నవంబర్ 25, 2014

తెలుగుతనానికి గానపథం

Posted in పాడుతా తీయగా at 7:56 సా. by వసుంధర

ఈటివిలో వచ్చే పాడుతా తీయగా- ఆ ఛానెల్లో వచ్చే కార్యక్రమాలకు తలమానికం. సినీ లలిత సంగీతానికి ప్రయోజనాత్మకం.  ఆ కార్యక్రమాన్నిగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాసు) నిర్వహిస్తున్న తీరు నిరుపమానం, ఔత్సహికులకు గొప్ప వరం. ఇక అమెరికాలోని ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి  బాసు ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతే పాత కార్యక్రమాలతో పోల్చితే- ఆ గాయనీ గాయకుల ప్రదర్శన కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. సంగీత కార్యక్రమాలకు ప్రతిభకే తప్ప ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదని కూడా అనిపించింది. ఇప్పుడు బాసు అమెరికాలో చిన్నారులకోసం కొత్తగా నిర్వహిస్తున్న ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమంలో కూడా  గాన ప్రతిభ అంతంతమాత్రంగానూ, అడపా తడపా బహు చప్పగానూ అనిపిస్తోంది. మరి అమెరికాకోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అవసరమా అంటే అవసరమే!

బాసు నిర్వహించే కార్యక్రమం మనకు ప్రతిభావంతుల పాటలు వినిపించడానికి కాదు. మట్టిలో మాణిక్యాల్ని వెలికి తియ్యడానికీ, వజ్రాల్ని సానబెట్టడానికీ, అన్న విషయం- ఇప్పటికే నిరూపితమైంది. ఈ కార్యక్రమం సంగీత శిక్షణ. భాషోచ్చారణకు సవరణ. భావప్రకటనకు వివరణ.

తెలుగుతనానికి గానపథం

తెలుగు పాటలకు బాలు కదం

ఇది సుబ్రమణ్య జనితం

బాల సుబ్రమణ్య పథకం

అని పాడుకోవాలనిపిస్తుంది- ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అమెరికా తెలుగువారి వేషధారణలో, భాషోచ్చారణలో- అచ్చ తెలుగుతనాన్ని వీక్షించినప్పుడు. నిర్వాహకులు, పాల్గొనువారల నిబద్ధతను గమనించినప్పుడు. మాణిక్యాల్ని వెలికి తియ్యగలవారు- ఒక మట్టికే పరిమితం కాలేరు కదా! ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో దేశదేశాలకి విస్తరించి- తెలుగు భాషకీ, తెలుగు తనానికీ- అంతరిస్తాయన్న అనుమానమే లేకుండా చెయ్యగలవని మా నమ్మకం. మచ్చుకి నవంబర్ 24న వచ్చిన అమెరికాలో రాగసాగరిక కార్యక్రమంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈటివి, బాసులకి అభివందనాలు.

 

 

సెప్టెంబర్ 14, 2014

గోరేటి వెంకన్న పాడుతా తీయగా

Posted in పాడుతా తీయగా at 9:28 సా. by వసుంధర

టివిలో వచ్చే పాటల కార్యక్రమాల్లో పాడుతా తీయగా అర్థవంతం, ప్రయోజనాత్మకం, అపూర్వం. అద్భుతం. అందుకు కారణం ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. అక్షరజాలం ఆయన్ను ముద్దుగా బాసు అంటుంది. ముఖ్యంగా సంగీత ప్రియులు తప్పక చూడాల్సిన ఆ కార్యక్రమంలో ఒకోవారం ఒకో వింత అనుభవం. ఈ సెప్టెంబర్ 1, 8లలో వచ్చిన కార్యక్రమాల్లో గోరేటి వెంకన్న సమక్షం అలాంటిది. 8వ తేదీ కార్యక్రమం చివర్లో (లంకెకై ఇక్కడ క్లిక్ చెయ్యండి) అనగా కార్యక్రమం మొదలైన 57 నిముషాల తర్వాత ‘ఓ పుల్లా ఓ పుడకా ఎండు గడ్డీ’ అంటూ గోరేటి వెంకన్న ఆలపించిన గానాన్ని విని, అప్పటి ఆయన అనుభూతుల్ని వీక్షించి- అలౌకికానుభూతిని పొందగలరని ఆశ! ఆ లంకె ఆధారంగా అంతకు ముందరి కార్యక్రమాలనూ చేరుకోవచ్చునని మనవి.

జూన్ 5, 2014

పాడుతా తీయగా

Posted in పాడుతా తీయగా at 9:08 సా. by వసుంధర

harikishanఈ టివిలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం నిర్వహణలో వస్తున్న పాడుతా తీయగా కార్యక్రమం- అర్థవంతం, ప్రయోజనాత్మకం, విలక్షణం, విశిష్టం. సంగీతాభిమానులే కాక సత్కాలక్షేపాన్ని కోరేవారు కూడా తప్పక చూడవలసిన ఈ కార్యక్రమం ప్రతి సోమవారం రాత్రి9 గంటలకు వస్తున్నది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి ఒక ప్రత్యేక ఆకర్షణ. ఉదాహరణకి మే 12, 19 తేదీలలో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మిమిక్రీకి ప్రసిద్ధి చెందిన హరికిషన్. సరదాగా కొనసాగిన ఈ కార్యక్రమంలో 19వ తేదీన- హరికిషన్ ఒక చక్కని ఐటమ్ చేశారు. అది పాతాళభైరవి చిత్రంలో- మాంత్రికుడిగా ఎస్వీ రంగారావు బదులు- ప్రకాష్ రాజ్, తోటరాముడిగా ఎన్టీఅర్ బదులు- బాలకృష్ణ ఉంటే ఎలా ఉంటారో వినిపించడం. కొత్తగా సరదాగా ఉన్న ఆ ఐటమ్ ఉన్న కార్యక్రమానికి (విడియోలో 10.35 నిముషాల తర్వాత వస్తుంది) ఇక్కడ….

మార్చి 5, 2014

అమెరికాలో రాగసాగరిక

Posted in పాడుతా తీయగా at 9:34 సా. by వసుంధర

పాడుతా తీయగా అంటూ మన బాసు (బాలసుబ్రహ్మణ్యం) అమెరికా వెళ్లాడు. అది పాటల పోటీ కాదు. ఔత్సాహిక గాయకులకు లలిత సంగీత శిక్షణ. సంగీతప్రియులకు వీనులవిందు. సంగీత జిజ్ఞాసువులకు పరిజ్ఞానం. ఈ కార్యక్రమం ఇంత అపురూపంగా నిర్వహించడం అనితరసాధ్యం అనిపించేలా చేస్తున్నది మన బాసు. ఆయనకు అభినందనలు. గత కొద్ది మాసాలుగా అమెరికాలో రాగసాగరిక పేరిట ఆయన నిర్వహించిన పాడుతా తీయగా కార్యక్రమంలో అమెరికాలోని తెలుగువారు ఉత్సాహంగా పాల్గొన్నారు.  ఇందులో ఫైనల్సుకి చేరుకున్న నలుగురు విజేతలుః అర్జున్ అద్దేపల్లి (ప్రథమం), వంశీప్రియ (ద్వితీయం), ఉదయబిందు గొట్టపు (తృతీయం), మనీషా ఈరబత్తిని (చతుర్థం). విజేతలందరికీ అభినందనలు. ఐదువారాలు నడిచిన ఈ తుది ఘట్టం చూడడానికి ఇక్కడ ఇచ్చిన ఆయా తేదీలలో క్లిక్ చెయ్యండి. 

ఫిబ్రవరి 3    ఫిబ్రవరి 10    ఫిబ్రవరి 17   ఫిబ్రవరి 24   మార్చి 3 

ఈ కార్యక్రమంలో మనం గమనించాల్సిన కొన్ని అంశాలు. 

1. పాడుతా తీయగా అనన్య సామాన్యమైన గొప్ప లలిత సంగీత శిక్షణా కార్యక్రమం.

2. 67 ఏళ్ల వయసులో గాత్రమాధుర్యం ఏమాత్రం తగ్గకుండా, గానప్రతిభలో సాటివారికి దీటుగా- ఉన్న బాసు ఎందరికో ఆదర్శం, ప్రేరణ.

3. ఈ కార్యక్రమానికి నిరంతర వేదికగా ఉన్నఈటివి అభినందనీయం.

4. ఈ కార్యక్రమంలో వాద్యసంగీతం ఒక అద్భుతం.

 5. సినీ ప్రముఖులు భువినుంచి దివికి వచ్చిన అసాధారణ వ్యక్తులు అన్న భావం కలుగుతుంది- ఈ కార్యక్రమంలో వ్యాఖ్యలు వింటే. అసంఖ్యాకంగా సామాన్యులని ఆకర్షించడంవల్ల సినీప్రపంచానికి చెందినవారికి ఎక్కువ ప్రాచుర్యం లభించడం సహజం. వారి గుర్తింపు ఆ మేరకేననీ, మిగతావి అతిసయోక్తులనీ గ్రహించాలి.

6. అమెరికాలో రాగసాగరిక కార్యక్రమంలో అమెరికాలో ఉండే తెలుగువారు పాల్గొన్నారు. వారు తెలుగు పాటలు పాడడమే విశేషమని కొందరు ముచ్చటపడొచ్చు. కానీ తెలుగువారికి తెలుగు రావడం ముచ్చట పడాల్సిన అంశం కాదు. రాకపోవడం సిగ్గు పడాల్సిన విషయం. 

7. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు పాటల్లో చక్కని తెలుగు ఉచ్చారణతో మురిపించారు.  వారికి అభినందనలు. ఐతే పాటల్లో వినిపించిన ఉచ్చారణ మాటల్లో వినిపించకపోవడం గమనార్హం. అంటే వారు పోటీకోసం కష్టపడి పాటల్లో ఉచ్చారణ నేర్చుకున్నారు అనుకోవాలా? పాటలకు నేర్చుకున్నది మాటలకు అవసరం లేదనుకున్నారా? ముఖ్యంగా ప్రథమ బహుమతి గెల్చుకున్న అర్జున్ అద్దేపల్లి తన పేరు చెప్పేటప్పుడు కూడా- అర్జున్ ఆడ్‍పల్లి అని చెప్పడం కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఏ దేశమేగినా ఎందు కాలిడినా మాటాడు నీ భాష నీ వారికిలా అని అంతా అనుకోవాలి. 

8. జర్మనీలో గ్యోతే ఇన్‍స్టిట్యూట్ ద్వారా జర్మన్ భాషని ఉచ్చారణతో సహా పకడ్బందీగా నేర్పే ఏర్పాటుంది. అలాంటి సంస్థలు తెలుగులోనూ ఉద్భవించాలి. వాటిని బాసు వంటివారు నిర్వహించాలి. పాడుతా తీయగా కార్యక్రమంలో బాసు తెలుగు ఉచ్చారణ విషయమై వహిస్తున్న శ్రద్ధ, చేస్తున్న హెచ్చరికలు ఆదర్శప్రాయం. 

 

ఆగస్ట్ 27, 2013

పాడుతా తీయగా- అమెరికా ముచ్చట్లు

Posted in పాడుతా తీయగా at 9:37 సా. by వసుంధర

ఈటివి సమర్పిస్తున్న పాడుతా తీయగా కార్యక్రమం దేశపు ఎల్లలు దాటింది. ప్రస్తుతం అమెరికాలో సంగీతం హాబీగా ఉన్న విద్యాధికులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు పూనుకుంది. వారిలో చాలామంది ప్రతిభ ఆరంభంలో సామాన్యమనిపించినా, వారి ఉత్సాహం ముచ్చటేస్తుంది. ఈ కార్యక్రమంలో పాటలకంటే మాటల ముచ్చట్లు సరదాగా ఉన్నాయి.

ఆగస్ట్ 19, 26న జరిగిన కార్యక్రమంలో సినీ ప్రముఖుడు పరుచూరి గోపాలకృష్ణ ముఖ్య అతిథి. 26న కార్యక్రమంలో కొన్ని ముచ్చట్లు.

1. సినిమాలో ఇద్దరు పెద్ద హీరోలున్నా, పేరు గుండమ్మ కథ అని పెట్టడం గురించి.

2. ఒక దృశ్యం చిత్రీకరణ జరుగుతూండగా చక్రపాణిగారు వచ్చారుట. నాగేశ్వరరావు సీన్లో ఉండి- సినిమాకి వెడదాం, త్వరగా రా- అంటాడట. లోపల్నుంచి, వచ్చేస్తున్నా, జాకెట్ వేసుకుంటున్నా- అని సావిత్రి గొంతు వినిపిస్తుందిట. దర్శకుడు ఓకే చెబితే, సావిత్రి డైలాగుని- వచ్చేస్తున్నా, పూలు పెట్టుకుంటున్నా- అని మార్చి మళ్లీ తియ్యమన్నారుట  చక్రపాణి. ఎందుకంటే సావిత్రివంటి మహానటి జాకెట్ వేసుకుంటున్న దృశ్యాన్ని ప్రేక్షకుడు ఊహించుకునేలా డైలాగు ఉండరాదన్నారుట. (ఆ తర్వాత బ్రేక్‍లో వచ్చిన రేపటి కార్యక్రమం ప్రకటనలో ఆలీ- బాబా సెహగల్ తెలుగు గురించి ఒక జోక్ చెప్పాడు. ఆయన్ని ఓ హీరోయిన్ అడిగిందట- మీ ఆరోగ్యం బాగుందా అని. దానికి బాబా సెహగల్- మీది బాగుందా అనడిగాడు. ఒకే ఛానెల్లో కొద్ది నిముషాల తేడాలో ఇదీ తేడా. అదే ఛానెల్లో వచ్చే జబర్దస్త్ కార్యక్రమంలో గత వారం బహుమతి పొందిన ప్రహసనంలో ముఖ్యాంశం- అమ్మానాన్నల ఆట. అనుమానం అక్కర్లేదు. ప్రదర్శకుల ఉద్దేశ్యం సూటిగా అదే! ఆ ప్రదర్శనకు సినీప్రముఖులు- నాగబాబు, రోజా పడిపడి నవ్వారు).

౩. రావి ఇంటి పేరుగల ఓ గాయని తన పేరు, ఇంటి పేరు చెప్పగానే- ఆ ఇంటి పేరు గొప్పతనాన్ని వివరించడానికి- సాహితీ ప్రముఖులు రావి శాస్త్రి పేరు ఎస్పీబీ చెప్పడం ఆశ్చర్యం. ముందది జోక్ అనుకున్నాం కానీ, తర్వాత రావి కొండలరావు పేరు కూడా చెప్పారు. అంటే రావి అన్నది- రాచకొండ విశ్వనాథ- అనే రెండు పదాలకీ సంక్షిప్తమని ఎస్పీబీకి తెలియదా? అప్పుడాయన పక్కనే ఉన్న (ఒకప్పటి అధికార భాషా సమితి అధ్యక్షుడు) పరుచూరి గోపాలకృష్ణ సవరిస్తారనుకుంటే- రావి శాస్త్రి సినిమా ప్రవేశం గురించి అదనపు సమాచారం అందించి, రావి ఇంటిపేరున్న మరో ప్రముఖుని గురించి చెప్పారు.ఆమెరికా మాజీ అధ్యక్షుడు రోనాల్డ్ రీగన్ లోకజ్ఞానం గురించి- ప్రముఖ వ్యంగ్య రచయిత ఆర్ట్ బుచ్‍వాల్డ్ ఒకరు సాహితీప్రియులు. ఒకరు సాహితీ ప్రముఖులు. సమకాలీన ప్రముఖ రచయిత పేరు విషయంలో వారి ఈ పొరపాటు దురదృష్టం. 

ఈ కార్యక్రమంకోసం ఇక్కడ క్లిక్ చేసి స్పందించవలసిందిగా కోరుతున్నాం.

తరువాతి పేజీ