున్న సుడిగుండాలు దాటి ముందుకు నడవగలనా?

‘చీకటి గుహల్లోంచి, చింతల గుడారాల్లోకి ఇంత కష్టపడి రావడం అవసరమా? మనిషితనం మరిచిన లోకంపై భ్రమలు పెంచుకుంటున్నానా?’

దీనికి సమాధానం ఆ తల్లి కాదు. సాటి మనుషులు చెప్పాలి. సమకాలీన సమాజం చెప్పాలి.

చదవండి- భూమిక మాసపత్రిక ఈ సెప్టెంబర్ సంచికలో పి. శాంతి ప్రబోధ రచన అమ్మతో పుట్టని బిడ్డ

Leave a Reply

%d bloggers like this: