మార్చి 22, 2021

నాంది – కొత్త సినిమా

Posted in వెండి తెర ముచ్చట్లు at 1:14 సా. by వసుంధర

ఈ ఫిబ్రవరి 19 న విడుదలైన నాంది సినిమా – అల్లరి నరేష్‍ని కొత్త గెటప్‍లో చూపిస్తుంది. జనాలకు ఆట్టే పరిచయంలేని సెక్షన్ 211 – ముఖ్యాంశంగా రూపొందించడం ఈ చిత్రం ప్రత్యేకత. అధికార దుర్వినియోగానికి అమ్ముడుపోతున్న వ్యాయంపై – వ్యవస్థను నిలదీసిన అర్థవంతమైన కొత్త తరహా చిత్రమిది. ప్రయోజనాత్మకమైన పరిష్కారాన్ని సూచించడం ప్రశంసనీయం.

సమీక్షకులు మాటల్లో, వ్రాతల్లో – నాలుగు మంచి మాటలు చెప్పిన ఈ చిత్రానికి ప్రేక్షకాదరణ కూడా లభించింది.

ఈ చిత్రం చూడ్డానికి కొన్ని వారాల ముందు మేము మళయాళం నుంచి తెలుగులోకి అనువదించబడిన వ్యూహం (2020) చిత్రాన్ని ఆహా చానెల్లో చూశాం. అదీ ఇంచుమించు ఇదే కథ, ఇదే సందేశం, ఇదే కథనం. ఐతే చిత్రం చాలా హుందాగా, పకడ్బందీగా, ఆసక్తికరంగా నడిచింది. నటీనటులు పాత్రల్లో జీవించెశారు. దర్శకుడు చిత్రాన్ని ఉత్కంఠభరితం చేశాడు.

ఆ చిత్రం చూసేక చూడ్డంవల్లనేమో – నాంది కథ, కథనం, నటీనటుల ప్రదర్శన చాలా పేలవంగా అనిపించాయి.

వ్యూహం చూసేక నాంది చూదకపోయినా ఫరవాలేదు. నాంది చూసేక మాత్రం వ్యూహం ఓసారి చూడ్డం తెలుగులో మంచి సినిమాలు రావాలన్న నిబద్ధత ఉన్నవారికీ, ఔత్సాహికులకూ ఎంతో అవసరం.

రెండు చిత్రాలూ – ఓటీటీలో ఆహా చానెల్లో ఉన్నాయిప్పుడు.

నాంది మంచి చిత్రాలు తియ్యాలన్న ప్రయత్నానికి తగిన నాంది అనీ, మెరుగైన ప్రదర్శనకు ఇంకా ఎంతో కృషి చెయ్యాల్సి ఉందనీ గ్రహిస్తే – ఈ నిర్మాణ సంస్థ, బృందం – తెలుగు సినిమా భవిష్యత్తుకి కూడా గొప్ప ఆసరా కాగలరు. వారికి అభినందనలు.

ఫిబ్రవరి 28, 2021

సాహితీ ‘లంకె’బిందువులు

Posted in నాటిక, లఘుచిత్రాల పోటీలు, పుస్తకాలు, మన కథకులు, సాహితీ సమాచారం at 9:03 సా. by వసుంధర

సంస్కరణా, విప్లవమా?

నివాళిః డా. సి. ఆనందారామం

జనవరి 31, 2021

సినీగీతాల్లో – ప్రేమ సందిగ్ధాలు

Posted in బుల్లితెర-వెండితెర, సంగీత సమాచారం at 12:58 సా. by వసుంధర

ప్రేమలో రకరకాల సందిగ్ధాలు. కవుల అక్షరాల్లో అవి మనోహరాలు. సంగీతంతో మేళవమైతే అవి సుస్వరాలు. వెరసి దృశ్యకావ్యంగా అవి సినీగీతాలు. అనుభూతికి, స్మృతులకు అవి సుమధురాలు.

అసమాన ప్రతిభావంతుడు, మహా గాయకుడు – ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం – వేదికలపై సినీగీతాల లోతుని అవగాహనకు తెచ్చే ప్రయత్నాలు ఎన్నో చేశారు. ఆ ప్రేరణతోనే అప్పుడప్పుడు కొన్ని సినీ గీతాల్ని సంస్మరించుకుందుకు అక్షరజాలమూ ఓ వేదిక. దీన్ని ఎవరైనా ఉపయోగించుకోవచ్చు.

మచ్చుకి సినీగీతాల్లో ప్రేమ సందిగ్ధాలను ప్రదర్శించిన మూడు పాటలకు ఇక్కడ లంకె ఇస్తున్నాం.

  1. రాజ్ కుమార్ (హిందీ) – ఇస్ రంగ్ బదల్తీ దునియామే
  2. బాజీగర్ (హిందీ) – చుపానాభీ నహీ ఆతా
  3. గుండమ్మ కథ (తెలుగు)- కనులు మూసినా నీవాయె

సద్గురు సాయి – ఒక అసామాన్య దృశ్యకావ్యం

Posted in టీవీ సీరియల్స్, బుల్లితెర-వెండితెర at 12:33 సా. by వసుంధర

ఈటివిలో కొంత కాలంగా సాయంత్రం 6-6.30 సద్గురు సాయి అనే డెయిలీ సీరియల్ వస్తోంది.

భక్తుల పాట్లు, దేవుడి లీలలు – ఇంతే కదా ఇలాంటి కథలు అనుకుంటూనే ఎందుకో ఆరంభంలో వరుసగా కొన్ని ఎపిసోడ్సు చూశాం. కథనం మేమనుకున్నదానికి విభిన్నంగానూ, అత్యంత ఆసక్తికరంగానూ ఉంది. సుమారు 60కి పైగా ఎపిసోడ్లు చూసేక, సమయం చిక్కక కొన్ని మిస్ కావాల్సి వచ్చింది. ఈటివి విన్ (etv win app) లో వెదికితే ఒకోసారి దొరికాయి, ఒకోసారి దొరకలేదు. అది హిందీ సీరియల్ కి అనువాదమని తెలుసు కాబట్టి గూగుల్ సెర్చి చేస్తే – సోనీ సిక్స్ అనే చానెల్లో కొన్నేళ్లక్రితం మేరే సాయి పేరిట సుమారు 700కి పైగా ఎపిసోడ్లు వచ్చినట్లు తెలిసింది. దాంతో హిందీకి మారిపోయాం. ఇంతవరకూ ఒక్కటి కూడా మిస్ కాకుండా 350 ఎపిసోడ్లు దాటాం. రోజుకి ఒకటికి మించే చూస్తూ, ఒకోసారి ఒక్కరోజులో ఏకబిగిని 10 ఎపిసోడ్లు చూడ్డం కూడా జరిగింది. అంత ఆసక్తికరంగానూ, రసవత్తరంగానూ నడుస్తోంది ఈ సీరియల్.

సమకాలీన సమాజాన్ని దృష్టిలో ఉంచుకుని – గత శతాబ్దపు తొలిభాగపు నేపథ్యంలో నడుస్తున్న ఈ సీరియల్లో స్పృశించిన అంశాలు – నేటి సామాజిక, రాజకీయ, ఆర్థిక, వినోద, నేర ప్రవృత్తులను విశ్లేషించిన తీరు అసామాన్యం, అద్భుతం, ప్రయోజనాత్మకం.

పాత తరానికి కనువిప్పు. నేటి తరానికి హెచ్చరిక. భావి తరానికి మార్గదర్శకం – అదీ ఈ సీరియల్!

ఇందులో భక్తికంటే మనస్తత్వ విశ్లేషణకూ, మహిమలకంటే తర్కానికీ ప్రాధాన్యముండడం విశేషం. అది నటీనటుల అసమాన ప్రతిభో, దర్శకుని అసాధారణ చాతుర్యమో – ఈ ఎపిసోడ్లలో కనిపించే నటీనటులు ఆయా పాత్రలకోసమే పుట్టారా అనిపిస్తుంది. నేడు వస్తున్న డెయిలీ సీరియల్సు నిర్వాహకులు నేర్చుకుని అనుకరించాల్సిన అంశాలు ఎన్నో ఉన్న ఈ సీరియల్ని హిందీలో చూడాలంటే మొదటి ఎపిసోడ్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తెలుగులో చూడాలంటే ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తెలుగులో సంభాషణలు సముచితంగా ఉన్నాయి. అయినప్పటికీ హిందీని అనుసరించగలిగినవారికి – ఆ అనుభూతి అదనం!

జనవరి 6, 2021

వెన్నెలకంటికి తానా అశ్రు నివాళి

Posted in బుల్లితెర-వెండితెర, సాహితీ సమాచారం at 10:45 ఉద. by వసుంధర

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 2020 న జరిగన అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశంలో  శ్రీ వెన్నెలకంటి పాల్గొన్న చివరి సమావేశం యౌట్యుబ్ లింక్ : 

“స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లో పది సంవత్సరాలకు పైగా ఒక స్థిరమైన ఉద్యగంలో ఉండి, దాన్ని వదులుకుని ఎంతో ఆసక్తితో చెన్నైబాట పట్టి, చిత్ర పరిశ్రమలో అడుగుబెట్టి కొన్ని వేల పాటలు రాశారు. అనేక అనువాద చిత్రాలకు పనిచేసిన అనుభవం వెన్నెలకంటి సొంతం. చిత్ర సీమలో ఎంతో సౌమ్యుడి గా, స్నేహశీలిగా, సాహిత్యాభిలాషిగా అందరి మన్నలను పొందిన ఒక అద్భుత సినీ గీత రచయితను, అనువాద కధా రచయితను, సంభాషణల రచయితను అకస్మాత్తుగా కోల్పోవడం ఇటు తెలుగు అటు తమిళ ప్రజల దురదృష్టకరం.” ఆయన మృతికి వెన్నెలకంటి కుటుంబ సభ్యులకు తానా  ప్రగాడ సానుభూతిని తెల్పుతూ, భగవంతుడు అయన ఆత్మకు సద్గతి కల్గించాలని తానా అధ్యక్షులు జయశేఖర్ తాళ్లూరి, తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర, సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ ప్రకటించారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర మాట్లాడుతూ – తానా ప్రపంచ సాహిత్య వేదిక ప్రతి నెలా ఆఖరి ఆదివారం జరుపుతున్న అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశాలలో గత వారం డిసెంబర్ 27 న జరిగిన “సినిమా పాటల్లో సాహిత్యం” అనే 8 వ సమావేశంలో పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, డా. సుద్దాల అశోక్ తేజ, రామజోగయ్య శాస్త్రి, అనంత శ్రీరామ్ గార్లతో పాటు ఒక విశిష్ట అతిధిగా ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న  శ్రీ వెన్నెలకంటి తనకు అత్యంత సన్నిహిత మిత్రుడని, తరచూ సంభాషించే ఒక మంచి రచయిత అకస్మాత్తుగా కనుమరుగై పోవడం అత్యంత విషాదకరం అన్నారు. ఇదే ఆయని చివరి సమావేశం కావడం విచారకరమన్నారు.

ఈ సమావేశంలో ప్రసాద్ తోటకూర అడిగిన కొన్ని ప్రశ్నలకు వెన్నెలకంటి ఆసక్తికరమైన ఈ క్రింది విషయాలను పంచుకున్నారు.

మనం తరచుగా వినే మాట – “పాటలలో ప్రమాణాలు పడిపోతున్నాయి, విలువలు తరిగిపోతున్నాయని” – అది నిజమా? అలాంటి వ్యాఖ్యలు విన్నప్పుడు ఒక రచయితగా మీ స్పందన ఏమిటి అని అడిగినప్పుడు à ప్రమాణాలు పడిపోవు, విలువలు తరిగిపోవు కాలానుగుణంగా మార్పు మాత్రమే చెందుతూ ఉంటాయి అంటూ మాయాబజార్ సినిమాలోని కొన్ని సన్నివేశాలను, సంభాషణలను ఉటంకించారు.

మన తెలుగు కావ్యాలంకారాలలో – ముక్త పద గ్రస్తాలంకారం ఒక గొప్ప ప్రక్రియ. (ముక్త పద గ్రస్తాలంకారం అంటే ప్రతి వాఖ్యంలోని చివరి పదాలు, తదుపరి వాఖ్యంలో మొదటి పదాలుగా వచ్చేటట్లుగా రాయడం). మీరు అలాంటి కొన్ని పాటలు రాశారుగదా అలా రాయడానికి మీకు స్ఫూర్తి ఎవరు అని ప్రశ్నించినపుడు à తెలుగు కావ్యాలంకారాలలోని ముక్త పద గ్రస్తాలంకారం తనకు బాగా నచ్చిన అలంకారం అని, వంశీ దర్శకత్వం లో వచ్చిన “మహర్షి” సినిమాలోని తాను రాసిన “మాట రాని మౌనమిది, మౌన వీణ గానమిది” అనే పాట మరియు నందకుమార్ దర్శకత్వంలో వచ్చిన “తేనెటీగ” సినిమాలోని “కలలో తెర తీయాల, తీయగ ఎద వేగాల, వేగాలలో వేడి, వేడింది వెన్నంటి” అనే పాటల నేపద్యాన్ని, అవి బహుళ ప్రజాదరణ పొందిన వైనాన్ని, ఆ అవకాశం ఇచ్చిన దర్శకులకు, ఆదరించిన ప్రేక్షకులకు అందరికి కృతజ్ఞతలు తెలియజేశారు.

గత 50 సంవత్సరాల జాతీయ పురస్కార చరిత్ర లో మన తెలుగు సినిమా గీతాలకు కేవలం మూడు సార్లు మాత్రమె జాతీయ పురస్కారాలు అందడంలో లోపం ఎక్కడుంది అనే ప్రశ్నకు à వెన్నెలకంటి చాలా నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ తెలుగు సినిమా పాటకు కేంద్ర స్థాయిలో అన్యాయం జరుగుతోందని, ఎంతోమంది సినీగీత రచయితలు అద్భుతమైన పాటలు రాసినప్పటికీ వాటిని జాతీయ స్థాయిలో గుర్తించకపోవడం శోచనీయమని, ఈ పరిస్థితి మారాలని అన్నారు.     

Thank you,

 — Dr. Prasad Thotakura
Dallas,TX,USA
(M) 817-300-4747
www.prasadthotakura.com

తరువాతి పేజీ