ఆగస్ట్ 3, 2020
విష్ణుశర్మ ఇంగ్లీషు చదువు
నాట్సాప్ బృందం సౌజన్యంతో ఒక గొప్ప లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

ఎందరో మహానుభావులు….. విశ్వనాథ సత్యనారాయణ గారు, రచించిన విష్ణుశర్మ ఇంగిలీషు చదువు, మన మాతృభాష రమ్యతను, సుకుమారాన్ని ఇంకా మన చిన్నతనం లో ఇంగిలీషు భాషను ఎలా బట్టీ పట్టామో గుర్తుకొస్తుంది.
ఈ ఆదివారం మంచి అద్భుతమైన కాలక్షేపం.
జూన్ 30, 2020
పాతాళ్ లోక్ – అమెజాన్ వెబ్ సిరీస్

కుళ్లు కంపు కొడుతున్న కులవ్యవస్థ, చట్టాలకు లొంగని నేరప్రపంచం, ఉచ్ఛనీచాలు పట్టించుకోని రాజకీయరంగం, అబద్ధాల ప్రచారమే బ్రతుకుతెరువుగా మీడియా, పదవిలో ఉన్నవారికి సహకరించడానికే తామున్నది అన్నట్లు వ్యవహరించే పోలీసు సంస్థ – ఇవీ పాతాళ్ లోక్ అనే 9 భాగాల వెబ్ సిరీస్‌కి ప్రేరణగా ఉన్న అంశాలు.
నటీనటులు ఆ పాత్రలకోసమే పుట్టారా అన్నట్లున్నారు. చిత్రీకరణ – ఆయా సన్నివేశాల్ని సిసిటివి కెమేరాల్లో చూపుతున్నారా అన్నంత సహజంగా ఉంది. ఒకొక్కటి 40-50 నిముషాలు ఉండే ఈ సిరీస్ – మొత్తం 9 భాగాల్నీ ఒక్కసారి చూసేయాలనిపించేటంత ఆసక్తికరంగా ఉంది.
దేశంలో ఇలాంటి అంశాల్ని ఇంత బాగా ప్రదర్శించగలవారున్నారా అనిపించే ప్రతిభ, తీస్తే ఇలాగే తియ్యాలనిపించేటంత సామర్థ్యం – ఉన్నప్పటికీ – ఇందులో మింగుడు పడనివి కొన్ని ఉన్నాయి.
భరించలేనంత కుళ్లు కంపు కొట్టేలా అత్యాచారాన్నీ, వెగటు పుట్టించేటంత అసహ్యంగా స్త్రీపురుషులమధ్య అక్రమ సంబంధాల్నీ – చిత్రీకరించడం ఈ వెబ్ సీరీస్ మొత్తానికి కేవలం పది పన్నెండు నిముషాలు దాటకపోయినా – అది అనవసరంగా అంటించుకున్న మచ్చ అనిపిస్తుంది. ఆ ఒక్క కారణంగా ఇంత మంచి సిరీసుని కుటుంబసమేతంగా చూడ్డం ఇబ్బంది ఔతుంది.
అలాంటి సన్నివేశాల్ని సభ్యసమాజానికి ఎలా చూపాలో తెలుసుకుందుకు శంకరాభరణం చిత్రంలో – 39 నిముషాల తర్వాత వచ్చే 2-3 నిముషాల దృశ్యం చాలు.
సహజత్వం కోసం – భాషా సంస్కారాన్ని పూర్తిగా మర్చిపోవడం ఈ సిరీసులో మరో ఇబ్బంది. హిందీలో ఉన్న ఈ వెబ్ సిరీసుకు – వ్రాతల్లో మాటలు – తెలుగులో కూడా ఉండడంవల్ల – కథ చక్కగా అర్థమౌతుంది. ఐతే హిందీ పదాలకి అచ్చ తెలుగు పచ్చిబూతుల్ని – తెరపై అక్షరాలుగా చదవడం – అదో భయంకర అనుభవం. సకుటుంబంగా ఈ సిరీస్ చూడ్డానికి ఆ భాష కూడా పెద్ద ఇబ్బంది.
బుల్లితెర కోసం చిత్రాలు నిర్మించేవాళ్లు – పై విషయాల్లో జాగ్రత్త పడితే – ఇలాంటి అద్భుతమైన సిరీస్ విశేషాల్ని పదిమందితో పంచుకోగలుగుతాం.
ఏదిఏమైనా పాతాళ లోక్ వెబ్ సిరీస్‌లో 96% అద్భుత సృజనాత్మకతకు అభినందనలు.
ఫిబ్రవరి 7, 2020
జీవనసాఫల్య పురస్కారం – ఆచార్య ఎన్. గోపి

కలకత్తాలోని ప్రతిష్టాత్మక సంస్థ భారతీయ భాషా పరిషత్ ప్రముఖ తెలుగు కవి డా. గోపికి జీవన సాఫల్య పురస్కారాన్ని (కర్తృత్వ సమగ్ర సమ్మాన్) ప్రకటించింది. భాషా పరిషత్ భారతీయ భాషల సాహిత్య వికాసం కోసం 1975లో బెంగాల్ రాష్ట్రంలో ఏర్పడిన సంస్థ. ఇది భారతదేశ బహుళ వాద సంస్కృతిని, దేశ అఖండతనూ సృజనాత్మకతనూ ప్రోత్సహిస్తున్న క్రియాశీలక సంస్థ.
2019 సంవత్సరానికిగాను ఈ పురస్కారాన్ని ఒక తెలుగు కవికి ప్రకటించారు. డా. ఎన్. గోపి రచించిన “కాలాన్ని నిద్రపోనివ్వను, జలగీతం, నానీలు, వృద్ధోపనిషత్” తదితర గ్రంథాలు హిందీతో పాటు పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైనాయి.
ఈ పురస్కారానికి గాను లక్ష రూపాయల నగదు, సన్మాన పత్రం, అంగవస్త్రం ప్రదానం చేస్తారు. ఈ మేరకు మార్చి 21, 2020న కలకత్తాలోని పరిషత్ సభాగారంలో జరిగే ప్రత్యేక సమావేశంలో (అలంకరణ సమారోహ్) పురస్కార ప్రదానం జరుగుతుందని భారతీయ భాషా పరిషత్ అధ్యక్షులు డా. కుసుమ్ ఖేమాని తెలిపారు.
(పరిషత్ ఉత్తరం జతచేయడమైనది)

నవంబర్ 25, 2014
తెలుగుతనానికి గానపథం
ఈటివిలో వచ్చే పాడుతా తీయగా- ఆ ఛానెల్లో వచ్చే కార్యక్రమాలకు తలమానికం. సినీ లలిత సంగీతానికి ప్రయోజనాత్మకం. ఆ కార్యక్రమాన్నిగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాసు) నిర్వహిస్తున్న తీరు నిరుపమానం, ఔత్సహికులకు గొప్ప వరం. ఇక అమెరికాలోని ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి బాసు ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతే పాత కార్యక్రమాలతో పోల్చితే- ఆ గాయనీ గాయకుల ప్రదర్శన కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. సంగీత కార్యక్రమాలకు ప్రతిభకే తప్ప ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదని కూడా అనిపించింది. ఇప్పుడు బాసు అమెరికాలో చిన్నారులకోసం కొత్తగా నిర్వహిస్తున్న ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమంలో కూడా గాన ప్రతిభ అంతంతమాత్రంగానూ, అడపా తడపా బహు చప్పగానూ అనిపిస్తోంది. మరి అమెరికాకోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అవసరమా అంటే అవసరమే!
బాసు నిర్వహించే కార్యక్రమం మనకు ప్రతిభావంతుల పాటలు వినిపించడానికి కాదు. మట్టిలో మాణిక్యాల్ని వెలికి తియ్యడానికీ, వజ్రాల్ని సానబెట్టడానికీ, అన్న విషయం- ఇప్పటికే నిరూపితమైంది. ఈ కార్యక్రమం సంగీత శిక్షణ. భాషోచ్చారణకు సవరణ. భావప్రకటనకు వివరణ.
తెలుగుతనానికి గానపథం
తెలుగు పాటలకు బాలు కదం
ఇది సుబ్రమణ్య జనితం
బాల సుబ్రమణ్య పథకం
అని పాడుకోవాలనిపిస్తుంది- ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అమెరికా తెలుగువారి వేషధారణలో, భాషోచ్చారణలో- అచ్చ తెలుగుతనాన్ని వీక్షించినప్పుడు. నిర్వాహకులు, పాల్గొనువారల నిబద్ధతను గమనించినప్పుడు. మాణిక్యాల్ని వెలికి తియ్యగలవారు- ఒక మట్టికే పరిమితం కాలేరు కదా! ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో దేశదేశాలకి విస్తరించి- తెలుగు భాషకీ, తెలుగు తనానికీ- అంతరిస్తాయన్న అనుమానమే లేకుండా చెయ్యగలవని మా నమ్మకం. మచ్చుకి నవంబర్ 24న వచ్చిన అమెరికాలో రాగసాగరిక కార్యక్రమంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.
ఈటివి, బాసులకి అభివందనాలు.