డిసెంబర్ 28, 2020

సాహితీ భీష్ములు – డి.వి. నరస రాజు

Posted in వెండి తెర ముచ్చట్లు, సాహితీ సమాచారం at 8:50 సా. by వసుంధర

వాట్‍సాప్ బృందం రచన లోగిలి సౌజన్యంతో

ఎలిజీలు – గొల్లపూడి మారుతి రావు

సాహితీ భీష్ములు – డి.వి. నరస రాజు

సరిగా నెల రోజుల కిందట చెన్నై బీచ్ లో వెళ్తూంటే నరసరాజు గారు
జ్ఞాపకం వచ్చారు. వెంటనే ఫోన్ చేశారు. వయస్సు కారణంగా గొంతు
బలహీనమయింది. కాని పలకరింతలో ఆప్యాయత తగ్గలేదు. “బాగున్నావా మారుతీరావ్!” అన్నారు. ఎప్పుడు ఫోనందుకున్నా ఇదే మొదటి వాక్యం. నన్ను అలా పిలిచేవాళ్ళు క్రమంగా తగ్గిపోతున్నారు. “ఇప్పుడే సాయంకాలం నడక
ముగించి వస్తున్నాను” అన్నారు. ఆరోగ్యం ఎలా ఉందన్నాను. “నాకేం బాగానే ఉన్నాను. కాళ్ళలో పట్టు కొంచెం తగ్గింది. చేతికర్ర పొడుస్తూ’ నడుస్తున్నాను” అన్నారు. దినచర్య అంతా అడగడం నాకలవాటు. మధ్యాహ్నం నిద్ర
మానేశానంటూ వివరంగా చెప్పారు. ‘ఆత్మకథ’ ప్రసక్తి వచ్చింది. “నువ్వు పుస్తకం కొనకు. హైదారబాద్ వచ్చినప్పుడు నన్ను కలిస్తే ఇస్తాను’ అన్నారు.
నరసరాజు గారితో ఎప్పుడు మాట్లాడినా ఓ పెద్దదిక్కు పలకరింత వినిపించేది. నాటకరంగం రోజుల నుంచీ మాకు సీనియర్. ఔత్సాహిక నాటకరంగం వికాసానికి తొలికొమ్ము కాసిన యోధులలో నరసరాజుగారొకరు. కొర్రపాటి, ఆత్రేయ,
పినిశెట్టి,
కొడాలి గోపాలరావు మేమంతా తర్వాతి తరం వాళ్ళం. ఆయన ‘వాపస్’ ఎన్నిసార్లు వేశానో! ఆయన చమత్కారానికి ఆనాటికే అది మచ్చుతునక. అతి మామూలు మాటల్లోంచి – కొత్త వాడినీ, చిక్కటి హాస్యాన్ని పిండగల రచయిత. ఆయన
‘నాటకం’ నాటకం, ఈ ఇల్లు అమ్మబడును, అంతర్వాణి మా తరానికి సుపరిచితాలు.
విషయాన్ని ‘కొత్త’ గా మలిచి – చివ్వున హాస్యాన్ని చిప్పిలేటట్టు చేయడంలో ఆయనకి ఆయనే సాటి. హాస్యాన్ని సరళంగా, గంభీరంగా, పెద్ద మనిషి తరహాలో నిలిపిన రచయిత. చవకబారు వెకిలితనానికి ఆయన హాస్యం స్థాయిని
ఏనాడూ దింపలేదు. ఈనాడు వినోదం వెర్రితలలు వేస్తున్న వెండితెరకి ఆయన అంటరానివాడుగా కనిపించవచ్చు.
ఓసారి ఏదో పెళ్లిలో నేనూ, ఆయనా, మాజీ చీఫ్ సెక్రటరీ ఐ.జె.నాయుడు గారూ అక్షింతలు వేసి వేదిక దిగుతున్నాం. “మీకు 50 వుంటుందా?” అన్నారు నాయుడుగారు నాతో. నవ్వి – ముందున్న నరసరాజుగారితో చెప్పాను – ఈయన
నా వయస్సు 50 వుంటుందా అని అడుగుతున్నారని. నరసరాజు గారు నవ్వి “లాభం లేదయ్యా, నీ వయస్సు తెలియడానికి నీ నల్లజుత్తుకి తెల్లరంగు వెయ్యాలి” అన్నారు. అదీ ఆయన సమయస్పూర్తి, చమత్కారానికి ఉన్న వాడి,
వేడి.
రేడియోకి రాయడానికి విసుగూ, నిర్లక్ష్యం చూపే ఆయనతో “ఇల్లు కట్టిచూడు” అనే నాటిక రాయించాను. నా రేడియో కెరీర్ లో చాలా తృప్తిగా నిర్వహించిన చిన్న
సీరియల్ “బస్తీలో బహుకుటుంబీకుడు” ఆయన రాసినది – సాక్షి, రావి కొండలరావు గారు దానికి ఊపిరిపోశారు. ఎన్టీఆర్ కి ఆ నాటిక వినిపిస్తే సినీమాగా తీయాలని ప్రయత్నాలు చేశారని నరసరాజు గారే అన్నారు.
వృత్తిలో గొప్ప క్రమశిక్షణ, డిగ్నిటీ, నిజాయితీ ఉన్న మనిషి. లాలూచీలూ, లోపాయకారీ వ్యవహారాలూ తెలీని మనిషి పుండరీకాక్షయ్య గారి భాస్కరచిత్రకి –
నేను కడప బదిలీ అయిన కారణంగా – ఎన్టీఆర్ చిత్రం వ్రాయడానికి ఆయన్ని పిలిచారు. ఆయన రేడియో రికార్డింగుకి వచ్చినప్పుడు “నేను భాస్కర చిత్రకి రాస్తున్నాను.
నీకేం బాకీలు లేవు కదా?” అని అడిగారు. నేను ఆశ్చర్యపోయాను. హిందీ మాతృకమీద ఆయనకి నమ్మకం లేక, ఆత్మవంచన చేసుకోలేక తప్పుకున్నారు. మళ్లీ
నేనే రాశాను – “మావారి మంచితనం” ప్రీవ్యూకి వచ్చి చూశాక “నేను బాగుండదను కొన్నానయ్యా – నువ్వే రైటు, బాగా రాశావు” అని భుజం తట్టారు. సినీరంగంలో దుక్కిపాటి, ఆయనా యిస్త్రీ చేసిన మల్లు పంచెలో ఎప్పుడూ
నిత్యనూతనంగా కనిపించేవారు. చాలా మంది రచయితల్లాగ కాకుండా ఆయన నటులు. ప్రసంగంలో కూడా ఆ మాటల విరుపుల్లో నాలాంటి వారికి ‘నటుడు’ కనిపించేవారు.
ఆయన నిండుకుండ. భార్యా వియోగం సంభవించినా దు:ఖాన్ని మనస్సులో దాచుకొని – జీవితం మీద ఆ ఛాయలు పడకుండా జీవయాత్ర సాగించిన వారిద్దరే అంటుంది మా ఆవిడ – సినారె, నరసరాజుగారు.
ఆ మధ్య ఎవరో స్క్రిప్టు వ్రాయమంటే “నేను వ్రాయడం మానేశాను” అని స్పష్టంగా చెప్పారట. అవసరాన్ని నిలవాల్సిన చోట నిలిపి – వృత్తిని ప్రలోభం చేసుకోని ఉదాత్తుడు నరసరాజుగారు.
రచయితల్లో నరసరాజుగారూ, నటుల్లో జగ్గయ్యగారూ నాకెందుకో మార్గదర్శకం. ఒకాయన క్రమశిక్షణకీ, మరొకాయన జ్ఞాన సముపార్జనకీ నిఘంటువులుగా నిలుస్తారు.
వృద్ధాప్యంలో ఆరోగ్యమూ, మనశ్శాంతీ కలిసిరావడం గొప్ప అదృష్టం. చేతికర్ర పొడుస్తూ నాకేం భయంలేదు. ఆరోగ్యం బాగుందన్న నరసరాజుగారు మరికొంతకాలం – అంతే హుందాగా జీవిక సాగిస్తారనుకొన్నాను. ఆయన ఆత్మకథని
ఆయన నోటంటా ఏ కాస్తో విని, ఓ సాయంకాలం గడపాలని ఆశించాను.
రచయిత ఆలోచనల్లో ఏనాటికీ అలసిపోడు. నెల రోజుల కిందటి ఆయన టెలిఫోన్ ప్రసంగమే అందుకు సాక్ష్యం. అయితే శరీరానికి ఆ ఏర్పాటు లేదు. తన చెప్పు చేతల్లో లేని ‘వయస్సుకి’ నరసరాజుగారు హఠాత్తుగా లొంగిపోయారు.
ఈమధ్య నటించిన ఓ సినిమాలో దర్శకుడిని అడిగాను : ఈ సినీమాకి సంభాష ణలు ఎవరు రాశారని. ఆయన నవ్వాడు – సంభాషణలు రాయడం అవసరమా? అన్నట్టు. ఆలోచన, ఓ ప్రణాళిక, నిర్దిష్టమయిన భావస్రవంతి – వెరసి –
నమ్మకమైన బాటలో ప్రేక్షకుడిని చెయ్యి పట్టుకు నడిపించే స్క్రీన్ ప్లే అవసరమున్న రోజులు క్రమంగా దూరమవుతున్నాయి. రేపటి తరానికి నరసరాజు గారు నిన్నటి ‘అవ్యవస్థ’ గా
గోచరిస్తే ఆశ్చర్యం లేదు – అలాంటి అవసరానికే వారు దూరమవుతున్నారు కనుక.
కాని మా తరానికి నరసరాజుగారు నాటకరంగం నుంచి గొప్ప సంప్రదాయాన్ని మోసుకువచ్చిన మార్గదర్శి. రచయితని గంభీరంగా ఎత్తయిన స్థానంలో నిలిపిన యోధుడు. పెద్ద మనుషులు, దొంగరాముడు, యమగోల, రాముడు-భీముడు
వంటి ఉత్తమ కళాఖండాల సృష్టికర్త.
అంతకుమించి రచయితల కులానికి భీష్మాచార్యులు. రేపటితరంలో మాటల రచయితలుండకపోతే ఆశ్చర్యం లేదు. ఆ ఒక్క కారణానికే నరసరాజు గారు రచయితల బాటలో సైన్ పోస్ట్.

డిసెంబర్ 25, 2020

మొదటి సారిగా ఒక తెలుగు సినిమా

Posted in వెండి తెర ముచ్చట్లు at 4:23 సా. by వసుంధర

తెలుగు భాషాభిమానులకు వందనాలు..చాలా రోజుల తర్వాత తెలుగులో..తెలుగు భాష గురించి ఒక తెలుగు సినిమా వచ్చింది..” ఒక తెలుగు ప్రేమకథ”..చాలా మంచి సినిమా..మిత్రుడు, తెలుగు భాషాభిమాని సంతోష్ కృష్ణ..దర్శకత్వం వహించారు.. ShreyasET అనే App లో వుంది..అందరూ చూసి ఆదరించండి.. తెలుగుభాషాభిమాని, తెలుగు కూటమి, పారుపల్లి కోదండరామయ్య.. చిత్ర లంకె:  http://watch.shreyaset.com/otpk

జూలై 20, 2020

అరుదైన పాట సింగీతం నోట

Posted in వెండి తెర ముచ్చట్లు, సంగీత సమాచారం at 4:54 సా. by వసుంధర

లంకె

89 సంవత్సరాలు.. అయితేనేమి?

ఆయన మీకు తెలిసిన గాయకుడు కాదు అయితేనేమి?

వారితో గళం కలిపి పాడే మనుమరాలు ప్రక్కనే లేదు.. అయితేనేమి?

సాలూరి వారిని, పింగళి వారిని గుర్తుచేసుకుంటూ సింగీతం శ్రీనివాసరావు గారు ఆలపించిన యుగళగీతం👌. ఈ గీతం 63 సంవత్సరాలక్రితం మాయాబజార్ సినిమా కోసం చేయబడింది. ఇన్నాళ్లు మనకి తెలియదు. ఇప్పుడు వీరు పాడారు.

కరోనా సమయంలో జనం, వైద్యులు, ఫస్ట్ రెస్పాండెంట్స్ మాస్కులు, ppe కిట్లు వేసుకుని తిరుగుతుంటే మీ అందరికి ఆదిత్య369 సినిమా గుర్తుకువచ్చి ఉంటుంది. గుర్తుకు రాకపోతే మరోసారి చూడండి.

భైరవద్వీపంలో పాటలు వారు కంపోజ్ చేసినవే. నరుడా.. ఓ నరుడా గుర్తుందా?

నిజ జీవిత గాధ అదే పాత్రధారితో తీసిన మొటివేషనల్ సినిమా ‘మయూరి’ సుధా చంద్రన్ గుర్తున్నారా? వీరే దర్శకులు. అయితే ఎక్కువ కన్నడ సినిమాలకు పనిచేశారు. వారి మొదటి చిత్రం తెలుగులో..” నీతి-నిజాయితీ”. మనిషి కూడా అంతే. పుట్టింది గొప్ప దుర్గంగా ప్రసిద్ధిగాంచిన ఉదయగిరి, మన నెల్లూరు జిల్లానే.

టాకీ యుగంలో పాత్రధారుల నోటమ్మట మాటరాని మూకీ టైప్ చిత్రం పుష్పకవిమానం సినిమా గుర్తుకుతెచ్చుకోండి.

సామాజిక కోణంలో జాతీయ ఉత్తమ చిత్రాలు తీశారు. ఆణిముత్యాలు తక్కువే ఉంటాయి. వీరు తీసినవి కూడా తక్కువే అయితేనేమి.

ఆయన son of Aladdien, ఘటోత్కచ యానిమేషన్ సీరియల్స్ కూడా తీశారు. ఆల్బమ్ కూడా చేశారు.

ఆయన స్వతహాగా గాయకుడు, అలాగే పాటల రచయిత, కంపోజర్, సంగీత దర్శకుడు, నిర్మాత, 5 భాషల్లో సినిమాల దర్శకుడు. వారికి వందనాలతో.- చలసాని

జూలై 13, 2020

వాట్‌సాప్ ముచ్చట్లు – సిఎస్‍ఆర్

Posted in వెండి తెర ముచ్చట్లు, సంగీత సమాచారం at 3:52 సా. by వసుంధర

మన శకుని మామ జయంతి సందర్భంగా నివాళులతో

శకుని ఉన్నచాలు శని ఏల అని కద
అవును నిజమే నేను అంత ఘనుడను
కాని పనులు అయిన కాజేసికొని గాని
మాని పోవ లేనే మాయలాడి

అవును లక్ష శనిగ్రహాల పెట్టు శకుని ఉండగా అసలు శని ఏమి చేస్తుంది అన్నట్టు ఎంత పెద్ద హీరో పక్కన ఉన్నా ప్రేక్షకుల చూపులను తన విలక్షణతతో తన వైపుకు తిప్పుకునే నటనా పటిమ. పద్యం చదవడములో ఎవరూ అనుసరించలేని దారి.. సంభాషణలు చెప్పడములో ఓ ప్రత్యేక శైలి. అసలు విజయా వారి మాయాబజార్ లో నాయకుడు అభిమన్యుడా, కృష్ణుడా, ఘటోత్కచుడా అని నిర్ణయించుకోలేక ఎవరికి తోచిన వివరణ వాళ్ళము ఇచ్చుకోవచ్చు గాక.. అందులో ప్రతినాయకుడు మాత్రం మన శకుని మావయ్యే. భానుమతి గారు తమ భరణీ సంస్థ లో సినిమా తీస్తూ సినిమా కి ఏం పేరు పెట్టాలో అని తేల్చుకోలేక సి ఎస్ ఆర్ అంతటి వారు ఉండగా ఇంక వేరే పేరెందుకు అని ఆయన పాత్ర పేరునే చక్రపాణి అని సినిమా పేరుగా నిర్ణయించారు. ఇంక శకుని పాత్రను ఎందరు చేసినా శకుని పాత్ర అంటే మొదట గుర్తుకు వచ్చేది మన అపర శకుని సి ఎస్ ఆర్ గారే.

నాటక రంగములో అనేక ఉద్దండుల పక్కన నటిస్తూ ప్రత్యేకతను ఏర్పరచుకొని సినిమా రంగములో శ్రీకృష్ణ, రామదాసు, తుకారాం, జయప్రద చిత్రములో పురూరవునిగా నాయక పాత్రలతో బాటు ప్రతినాయక పాత్రలు,హాస్యం, కరుణ రసం అన్నీ ప్రదర్శించగల దిట్ట. తెలుగులో ఆయన చేసిన కుచేలుడు పాత్ర చూసిన మలయాళం సినిమా నిర్మాత దర్శకుడు ఆయనే ఆ పాత్ర చేయాలని పట్టుబట్టి మరీ భక్త కుచేల చేయించుకున్నారు. మలయాళ సినిమా రంగములో అదో ఆణిముత్యం ఇప్పటికీ.

ఇంతకీ విజయా వారి అప్పు చేసి పప్పుకూడులో నాయకుడు ఎవరా అంటే ఇంకెవరూ సినిమా కథంతా సి ఎస్ ఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నారు అప్పట్లో ప్రేక్షకులు. శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం 1939 లో శ్రీవెంకటేశ్వర స్వామిగా కూడా నటించారు. పాదుకా పట్టాభిషేకం చిత్రములో రామునిగా నటించి మెప్పించారు.ఎన్నటికీ వసివాడని నవ నవ్య కథా చిత్రం పాతాళ భైరవి లో హృదయమున్న రాజుగా, కుమార్తె అంటే ప్రేమ ఉన్న తండ్రిగా ఆయన నటన ప్రేక్షకుల మెప్పులందినది. విజయా వారి జగదేకవీరుని కథ లో కొత్త మంత్రిగా హే రాజన్ అంటూ ఆయన నటన అద్వితీయము.ఆయన నటించిన ప్రతీ చిత్రములోని పాత్రా వైవిద్యమున్నదే.

ఆయన కేవలం నటుడి గానే కాక సామాజిక బాధ్యత ఉన్న నటుడు కూడా..స్వాతంత్ర్య సంగ్రామం సమయములో ఆజాద్ హిందు పౌజ్ లో అనేక నాటకాలు ప్రదర్శన చేసి అప్పటిలో పదివేల రూపాయల నిధిని నేతాజీ కి అందజేసిన ఘనుడు.

విభిన్న వాచకం గల ఆయన పాడిన అనేక పాటల్లో లభించేవి చాలా తక్కువ..

ఆయన 1948లో విడుదలైన భరణీవారి “రత్నమాల” కోసం “ఆగవే మరదలా” అనే పాట పాడారు.. సీనియర్ సముద్రాల రచించిన ఈ పాటకి సీఆర్ సుబ్బరామన్ సంగీతం నిర్వహించారు..

“ఆగవే మరదలా.. ఆగవే.. నీ ఆగడమిక కొనసాగదులే మరదలా – ఆగవే.. మారుపడని నీ రూపూ రేఖా.. నీ నడ తీరూ.. నీ సౌరూ.. గురుతు పట్టినాలే..

ఓ… మరదలా.. నను మరగిపోవగా నీ తరమా.. తంతులు నీ గంతులూ.. హనమంతుని ముందరటేనే మరదలా – పంత మెవరితోనే.. వలవంత ఏల.. బలవంత మేలనే.. రవ్వంతమాట విని నాతో.. రావే మరదరలా.. ఆగవే”..

జూలై 11, 2020

మన మహానటుడు గుమ్మడికి – ఓ వాట్‍సాప్ నివాళి

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:43 సా. by వసుంధర

‘బలరాముడంటే ఎవరు?’ అడిగాడు మా చిన్నాడు.

‘కృష్ణుడికి అన్నయ్య’ అని చెప్పాలని అనుకున్నవాణ్ణే ‘గుమ్మడి!’ అనేశాను. అనుకోకుండా అన్నాగానీ నిజానికి నేననుకునేది అదే! నేనేవిఁటీ, యావత్ తెలుగు ప్రజా అదే అపోహలో ఉన్నారు.

సూటిగా చూపు, ధీటైన ముక్కు, సరిసమానంగా పెరిగిన గెడ్డంతో హుందాగా నడిచొచ్చే ఆ పెద్దమనిషిని చూస్తే రారాజుకే కాదు, మనకూ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దుర్యోధనుడంటే ఏదో ప్రయోజనం ఆశించి కాళ్లూ, కాకాలూ పట్టాడనుకుందాం. మనకు మాత్రం ఆ ఠీవి, దర్పం చూసినా, ఆ గొంతులోంచి జాలువారే సుస్పష్టమైన తెలుగు పదాలు విన్నా ఇంకాసేపు ఆయన అలాగే తెరమీద కనబడితే బావుండుననే అనిపిస్తుంది.

శకుని ముందుగానే చెబుతాడు. ఆ బలరాముడు ముఖస్తుతికి పడిపోతాడని! అన్నట్టుగానే దుష్టచతుష్టయం చేసిన దొంగ మర్యాదలకు మిక్కిలి సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఆ ఉప్పొంగడాన్ని ఇంతవరకూ తెరమీద అంతలా ఎవరూ ఆవిష్కరించలేదని నా అభిప్రాయం.

తనకంతటి సత్కారం లభించిందన్న ఆనందం నరనరానా పాకుతోంటే ఆపుకోలేని భావోద్వేగాన్ని ముఖమంతా పరచుకుని మనందరికీ అర్ధమయ్యేలా చూపిస్తాడు. అంతలా ఒక దృశ్యం పండాలంటే ఆ పాత్రలో ఎంతలా మమేకమవ్వాలి? ఎంత తాదాత్మ్యత కావాలి? అదీ కేవలం ముప్ఫయ్యేళ్ల వయసున్న నటుడికి ఎంత సాధ్యం?

తనకంటే వయసులో పెద్దవారైన హీరోలకు అనేక చిత్రాల్లో తండ్రిగాను, మావగారిగాను నటించి, ఒక ముద్ర వేయించేసుకున్నాడు. నిజానికి ఆయన నటించిన ఏ చిత్రంలోనూ తన శరీరాకృతిని కోల్పోలేదన్న విషయాన్ని మనం చూడొచ్చు.

చక్కని రూపంతో, కనీసం గుప్పెడు పొట్ట కూడా కనబడని అంత అందమైన తండ్రికి ఎక్కడికక్కడ వేలాడిపోయే కొవ్వెక్కిన హీరోలు కొడుకులుగా నటిస్తూ ‘డాడీ..డాడీ!’ అంటూంటే ఈ కళ్లతోనే చూసి, ఈ చెవులతోనే విని ఇంకా బతికే ఉన్నాం.

‘జీవితరంగము’ అనే సినిమా చూశారా? కథాపరంగా అదొక టిపికల్ బాలచందర్ సినిమా. తెలుగులో వేరే దర్శకుడు పనిచేశారు. అందులో గుమ్మడి ఒక పేద పురోహితుడు. అధిక సంతానం, కటిక దరిద్రం. భార్యగా సావిత్రి నటించింది. తినడానికి తిండిగింజలు కూడా నిండుకుంటాయి. ఊళ్లో ఎవరూ ఆచారవ్యవహారాలు పాటించట్లేదని వాపోయే పాతకాలపు సంప్రదాయ బాపడు. తద్దినాలు, అపరకర్మలు నిష్టగా చెయ్యనివారితో గొడవపడి, చేసే కార్యక్రమం మధ్యలోనే ఆపేసి, సంభావన కూడా తీసుకోకుండా ఇంటికొచ్చేస్తూ ఉంటాడు.

పెద్ద కూతురు ప్రమీల ఉద్యోగం కోసం వెళ్లి, అనుకోని పరిస్థితుల్లో మోసగించబడుతుంది. ఒకరోజు తనకు మొదటిజీతం వచ్చిందంటూ నూటయాభై రూపాయలు తీసుకొచ్చి తండ్రి చేతిలోపెట్టి, పాదాలపై పడుతుంది. ‘నోరారా ఆశీర్వదించలేవా నాన్నా నన్ను?’ అనడుగుతుంది. కూతురిచ్చిన నోట్లను రెండుచేతుల్లోనూ ఆశ్చర్యంతో చూసుకుని ‘అర్ధరూపాయికీ, రూపాయికీ ఆనందపడిపోయి ఆశీర్వదించే పురోహితుణ్ణమ్మా నేను! ఏవిఁటో, ఇంత డబ్బు చూసేటప్పటికి నోటమాట రావడం లేదు నాకు!’ అంటూ ఉద్వేగపడిపోతాడు.

చాలు.

ఈ సినిమా నా ఖర్మకాలి ఓరాత్రివేళ ఒక్కణ్ణీ చూశాను. సరిగ్గా ఈ సన్నివేశం చూసిన మరుక్షణం నాకు దుఃఖం పెల్లుబికి వచ్చేసింది. అంతలా కదిలించేసిన బాలచందర్ మీద కోపమూ, అంత హృదయవిదారకంగా నటించిన గుమ్మడి మీద ఆగ్రహమూ కలిగాయి.

సినిమా మాధ్యమానికి ఇంత శక్తి ఉంటుందా? ఇలా ఏడిపించగల ప్రతిభావంతమైన నటనను ఆయనకు ఏ దేవుడు ప్రసాదించాడు? ఇదంతా రాస్తోంటే కూడా ఆ దృశ్యం కళ్లముందు కదలాడి కనులు తడిబారుతున్నాయి.

ఇక ‘సంపూర్ణ రామాయణం’లో విశ్వామిత్రుడు వచ్చి, యాగసంరక్షణకై రాముణ్ణి తనతో పంపమని కోరినప్పుడు, పట్టాభిషేకాన్ని ఆపి, రాముణ్ణి అడవులపాలు చెయ్యమని కైక వరమడిగినప్పుడు దశరథుడి ఆక్రోశం, ఆవేదన చూస్తే గుమ్మడితో పాటుగా మనకూ గుండె పట్టేస్తుంది.

ఆ తండ్రిమనసు ఎంత తల్లడిల్లిపోయిందో, ఎంత వేదన అనుభవించాడో స్వయంగా తనకుతానే దశరథుడిగా మారిపోయి, తన స్వంత కుమారుణ్ణే వదులుకుంటున్నంత విషాదాన్ని అణువణువునా శరీరమంతా నింపుకుని అద్వితీయమైన నటనతో మనందరినీ ఏడిపించేస్తాడు గుమ్మడి.

అదంతా దర్శకత్వ ప్రతిభ ఒక్కటే కాదు. ఆ పాత్రలన్నీ గుమ్మడి కోసమే ఉద్భవించాయి. అదే గుమ్మడి భృగుమహర్షిలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ‘వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో మనందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

ఇక దురదృష్టవశాత్తు గుండెపోటుకీ, గుమ్మడికీ లంకె పెట్టి, అనేక చిత్రాల్లో ఆయన్ని మంచాన పడెయ్యడమో, పాత్రకు మంగళం పాడయ్యడమో చేశారు మన రచయితలు, దర్శకులు. అదంతా నాకస్సలు నచ్చని వ్యవహారం.

ఒక్కసారి బ్లాక్ కలర్ సూటులో, చేతిలో పైపుతో గుమ్మడిని ఊహించుకోండి. ఎంత అందం, ఠీవి గోచరిస్తాయి ఆ నిండైన విగ్రహంలో? ఆకారమొకటే చాలనుకుంటే మనకు చాలామందే ఉన్నారు అందమైన నటులు. కానీ ఎన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ గట్టిగా నాలుగు సంభాషణల్ని కూడా తప్పుల్లేకుండానో, భావం కోల్పోకుండానో పలకగలిగే సామర్ధ్యం మాత్రం శూన్యం.

కేవలం ఆకారమొకటే కాకుండా నవరసాలనూ అవలీలగా పోషించగల సహజనటుడు మాత్రం గుమ్మడి ఒక్కడే!

కొందరు దర్శకులు కాస్త పక్కదారి పట్టి గుమ్మడి చేత ప్రతినాయక పాత్రల్లో నటింపజేశారు. అయితే ఆయన ఎంత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నా అందులో కూడా కొంత ఆత్మీయతే కనబడుతుంది మనకు. అది ఆ మహానుభావుడి ముఖారవిందం వల్లనే! కనుల నిండా కరుణతో, ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన పిచ్చితండ్రి మన గుమ్మడి.

పశ్చాత్తాపంతో కుమిలిపోయే దృశ్యాల్లో గుమ్మడి ఏడుస్తోంటే మనమూ ఏడుస్తాం. అదంతా ఆయనతో మనకున్న బాంధవ్యపు భావన! మన మేనమామే ఎదురుగా కూర్చున్నాడని అనిపించేలా మనందరినీ కాసేపు భ్రాంతిలోకి నెట్టేస్తాడు. ఆ సన్నివేశం పూర్తయిపోయిన తరవాత తెలుస్తుంది మనం హాల్లో కూర్చుని అదంతా చూస్తున్నామన్న సంగతి.

అప్పాజీగా గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్..

ఇంత కన్నులపంటకు ఏ భాషా ప్రేక్షకులూ నోచుకుని ఉండరేమో? అద్వితీయమైన నటన, భాషాసౌందర్యం, ఉచ్చారణాపరంగా చెవులకు హాయిగొలిపే ఆ ఇద్దరి సంభాషణలు, మూడుగంటల పాటు విజయనగర సామ్రాజ్యంలో విహరించి వచ్చేస్తాం మనందరం.

నిజానిజాలు, చరిత్రను వక్రీకరించడాలు, ఒకరిని ఎక్కువ చెయ్యడాలు.. ఇటువంటి వ్యర్ధవాదనలన్నీ పక్కనబడేసి చూస్తే ఇంతటి మహత్తరమైన చారిత్రాత్మక చిత్రాలు మన చిత్రపరిశ్రమ మనకందించిన స్వర్ణాభరణాలనే చెప్పొచ్చు.

గుమ్మడి లాంటి నటుణ్ణి చూసిన తరంగా మనందరం చాలా అదృష్టవంతులం. అటువంటి మహానటునికి సన్మాన సత్కారాలు సరైన రీతిలో జరిగాయని నేననుకోను.

ఆయన నటించిన విభిన్నమైన పాత్రలతో కూర్చిన దృశ్యాలన్నీ ఒక నెలరోజుల పాటు అధ్యయనం చేస్తే ఒక గ్రంథమే రూపొందించవచ్చు.

ఈ జన్మదినవేళ నాకెంతో ఇష్టమైన మనింటి మావయ్యకు మనఃపూర్వకంగా అక్షర నివాళులు!

…….కొచ్చెర్లకోట జగదీశ్

తరువాతి పేజీ