సెప్టెంబర్ 23, 2021

సంఘం చెక్కిన శిల్పాలు

Posted in సాంఘికం-రాజకీయాలు at 3:24 సా. by వసుంధర

సామాన్య మధ్యతరగతిలో పుట్టి, స్వయం ప్రతిభతో రాణించినా, కేవలం ప్రజాభిమానంతో కోట్లకు పడగలెత్తినవారు మన సినీతారలు. ఒక స్థాయి చేరుకున్నాక జనాలకు ఆరాధ్యదైవాలు కూడా. ఐతే తమ అభిమానుల్లో
నిరుపేదలు అత్యధిక సంఖ్యలో ఉన్నప్పటికీ అత్యంత వైభవంగా జీవించాలన్న కోరికను జయించలేక పోవడంవల్ల వారిని ఇతర దైవాల్లాగే సంఘం చెక్కిన శిల్పాలు అనుకోవాలి.
ప్రస్తుతం జెమిని టివిలో ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే కార్యక్రమం వస్తోంది. అందులో పాల్గొనే వందలాది మందిలో ఒక్కరైనా కోటీశ్వరులు కాగలరో లేదో తెలియదు కానీ- నిర్వాహకులు, సూత్రధారి మాత్రం ముందే మరింత కోటీశ్వరులు ఔతారన్నది అందరికీ తెలిసిన విషయం.
రెండు మూడు రోజుల క్రితం ఆ కార్యక్రమంలో ఒక ఆటోవాలా పాల్గొన్నాడు. అతడు అప్పుల్లో ఉన్నాడు. అన్నీ తీరాలంటే 5-6 లక్షలు కావాలి. ఈ కార్యక్రమంలో కనీసం 3.2 లక్షలు తెచ్చుకోగలనని ఆశ పడ్డాడు. అతడికి తప్పనిసరిగా పది వేలు వస్తాయని రూఢి కాగానే- ‘అప్పుడే నీ నెల సంపాదన వచ్చేసింది’ అని సూత్రధారి అభినందించాడు. సూత్రధారి తాహతుని బట్టి- అది వ్యంగ్యంలాగే అనిపించదూ! ఆ తర్వాత ఆ ఆటోవాలా తన తొందరపాటుతో లక్షలకు బదులు పది వేలతోనే సరిపెట్టుకోవలసి వస్తే- ప్రేక్షకులందరికీ మనసు కలుక్కుమంది. అతడు మాత్రం తన అభిమాన నటుడితో కాసేపు గడిపేనన్న సంతృప్తితో వెళ్లాడు. ఒక ఫ్యాన్సీ నంబరు కోసం వందలతో పోయేదానికి 17 లక్షలు విసిరి పారేయగల ఆ నటుడు- ఆ ఆటోవాలా అభిమానానికి ధన్యవాదాలు చెప్పాడు.
ఉన్నవారంతా లేనివారికి సాయపడాలని లేదు. తమ సాటివారిని, అందునా తమ ఉనికికి, ప్రగతికి కారణభూతులైనావారి గురించి కొంచెమైనా ఆలోచించి స్పందిస్తే- తమ జీవన విధానాన్ని కొంచెమైనా సవరించుకోగలరేమో!
వేల కోట్లకు అధిపతులైన పారిశ్రామికులు, మురికివాడల మధ్య ఆకాశమంటే భవనాల్ని నిర్మించుకోగలరు. వారిని స్ఫూర్తిగా తీసుకునేవారు- మన నేతల్లో మహాత్మా గాంధీని, లాల్ బహదూర్ శాస్త్రిని, తదితరుల్ని గుర్తు చేసుకుంటే ఎంత బాగుంటుంది!
కోట్లకు పడగలెత్తినవారే కాదు- నాలుగు వేళ్లూ నోట్లోకి పోతున్నవారు కూడా సాటి పౌరుల గురించి ఆలోచించడానికి కొంత సమయం కేటాయిస్తే మన దేశం నిజంగా మనదేశమౌతుంది.
అంతవరకూ మనలో చాలామంది సంఘం చెక్కిన శిల్పాలమే. ఎటొచ్చీ వారిలో కొందరే ఆరాధ్య దైవాలు. మిగతా అంతా చిల్లర దేవుళ్లు.
ప్రజానాయకులు- ఈ ఆరాధ్యదైవాలు, చిల్లర దేవుళ్లనుంచే పుట్టుకు రావడం గమనార్హం.

ఇప్పుడు నేటి ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వార్త చూడండి. మీ స్పందన తెలియజెయ్యండిః

Leave a Reply

%d bloggers like this: