జూలై 13, 2020

వాట్‌సాప్ ముచ్చట్లు – సిఎస్‍ఆర్

Posted in వెండి తెర ముచ్చట్లు, సంగీత సమాచారం at 3:52 సా. by వసుంధర

మన శకుని మామ జయంతి సందర్భంగా నివాళులతో

శకుని ఉన్నచాలు శని ఏల అని కద
అవును నిజమే నేను అంత ఘనుడను
కాని పనులు అయిన కాజేసికొని గాని
మాని పోవ లేనే మాయలాడి

అవును లక్ష శనిగ్రహాల పెట్టు శకుని ఉండగా అసలు శని ఏమి చేస్తుంది అన్నట్టు ఎంత పెద్ద హీరో పక్కన ఉన్నా ప్రేక్షకుల చూపులను తన విలక్షణతతో తన వైపుకు తిప్పుకునే నటనా పటిమ. పద్యం చదవడములో ఎవరూ అనుసరించలేని దారి.. సంభాషణలు చెప్పడములో ఓ ప్రత్యేక శైలి. అసలు విజయా వారి మాయాబజార్ లో నాయకుడు అభిమన్యుడా, కృష్ణుడా, ఘటోత్కచుడా అని నిర్ణయించుకోలేక ఎవరికి తోచిన వివరణ వాళ్ళము ఇచ్చుకోవచ్చు గాక.. అందులో ప్రతినాయకుడు మాత్రం మన శకుని మావయ్యే. భానుమతి గారు తమ భరణీ సంస్థ లో సినిమా తీస్తూ సినిమా కి ఏం పేరు పెట్టాలో అని తేల్చుకోలేక సి ఎస్ ఆర్ అంతటి వారు ఉండగా ఇంక వేరే పేరెందుకు అని ఆయన పాత్ర పేరునే చక్రపాణి అని సినిమా పేరుగా నిర్ణయించారు. ఇంక శకుని పాత్రను ఎందరు చేసినా శకుని పాత్ర అంటే మొదట గుర్తుకు వచ్చేది మన అపర శకుని సి ఎస్ ఆర్ గారే.

నాటక రంగములో అనేక ఉద్దండుల పక్కన నటిస్తూ ప్రత్యేకతను ఏర్పరచుకొని సినిమా రంగములో శ్రీకృష్ణ, రామదాసు, తుకారాం, జయప్రద చిత్రములో పురూరవునిగా నాయక పాత్రలతో బాటు ప్రతినాయక పాత్రలు,హాస్యం, కరుణ రసం అన్నీ ప్రదర్శించగల దిట్ట. తెలుగులో ఆయన చేసిన కుచేలుడు పాత్ర చూసిన మలయాళం సినిమా నిర్మాత దర్శకుడు ఆయనే ఆ పాత్ర చేయాలని పట్టుబట్టి మరీ భక్త కుచేల చేయించుకున్నారు. మలయాళ సినిమా రంగములో అదో ఆణిముత్యం ఇప్పటికీ.

ఇంతకీ విజయా వారి అప్పు చేసి పప్పుకూడులో నాయకుడు ఎవరా అంటే ఇంకెవరూ సినిమా కథంతా సి ఎస్ ఆర్ ఉన్నాడు కాబట్టి ఆయనే అన్నారు అప్పట్లో ప్రేక్షకులు. శ్రీవెంకటేశ్వర మహాత్మ్యం 1939 లో శ్రీవెంకటేశ్వర స్వామిగా కూడా నటించారు. పాదుకా పట్టాభిషేకం చిత్రములో రామునిగా నటించి మెప్పించారు.ఎన్నటికీ వసివాడని నవ నవ్య కథా చిత్రం పాతాళ భైరవి లో హృదయమున్న రాజుగా, కుమార్తె అంటే ప్రేమ ఉన్న తండ్రిగా ఆయన నటన ప్రేక్షకుల మెప్పులందినది. విజయా వారి జగదేకవీరుని కథ లో కొత్త మంత్రిగా హే రాజన్ అంటూ ఆయన నటన అద్వితీయము.ఆయన నటించిన ప్రతీ చిత్రములోని పాత్రా వైవిద్యమున్నదే.

ఆయన కేవలం నటుడి గానే కాక సామాజిక బాధ్యత ఉన్న నటుడు కూడా..స్వాతంత్ర్య సంగ్రామం సమయములో ఆజాద్ హిందు పౌజ్ లో అనేక నాటకాలు ప్రదర్శన చేసి అప్పటిలో పదివేల రూపాయల నిధిని నేతాజీ కి అందజేసిన ఘనుడు.

విభిన్న వాచకం గల ఆయన పాడిన అనేక పాటల్లో లభించేవి చాలా తక్కువ..

ఆయన 1948లో విడుదలైన భరణీవారి “రత్నమాల” కోసం “ఆగవే మరదలా” అనే పాట పాడారు.. సీనియర్ సముద్రాల రచించిన ఈ పాటకి సీఆర్ సుబ్బరామన్ సంగీతం నిర్వహించారు..

“ఆగవే మరదలా.. ఆగవే.. నీ ఆగడమిక కొనసాగదులే మరదలా – ఆగవే.. మారుపడని నీ రూపూ రేఖా.. నీ నడ తీరూ.. నీ సౌరూ.. గురుతు పట్టినాలే..

ఓ… మరదలా.. నను మరగిపోవగా నీ తరమా.. తంతులు నీ గంతులూ.. హనమంతుని ముందరటేనే మరదలా – పంత మెవరితోనే.. వలవంత ఏల.. బలవంత మేలనే.. రవ్వంతమాట విని నాతో.. రావే మరదరలా.. ఆగవే”..

జూలై 11, 2020

మన మహానటుడు గుమ్మడికి – ఓ వాట్‍సాప్ నివాళి

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:43 సా. by వసుంధర

‘బలరాముడంటే ఎవరు?’ అడిగాడు మా చిన్నాడు.

‘కృష్ణుడికి అన్నయ్య’ అని చెప్పాలని అనుకున్నవాణ్ణే ‘గుమ్మడి!’ అనేశాను. అనుకోకుండా అన్నాగానీ నిజానికి నేననుకునేది అదే! నేనేవిఁటీ, యావత్ తెలుగు ప్రజా అదే అపోహలో ఉన్నారు.

సూటిగా చూపు, ధీటైన ముక్కు, సరిసమానంగా పెరిగిన గెడ్డంతో హుందాగా నడిచొచ్చే ఆ పెద్దమనిషిని చూస్తే రారాజుకే కాదు, మనకూ చేతులెత్తి నమస్కరించాలనిపిస్తుంది. దుర్యోధనుడంటే ఏదో ప్రయోజనం ఆశించి కాళ్లూ, కాకాలూ పట్టాడనుకుందాం. మనకు మాత్రం ఆ ఠీవి, దర్పం చూసినా, ఆ గొంతులోంచి జాలువారే సుస్పష్టమైన తెలుగు పదాలు విన్నా ఇంకాసేపు ఆయన అలాగే తెరమీద కనబడితే బావుండుననే అనిపిస్తుంది.

శకుని ముందుగానే చెబుతాడు. ఆ బలరాముడు ముఖస్తుతికి పడిపోతాడని! అన్నట్టుగానే దుష్టచతుష్టయం చేసిన దొంగ మర్యాదలకు మిక్కిలి సంతోషంతో ఉప్పొంగిపోతాడు. ఆ ఉప్పొంగడాన్ని ఇంతవరకూ తెరమీద అంతలా ఎవరూ ఆవిష్కరించలేదని నా అభిప్రాయం.

తనకంతటి సత్కారం లభించిందన్న ఆనందం నరనరానా పాకుతోంటే ఆపుకోలేని భావోద్వేగాన్ని ముఖమంతా పరచుకుని మనందరికీ అర్ధమయ్యేలా చూపిస్తాడు. అంతలా ఒక దృశ్యం పండాలంటే ఆ పాత్రలో ఎంతలా మమేకమవ్వాలి? ఎంత తాదాత్మ్యత కావాలి? అదీ కేవలం ముప్ఫయ్యేళ్ల వయసున్న నటుడికి ఎంత సాధ్యం?

తనకంటే వయసులో పెద్దవారైన హీరోలకు అనేక చిత్రాల్లో తండ్రిగాను, మావగారిగాను నటించి, ఒక ముద్ర వేయించేసుకున్నాడు. నిజానికి ఆయన నటించిన ఏ చిత్రంలోనూ తన శరీరాకృతిని కోల్పోలేదన్న విషయాన్ని మనం చూడొచ్చు.

చక్కని రూపంతో, కనీసం గుప్పెడు పొట్ట కూడా కనబడని అంత అందమైన తండ్రికి ఎక్కడికక్కడ వేలాడిపోయే కొవ్వెక్కిన హీరోలు కొడుకులుగా నటిస్తూ ‘డాడీ..డాడీ!’ అంటూంటే ఈ కళ్లతోనే చూసి, ఈ చెవులతోనే విని ఇంకా బతికే ఉన్నాం.

‘జీవితరంగము’ అనే సినిమా చూశారా? కథాపరంగా అదొక టిపికల్ బాలచందర్ సినిమా. తెలుగులో వేరే దర్శకుడు పనిచేశారు. అందులో గుమ్మడి ఒక పేద పురోహితుడు. అధిక సంతానం, కటిక దరిద్రం. భార్యగా సావిత్రి నటించింది. తినడానికి తిండిగింజలు కూడా నిండుకుంటాయి. ఊళ్లో ఎవరూ ఆచారవ్యవహారాలు పాటించట్లేదని వాపోయే పాతకాలపు సంప్రదాయ బాపడు. తద్దినాలు, అపరకర్మలు నిష్టగా చెయ్యనివారితో గొడవపడి, చేసే కార్యక్రమం మధ్యలోనే ఆపేసి, సంభావన కూడా తీసుకోకుండా ఇంటికొచ్చేస్తూ ఉంటాడు.

పెద్ద కూతురు ప్రమీల ఉద్యోగం కోసం వెళ్లి, అనుకోని పరిస్థితుల్లో మోసగించబడుతుంది. ఒకరోజు తనకు మొదటిజీతం వచ్చిందంటూ నూటయాభై రూపాయలు తీసుకొచ్చి తండ్రి చేతిలోపెట్టి, పాదాలపై పడుతుంది. ‘నోరారా ఆశీర్వదించలేవా నాన్నా నన్ను?’ అనడుగుతుంది. కూతురిచ్చిన నోట్లను రెండుచేతుల్లోనూ ఆశ్చర్యంతో చూసుకుని ‘అర్ధరూపాయికీ, రూపాయికీ ఆనందపడిపోయి ఆశీర్వదించే పురోహితుణ్ణమ్మా నేను! ఏవిఁటో, ఇంత డబ్బు చూసేటప్పటికి నోటమాట రావడం లేదు నాకు!’ అంటూ ఉద్వేగపడిపోతాడు.

చాలు.

ఈ సినిమా నా ఖర్మకాలి ఓరాత్రివేళ ఒక్కణ్ణీ చూశాను. సరిగ్గా ఈ సన్నివేశం చూసిన మరుక్షణం నాకు దుఃఖం పెల్లుబికి వచ్చేసింది. అంతలా కదిలించేసిన బాలచందర్ మీద కోపమూ, అంత హృదయవిదారకంగా నటించిన గుమ్మడి మీద ఆగ్రహమూ కలిగాయి.

సినిమా మాధ్యమానికి ఇంత శక్తి ఉంటుందా? ఇలా ఏడిపించగల ప్రతిభావంతమైన నటనను ఆయనకు ఏ దేవుడు ప్రసాదించాడు? ఇదంతా రాస్తోంటే కూడా ఆ దృశ్యం కళ్లముందు కదలాడి కనులు తడిబారుతున్నాయి.

ఇక ‘సంపూర్ణ రామాయణం’లో విశ్వామిత్రుడు వచ్చి, యాగసంరక్షణకై రాముణ్ణి తనతో పంపమని కోరినప్పుడు, పట్టాభిషేకాన్ని ఆపి, రాముణ్ణి అడవులపాలు చెయ్యమని కైక వరమడిగినప్పుడు దశరథుడి ఆక్రోశం, ఆవేదన చూస్తే గుమ్మడితో పాటుగా మనకూ గుండె పట్టేస్తుంది.

ఆ తండ్రిమనసు ఎంత తల్లడిల్లిపోయిందో, ఎంత వేదన అనుభవించాడో స్వయంగా తనకుతానే దశరథుడిగా మారిపోయి, తన స్వంత కుమారుణ్ణే వదులుకుంటున్నంత విషాదాన్ని అణువణువునా శరీరమంతా నింపుకుని అద్వితీయమైన నటనతో మనందరినీ ఏడిపించేస్తాడు గుమ్మడి.

అదంతా దర్శకత్వ ప్రతిభ ఒక్కటే కాదు. ఆ పాత్రలన్నీ గుమ్మడి కోసమే ఉద్భవించాయి. అదే గుమ్మడి భృగుమహర్షిలా విపరీతమైన అహంకారాన్ని ప్రదర్శిస్తూ ‘వెంకటేశ్వర మహాత్మ్యం’ చిత్రంలో మనందరినీ ఆశ్చర్యపరుస్తాడు.

ఇక దురదృష్టవశాత్తు గుండెపోటుకీ, గుమ్మడికీ లంకె పెట్టి, అనేక చిత్రాల్లో ఆయన్ని మంచాన పడెయ్యడమో, పాత్రకు మంగళం పాడయ్యడమో చేశారు మన రచయితలు, దర్శకులు. అదంతా నాకస్సలు నచ్చని వ్యవహారం.

ఒక్కసారి బ్లాక్ కలర్ సూటులో, చేతిలో పైపుతో గుమ్మడిని ఊహించుకోండి. ఎంత అందం, ఠీవి గోచరిస్తాయి ఆ నిండైన విగ్రహంలో? ఆకారమొకటే చాలనుకుంటే మనకు చాలామందే ఉన్నారు అందమైన నటులు. కానీ ఎన్ని సంవత్సరాలుగా పరిశ్రమలో ఉన్నా ఇప్పటికీ గట్టిగా నాలుగు సంభాషణల్ని కూడా తప్పుల్లేకుండానో, భావం కోల్పోకుండానో పలకగలిగే సామర్ధ్యం మాత్రం శూన్యం.

కేవలం ఆకారమొకటే కాకుండా నవరసాలనూ అవలీలగా పోషించగల సహజనటుడు మాత్రం గుమ్మడి ఒక్కడే!

కొందరు దర్శకులు కాస్త పక్కదారి పట్టి గుమ్మడి చేత ప్రతినాయక పాత్రల్లో నటింపజేశారు. అయితే ఆయన ఎంత కాఠిన్యాన్ని ప్రదర్శిస్తున్నా అందులో కూడా కొంత ఆత్మీయతే కనబడుతుంది మనకు. అది ఆ మహానుభావుడి ముఖారవిందం వల్లనే! కనుల నిండా కరుణతో, ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన పిచ్చితండ్రి మన గుమ్మడి.

పశ్చాత్తాపంతో కుమిలిపోయే దృశ్యాల్లో గుమ్మడి ఏడుస్తోంటే మనమూ ఏడుస్తాం. అదంతా ఆయనతో మనకున్న బాంధవ్యపు భావన! మన మేనమామే ఎదురుగా కూర్చున్నాడని అనిపించేలా మనందరినీ కాసేపు భ్రాంతిలోకి నెట్టేస్తాడు. ఆ సన్నివేశం పూర్తయిపోయిన తరవాత తెలుస్తుంది మనం హాల్లో కూర్చుని అదంతా చూస్తున్నామన్న సంగతి.

అప్పాజీగా గుమ్మడి, కృష్ణదేవరాయలుగా ఎన్టీఆర్..

ఇంత కన్నులపంటకు ఏ భాషా ప్రేక్షకులూ నోచుకుని ఉండరేమో? అద్వితీయమైన నటన, భాషాసౌందర్యం, ఉచ్చారణాపరంగా చెవులకు హాయిగొలిపే ఆ ఇద్దరి సంభాషణలు, మూడుగంటల పాటు విజయనగర సామ్రాజ్యంలో విహరించి వచ్చేస్తాం మనందరం.

నిజానిజాలు, చరిత్రను వక్రీకరించడాలు, ఒకరిని ఎక్కువ చెయ్యడాలు.. ఇటువంటి వ్యర్ధవాదనలన్నీ పక్కనబడేసి చూస్తే ఇంతటి మహత్తరమైన చారిత్రాత్మక చిత్రాలు మన చిత్రపరిశ్రమ మనకందించిన స్వర్ణాభరణాలనే చెప్పొచ్చు.

గుమ్మడి లాంటి నటుణ్ణి చూసిన తరంగా మనందరం చాలా అదృష్టవంతులం. అటువంటి మహానటునికి సన్మాన సత్కారాలు సరైన రీతిలో జరిగాయని నేననుకోను.

ఆయన నటించిన విభిన్నమైన పాత్రలతో కూర్చిన దృశ్యాలన్నీ ఒక నెలరోజుల పాటు అధ్యయనం చేస్తే ఒక గ్రంథమే రూపొందించవచ్చు.

ఈ జన్మదినవేళ నాకెంతో ఇష్టమైన మనింటి మావయ్యకు మనఃపూర్వకంగా అక్షర నివాళులు!

…….కొచ్చెర్లకోట జగదీశ్

బొబ్బిలి పులి – వాట్‍సాప్ కబుర్లు

Posted in వెండి తెర ముచ్చట్లు at 7:32 సా. by వసుంధర

బొబ్బిలిపులి (జూలై 9, 1982, విడుదల)

సరిగా 38 సంవత్సరాల క్రితం విడుదలైన బొబ్బిలిపులి సినిమా విశేషాలు:-

బొబ్బిలిపులి’
‘మీ అసలు పేరు’
‘బొబ్బిలిపులి’
‘మీ తల్లిదండ్రులు పెట్టినపేరు’
‘బొబ్బిలిపులి బొబ్బిలిపులి బొబ్బిలిపులి… ఎన్నిసార్లు చెప్పమంటారు?’

జ్ఞాపకం వచ్చాయా ఆ డైలాగులు. జ్ఞాపకం వచ్చిందా ఆ కోర్టు సీను. జ్ఞాపకం వచ్చిందా కోర్టు బోనులో గర్జిస్తూ కనిపించిన ఆ పెద్దపులి.
ఎస్… బొబ్బిలిపులికి 38 ఏళ్లు వచ్చాయి.
కానీ… నేటికీ దాని పంజా గుర్తులు చెరిగిపోలేదు.
దాని గాండ్రింపుల ప్రతిధ్వని మాసిపోలేదు.
ఆ ఠీవీ.. ఆ దర్పం.. ప్రేక్షకులకు అందించిన ఆ ఎనర్జీ…

38 ఏళ్ల తర్వాత కూడా… స్టిల్… బొబ్బిలిపులి!
ఈ సినిమా నుంచి ఇప్పటికీ సినిమాలు పుడుతున్నాయి.

ఈ సినిమా నుంచి ఇండస్ట్రీ ఇప్పటికీ రీచార్జ్ అవుతోంది.

ఈ నటన చూసి కొత్తతరం ఇప్పుడూ ఓనమాలు దిద్దుకుంటోంది.

ఈ డైలాగులకు ఇప్పటికీ ఆశ్చర్యపడుతూనే ఉంది. తెలుగు సినిమాల్లో రాయల్ బెంగాల్ టైగర్ ఇది.
పంజాతో కొడితే- అది పెద్దపులి.
డైలాగ్‌తో కొడితే- అది బొబ్బిలిపులి.

క్లయిమాక్స్ సీన్.
బొబ్బిలిపులి: నాకు ఒక్క అవకాశం ఇస్తారా యువరానర్.

జడ్జి: ఎస్

బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళ్లడానికి నాకు అవకాశం ఉందా?

జడ్జి: అవును. ఉంది.

బొబ్బిలిపులి: పైకోర్టుకు వెళితే ఏం జరుగుతుంది యువరానర్?

జడ్జి: శిక్ష తగ్గించవచ్చు లేదా అదే శిక్షను ఖాయం చేయవచ్చు

బొబ్బిలిపులి: అంటే ఈ కోర్టులో వేసిన శిక్ష పై కోర్టులో పోవచ్చు. ఆ కోర్టులో వేసిన శిక్ష ఆ పై కోర్టులో పోవచ్చు. లేదా కింద కోర్టువారు వేసిన శిక్షే పైకోర్టు వారు ఖాయం చేయవచ్చు. అంటే ఒక కోర్టుకీ ఇంకో కోర్టుకీ సంబంధం ఉండొచ్చు. ఉండకపోవచ్చు. కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పుంటే మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్. ఒక్కొక్క కోర్టులో ఒక్కొక్క న్యాయం ఉంటుంది కనుకనే నేరస్తుడు తాను చేసిన నేరం ఏమిటో మర్చిపోయాకకాని శిక్ష పడదు. ఓకే… ఓకే యువరానర్. ఆఖరుసారిగా ఒక్క ప్రశ్న అడుగుతున్నాను. నాకీ ఉరిశిక్ష ఎందుకు విధించారు?

జడ్జి: మనుషుల్ని చంపినందుకు.

బొబ్బిలిపులి: ఓ… మను షుల్ని చంపితే ఉరిశిక్ష విధిస్తారు కదూ. మరి ఆనాడు యుద్ధంలో నేను ఒక్కణ్ణి సుమారు నాలుగు వందల మందిని దారు ణంగా చంపాను. అంటే హత్య చేశాను. మరిదానికి నాకు ఉరిశిక్ష విధించలేదే? పైగా నేనేదో పెద్ద ఘనకార్యం చేశానని మహావీరచక్ర బిరుదునిచ్చి నన్ను సత్కరించారు. ఆ సత్కారం దేనికి యువరానర్? ఆ బిరుదు దేనికి యువరానర్? ఆరోజు యుద్ధంలో నేను చంపినవాళ్లెవరో నాకు తెలియదు. వాళ్లు మనకు సంబంధం లేనివాళ్లు. మన పొరుగువాళ్లు. మన తోటి సోదరులు. మనమెలా మన దేశాన్ని రక్షించుకోవడానికి వెళ్లామో వాళ్లు కూడా అలా వాళ్ల దేశాన్ని రక్షించుకోవడానికి వచ్చినవాళ్లు. వాళ్లని చంపితే సన్మానం. సత్కారం. మహావీర బిరుద ప్రదానం. మరి మనవాళ్లు మన దేశాన్ని దేశ ప్రజానీకాన్ని పేద ప్రజల్ని న్యాయస్థానాల్ని న్యాయాన్ని రక్షించే స్థావరాలని కొల్లగొడుతూ తమ స్వార్థానికి ఉపయోగించుకుంటున్న వీళ్లను చంపితే అది నేరం. దానికి బహుమానం ఉరిశిక్ష. ఆహా… యువరానర్. నాకిచ్చిన మహావీరచక్ర బిరుద ప్రదానం నా దేశాన్ని కాపాడుకోవడం కోసమే అయితే… నా దేశాన్ని పరిరక్షించుకోవడం కోసమే అయితే అది అప్పుడు కాదు యువరానర్… ఇప్పుడు… ఇప్పుడు నాకివ్వాలి. నిజంగా మన దేశాన్ని నేను ఇప్పుడు కాపాడాను. వాళ్లు మన దేశానికే శత్రువులు. వీళ్లు మన దేశాభ్యుదయానికే శత్రువులు. వాళ్లు ముందుకు వచ్చి తుపాకులతో పోరాడారు. వీళ్లు వెనక్కు వచ్చి వెన్నుపోటు పొడిచారు. వాళ్లలో నిజాయితీ ఉంది. వీళ్లలో కుట్ర. కుళ్లు. కుతంత్రం. వాళ్లను చంపితే సన్మానం. సత్కారం. వీళ్లను చంపితే ఉరిశిక్ష. భేష్… భేష్… ఇదే మీ చట్టమైతే మీకూ మీ చట్టానికి కోటి వందనాలు. ఇదే మీ న్యాయమైతే మీకూ మీ న్యాయానికి శతకోటి అభివందనాలు. ఇదే మీ ధర్మమైతే మీకూ మీ ధర్మానికి అనంతకోటి సాష్టాంగ నమస్కారాలు. దట్సాల్!


సెన్సార్‌బోర్డ్ రివైజింగ్ కమిటీ చైర్మన్ ఆఫీసులో గడియారం ముల్లు చేసే శబ్దం తప్ప అంతా నిశ్శబ్దంగా ఉంది.

చైర్మన్ సీటులో ఎల్వీ ప్రసాద్ కూచుని ఉన్నారు.

ఎదురుగా బొబ్బిలిపులి దర్శకుడు దాసరి. నిర్మాత వడ్డే రమేష్.

అంతకు ముందే మద్రాసు రీజనల్ కమిటీ బొబ్బిలిపులిని చూసింది. మూడు వేల అడుగుల కట్స్ చెప్పింది. మూడు వేల అడుగులు! అంటే సినిమా మిగలదు. ఎన్టీఆర్ మిగలడు. ఎన్టీఆర్ చెప్పే డైలాగులూ మిగలవు. డైలాగులు ఎవరిక్కావాలి. సెంట్రల్‌లో ఇందిరాగాంధీ గవర్నమెంట్ ఉంది. ఈ డైలాగులన్నీ ఆమె పాలనను కించపరిచేలా ఉన్నాయి. ప్రభుత్వాన్ని తూర్పారబట్టేలా ఉన్నాయి. కనుక ఇవన్నీ తీసేయాలంది రీజనల్ కమిటీ. దీని మీద తేల్చుకుందామని రివైజింగ్ కమిటీకి వచ్చారు దాసరి, వడ్డే రమేష్.

ఎల్వీ ప్రసాద్ సినిమా చూశారు.

వాళ్లను పిలిచారు. ఇక తీర్పు చెప్పాలి. ‘ఏం లేదు. పాత కట్స్ మర్చిపోండి. ఓన్లీ సింగిల్ కట్ ఇస్తున్నాను. క్లయిమాక్స్ మొత్తం తీసేయండి’
ఆయన చేతిలోని పేపర్ వెయిట్ – పరిచిన న్యూస్‌పేపర్ మీద – నిశ్శబ్దంగా గింగిరాలు కొట్టి, మెల్లగా అతి మెల్లగా ఆగింది. కాని దాసరి, రమేష్‌ల గుండెలు మాత్రం అంతకంతకూ వేగం పుంజుకొని ధన్‌ధన్ అని కొట్టుకుంటున్నాయి.

‘సార్’ అన్నారు ఇద్దరూ.

‘మీరున్నారన్న ధైర్యంతో వచ్చాం సార్’ అన్నారు మళ్లీ.

‘ఏం ధైర్యం. రేపు విమర్శలు వస్తే మీరు సమాధానం చెప్పాలా నేను చెప్పాలా? క్లయిమాక్స్ తీసేయండి. అంతే.’

వాళ్లిద్దరూ లేచి నిలబడ్డారు.

‘ఏం నిర్ణయించుకున్నారు?’ అడిగారు ఎల్వీ ప్రసాద్.

దాసరి ఒక్క క్షణం పాజ్ ఇచ్చారు.
అప్పటికే ఆయనకు తిక్క రేగి ఉంది.
ఎన్టీఆర్‌కు కోర్టు సీన్ చదివి వినిపించిన మాడ్యులేషన్‌లోనే ఎల్వీ ప్రసాద్‌తో చెప్పారు – ‘కోర్టు కోర్టుకీ తీర్పు తీర్పుకీ ఇంత మార్పు ఉంటుంది కనుకనే మేం ఢిల్లీ ట్రిబ్యునల్‌లో తేల్చుకుంటాం యువరానర్’.


విజిపి గార్డెన్స్ అప్పటికి పూర్తిగా చల్లబడింది.
మద్రాసు నగరం మీద కాచిన ఎండ – వేడిగా ఇంకా వేడిగా జనాన్ని ఎంత మాడ్చినా సాయంత్రమయ్యేసరికి సముద్రంగాలికి తోక ముడుస్తుంది. పారిపోతోంది. ఇప్పుడు ఆ చల్లగాలి కోసం విజిపికి వచ్చారు దాసరి, రమేష్.
సాధారణంగా దాసరి మనసు బాగలేనప్పుడు, ఆయన గంభీరంగా మారిపోయినప్పుడు సన్నిహితుల సమక్షంలో ఏకాంతంగా గడుపుతారు. కాటేజ్ బుక్ అయ్యింది. రమేష్‌ను గదిలోనే వదిలిపెట్టి స్లిప్పర్స్ ధరించి బీచ్ ఒడ్డున అలా నడక మొదలెట్టారు దాసరి.

ఆయన గుండెల్లో దుఃఖం పొంగుకొస్తుంది. బొబ్బిలిపులి తన బిడ్డ. తాను కన్నబిడ్డ. పురుడు పోసుకున్న ఈ బిడ్డ ప్రేక్షకుల ఒడికి చేరాలి. కాని చేరడం లేదు. ఇన్‌క్యుబేటర్‌లో ఉండిపోయింది. బతుకుతుందో లేదో తెలియదు. చచ్చిపోతుందో ఏమో తెలియదు. అప్పటికే షూటింగ్ పూర్తయ్యి మూడు నెలలు అయిపోయింది. జనం ఎప్పుడెప్పుడా అని సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. నిర్మాత పెట్టిన పెట్టుబడి అలాగే ఉంది. పడిన కష్టమూ అలాగే ఉంది. అన్నింటికీ మించి బొబ్బిలిపులి పాత్రకు జీవం పోసి, గర్జించి, తెలుగు వెండి తెరకు మరోపులి లేడూ రాడూ అని నిరూపించిన ఎన్టీఆర్ నటనా వైదుష్యమూ అలాగే ఉండిపోయింది.

ఇదంతా ఎప్పుడు బయటపడాలి? ఎప్పుడు ప్రొజెక్టర్లకు ఎక్కాలి?

దాసరి నడక ఆపి, కెరటాలు పాదాలను ముద్దాడుతుండగా స్థిమిత పడి, స్థిరంగా ఒక నిర్ణయం తీసుకున్నారు.

‘తప్పదు. సినిమా విడుదల కోసం అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తాను. నా కోసం కాదు. ఎన్టీఆర్ కోసం. ఆయనకో గొప్ప సినిమా ఇస్తానని మాట ఇచ్చాను. ఆ మాటను నిలబెట్టుకోవడం కోసమైనా సరే ఆమరణ దీక్ష చేస్తాను’…

ఆ నిర్ణయం తీసుకున్నాక దాసరికి ఎన్టీఆర్ గుర్తుకొచ్చారు.

ఊటీలో ఆ తెల్లవారుజామున ఆయనలో దర్శించిన దివ్యత్వమూ గుర్తుకొచ్చింది. …

‘సువిశాలాంధ్రకు విప్లవజ్యోతి సీతారామరాజు…
అల్లూరి సీతారామరాజు…

నవ చైతన్య నికేతన మార్గదర్శకుడు
సీతారామరాజు… మన సీతారామరాజు…’

రెండేళ్ల క్రితం ‘సర్దార్ పాపారాయుడు’ సినిమా కోసం బుర్రకథను షూట్ చేస్తున్నారు. ఊటీలో షూటింగ్. తెల్లవారుజామున సంధ్యావందనం కోసం వెళుతున్న సీతారామరాజు మీద తొలి షాట్.

‘బ్రదర్. రేపు ఐదుగంటలకు ఉంటే సరిపోతుందా?’ అడిగారు ఎన్టీఆర్.
ఆయన అప్పటికే మానసికంగా అల్లూరి సీతారామరాజుగా మారిపోయి ఉన్నారు. ముఖంలో ఒకరకమైన రుషిత్వం.
‘గెటప్ చూసుకున్నారా?’ అడిగారు దాసరి.
‘ఆ సంగతి నాకు వదిలిపెట్టండి బ్రదర్. రేపు చూస్తారుగా’ అన్నారు ఎన్టీఆర్.

ఆ ఉదయం- పొడవైన చెట్ల కాండాలను తాకి, చీలి, పొగమంచు సాగిపోతూ ఉండగా – జివ్వుమని చల్లగాలి తాకిన ప్రతి మేనుకూ గగుర్పాటును కలిగిస్తూ ఉండగా – నగారాలోని బుర్రకథకు మరొక్కసారి మన్యపు వాతావరణం ప్రతిష్ఠితం అవుతూ ఉండగా – అదిగో ఎన్టీఆర్… కాదు కాదు అల్లూరి సీతారామరాజు… ఒంటికి కాషాయ వస్త్రాలు, నుదుటిన తిలకం, చేతిలో విల్లు, భుజానికి పొది, నడుముకు బిగించి కట్టిన విప్లవవర్ణ చిహ్నం ఎర్రవస్త్రం… పులిలాంటి అడుగులు…
దాసరికి మాటరాలేదు.

ఆ వచ్చేది మానవమాత్రుడిగా గోచరించలేదు.
ఈయన రుషి. ఈయన దివ్యపురుషుడు. బహుశా ఈయన కూడా ఒక అవతార పురుషుడే.

జీవితంలో ఎప్పుడూ ఎవరికీ పాదాభివందనం చేసి ఎరగని దాసరి ఒక్కసారిగా తన్మయుడై ఒంగి పాదాభివందనం చేశారు.

ఎన్టీఆర్ కదిలిపోయారు.
‘బ్రదర్… ఏమిటి ఇది’ ఆయన కళ్లల్లో ఒక కళాకారుడికి మాత్రమే సాధ్యమైన స్పందన తాలూకు తడి.

‘ఏమో సార్. మీ పాదాలకు నమస్కరించాలనిపించింది. చేశాను’ అన్నారు దాసరి.

ఎన్టీఆర్ మౌనంగా వెళ్లి దూరంగా ఉన్న కుర్చీలో కూచున్నారు.

తర్వాత దాసరిని పిలిచారు.
‘బ్రదర్. నాటి మహానుభావుల పాత్రలను తెరపై మేము చేస్తున్నాం. మా పాత్రను భవిష్యత్తులో ఎవరైనా వెండితెరపై చేస్తారా?’

చాలా చిత్రమైన ప్రశ్న.
దాసరి ఆలోచించి సమాధానం చెప్పారు.
‘ఎందుకు చేయరు సార్. జనం మెచ్చే పని, వారికి సేవ చేసి చరిత్రలో మిగిలే పని చేస్తే తప్పక వేస్తారు’
ఎన్టీఆర్ తల పంకించారు.

మరికొన్నాళ్లకు ఆయన రాజకీయ రంగ ప్రవేశ ప్రకటన వెలువడింది.


మద్రాస్ బజుల్లా రోడ్డులో కార్ పార్కింగ్ ఎప్పుడూ సమస్యే. ఆ రోడ్డులో ఉండే ఎన్టీఆర్ కోసం వచ్చే విజిటర్స్ డజనుకుపైగా బయట కార్లు పార్క్ చేసి ఉంటారు. అదే రోడ్డులో ఉండే దాసరి కోసం ఇంకో డజను.

ఇప్పుడు ఎన్టీఆర్ ఇంటి బయట ఇంకా రద్దీ పెరిగింది. ఎక్కడెక్కడి నుంచో జనాలు తండోపతండాలుగా వచ్చి ఆయనను దర్శించుకుని వెళుతున్నారు. ఆయన పార్టీ అనౌన్స్ చేయలేదు. కాని రాజకీయ రంగప్రవేశం దాదాపుగా ఖరారే అన్న వాగ్దాన ప్రకటన వచ్చింది. ఒక హీరో, రాముడు, కృష్ణుడు, పేదల కోసం పోరాడే పరాక్రమవంతుడు, నైతిక వర్తనుడు, ఆకర్షక శక్తి… తమ కోసం తమ బాగు కోసం రాజకీయాల్లోకి వస్తున్నాడంటే ప్రజలకు ఎంత వేడుక. అభిమానులకు ఎంత సంబరం.

‘వారిని సంతోషపెట్టే ఆఖరు ప్రయత్నం చేద్దాం బ్రదర్’ అన్నారు ఎన్టీఆర్ ఒకరోజు దాసరిని పిలిచి.
‘బహుశా ఇది మా చివరి చిత్రం కావచ్చు. మీరు దానిని బ్రహ్మాండంగా తీయాలి’ అని ఆఫర్ ఇచ్చారు.
దాసరి అప్పటికి యధావిధిగా బిజిగా ఉన్నారు. ఇంకా చేతిలో బోలెడన్ని సినిమాలు ఉన్నాయి.
అయినా ఇది గొప్ప చాన్స్.

దాసరి ఎన్టీఆర్‌ని పరికించి చూశారు.
తెలియని తేజస్సుతో వెలిగిపోతున్నాడాయన.
‘సార్. నిన్న మొన్నటి దాకా మీరు ఇండివిడ్యుయల్. ఇవాళ మీరే ఒక అఖండ ప్రజాసమూహం. మిమ్మల్ని ఒక పాత్రలోకి అదుపు చేయడం కష్టమేమో సార్’

ఎన్టీఆర్ నవ్వారు.
‘జనహితం కోసం అవసరమైతే అన్నిరకాల అదుపులనూ అడ్డంకులనూ దాటి విప్లవాత్మకంగా పోరాడే హీరోగా చూపించండి బ్రదర్’

దాసరికి ఏదో ఫ్లాష్ వెలిగినట్టయ్యింది. అది క్రమక్రమంగా మెదడు కణజాలమంతా వ్యాపించి వెలుగుతో నిండి అందులో నుంచి ఒక ఆకారం ప్రత్యక్షమై…. ఆయన పెదాలు నెమ్మదిగా ఒక మాటను ఉచ్ఛరించాయి…

‘బొబ్బిలిపులి’


భారీ సినిమా. భారీ ప్రొడ్యూసర్ కావాలి.
వడ్డే రమేష్ నేను రెడీ అని వచ్చారు.
భారీ సినిమా. భారీ తారాగణం కావాలి.
శ్రీదేవి, సత్యనారాయణ, రావుగోపాలరావు, జగ్గయ్య, జయచిత్ర, ప్రభాకర రెడ్డి, అల్లు రామలింగయ్య మేము రెడీ అని వచ్చారు.
డెరైక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీ- కె.ఎస్. మణి.
స్టంట్స్- మాధవన్
స్టెప్స్- సలీమ్.

పాటలు- దాసరికి తోడుగా వేటూరి

సంగీతం- విజయమాధవి ఆస్థాన విద్వాంసుడు జె.వి.రాఘవులు.

అంతా బాగుంది. అద్భుతంగా ఉంది. కాని కథ?
కథ కూడా భారీగా ఉండాలి. అది ఇంకా దాసరి బుర్రలో రూపు దాల్చలేదు. సమయం దగ్గర పడుతోంది. షూటింగ్ పెట్టుకోవాలి. ఏం చేయాలి? ఏం చేయాలి? కోడెరైక్టర్ నందం హరిశ్చంద్రరావుని వెంటబెట్టుకుని వాకింగ్‌కు బయలుదేరారు.


మనదేశంలో ఎప్పుడూ కొందరు ఉత్సాహవంతులు ఒక కామెంట్ చేస్తూ ఉంటారు- మిలట్రీ రూల్ వస్తే తప్ప ఈ దేశం బాగుపడదూ అని.

అది గుర్తొచ్చింది దాసరికి.
మిలట్రీ దాకా వెళ్లక్కర్లేదు. ఒక సైనికుడి పాత్రను తీసుకుందాం అనుకున్నారాయన. వెంటనే త్రెడ్ దొరికింది.

‘ఒక సైనికుడు దేశ శత్రువులను తుదముట్టించి మహావీర చక్ర బిరుదు పొందుతాడు. అదే సైనికుడు సమాజ శత్రువులను తుదముట్టించినందుకు ఉరిశిక్షను కానుకగా పొందుతాడు. ఇదేం న్యాయం?’
ఆ ఆలోచన వచ్చాక ఆగలేదాయన. చకచకా సన్నివేశాలు రాసుకుంటూ వెళ్లారు. ఒక సైనికుడు. సెలవులకు ఇంటికి వస్తాడు. ప్రేమలో పడతాడు. పెళ్లి చేసుకుందాం అనుకుంటాడు. ఇంతలో సమాజంలోని దుర్మార్గాలను చూస్తాడు. నేను ఉండవలసింది సరిహద్దుల్లో కాదు, ఇక్కడే అని నిశ్చయించుకుని తిరగబడతాడు.

చెబుతుంటే దాసరి రోమాలు నిక్కపొడుచుకున్నాయి.
ఎన్టీఆర్ కళ్లు విశాలమయ్యాయి.

‘చాలా బాగుంది బ్రదర్. ప్రొసీడ్’ అన్నారాయన.
కాని మనది సగటు ప్రేక్షకుడి సమాజం. సగటులో సగటుగా ఉండే స్త్రీ ప్రేక్షకుల సమాజం. ఇలాంటి కథలో ఆడవాళ్లకు నచ్చే పాయింట్ ఉండాలి.

మొదటి పాయింట్: ప్రియుడి బాగు కోసం తన ప్రేమను త్యాగం చేసే ప్రియురాలు. రెండో పాయింట్: భర్త బతికే ఉన్నా చనిపోయాడనుకొని బొట్టు తీసేసే భార్య. చాలు అనుకున్నారు దాసరి.

ఇంకా కొంచెం పెప్ కావాలా?
భార్య చనిపోతుంది. భర్త కోసం పోలీసులు కాపు కాచి ఉంటారు. హీరో కాటికాపరి వేషంలో వచ్చి కొరివి పెడతాడు. చాలు అనుకున్నారు దాసరి.

ఇంకా కొంచెం కన్నీరు కావాలా?
హీరో యుద్ధంలో ఉంటాడు. తల్లి చనిపోయినట్టుగా అతడికి వర్తమానం వస్తుంది. కదలడానికి లేదు. పైగా స్థయిర్యం కోల్పోయిన సైనికులను ఉత్తేజితులను చేస్తూ పాట పాడాలి.
చాలు అనుకున్నారు దాసరి.

ఇంకా కొంచెం కారం కావాలా?
క్లయిమాక్స్ సీన్.
మాటలు ఫిరంగులై మోగుతాయి. వాదనలు పిడుగులై ఉరుముతాయి. హీరో సమాజపు సకల అపసవ్యతలను ప్రశ్నిస్తూ గర్జిస్తాడు.
చాలు. ఇంతకంటే ఎక్కువ మందుగుండు దట్టిస్తే ప్రేక్షకులు తట్టుకోలేరు.


ఎన్టీఆర్ డేట్స్ 38 రోజులు.
ఎక్స్‌పోజ్ చేసిన ఫిల్మ్ 50 వేల అడుగులు.
బడ్జెట్ 50 లక్షలు.
నిర్మాణ సమయం 50 రోజులు.
అంతా రెడీ.
సెన్సార్ అయ్యి ఇంక రిలీజ్ కావాలి.
రిలీజ్ కావాలి.
రిలీజ్ కా…………………………వాలి.


ప్రతి క్రైసిస్‌లోనూ ఒక హీరో ఉంటాడు.
ఈ క్రైసిస్‌లో కూడా ఉన్నాడు. నటుడు ప్రభాకర రెడ్డి.

సినిమా రిలీజ్‌కు ప్రతిబంధకాలు ఏర్పాడ్డాయి అని తెలిసిన వెంటనే రమేష్ నాయకత్వంలో ప్రభాకర రెడ్డి రంగంలో దిగారు. ఎందుకంటే ఆయన వడ్డే రమేష్‌కు ఆప్తుడు. అదీగాక ఈ సినిమా చాలా మంచి సినిమా అని ఆయన నమ్మకం. దీనికి అపకారం జరక్కూడదు.

వడ్డే రమేష్‌తో పాటు ఢిల్లీలో దిగిన ప్రభాకర రెడ్డి మొదట చేసిన తెలివైన పని ఏమిటంటే ‘సమ్మతి తయారీ’.

‘బొబ్బిలిపులి బాగుంది అనే మాట ఢిల్లీలో మారుమోగాలి’ అనుకున్నాడాయన.
మొదట తెలుగు తమిళ ఐఏఎస్‌లను ఒక పద్దెనిమిది మందిని పోగేశాడు. వాళ్లకు సినిమా చూపించాడు.

‘బాగుంది. ఎన్టీఆర్ మహానుభావుడు. ఈ సినిమాకు కట్స్ ఎందుకు’ అన్నారందరూ.

ఆ తర్వాత పి.వి.నరసింహారావు, పెండెకంటి వెంకట సుబ్బయ్య, జనరల్ కృష్ణారావు, అప్పటి డెప్యూటీ సిఎం జగన్నాథరావు వీళ్లందరినీ జత చేసి మళ్లీ షో వేశాడు. వాళ్లు చూసి ‘నీకెందుకు మేం చూసుకుంటాం’ అని రమేష్‌కు హామీ ఇచ్చారు.

దాదాపుగా సగం ఇబ్బంది దూరమైనట్టే.
ఆ తర్వాత రమేష్, ప్రభాకర రెడ్డి కలిసి మద్రాసులో ఉన్న దాసరికి ఫోన్ చేశారు.

‘మీరు వెంటనే రండి. ఇంకొక్కరికి చూపిస్తే మన సినిమా రిలీజైపోతుంది’

‘ఎవరాయన?’
‘మన తెలుగువాడే. నీలం సంజీవరెడ్డి. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా’

దాసరి టక్కున ఫోన్ పెట్టేసి ఢిల్లీ బయలుదేరారు. నీలం సంజీవరెడ్డి ప్రత్యేకంగా రాష్ట్రపతి భవన్‌లో సినిమా చూశారు. రాష్ట్రపతి చూసి బాగుంది అన్నాక సెన్సార్ అధికారుల కత్తెర్లు టేబుల్ సొరుగుల్లోకి నిష్ర్కమించాయి.
జూలై 9, 1982న బొబ్బిలిపులి రిలీజయ్యింది.


ఏనుగు కుంభస్థలాన్ని కొడితే-
అది పెద్దపులి.
కలెక్షన్ల కుంభస్థలాన్ని కొల్లగొడితే-
అది బొబ్బిలిపులి.


చాలాచోట్ల రేయింబవళ్లు షోస్ వేశారు.
చిన్న చిన్న ఊళ్లల్లో కూడా రెండు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. చాలాచోట్ల వందరోజులు నూట డెబ్బయ్ అయిదు రోజులు ఆడింది. చాలామంది ఎగ్జిబిటర్లు బొబ్బిలిపులి పుణ్యమా అంటూ ఏదో ఒక చిన్న కారో పెద్ద మేడో సంపాదించుకున్నారు.


బొబ్బిలిపులి ఎన్టీఆర్‌ని హీరో నుంచి నాయకుడిగా రీచార్జ్ చేసింది. ఎన్టీఆర్‌కు ప్రత్యామ్నాయం లేదు అని వాస్తవాన్ని ఖరారు చేసింది.
పరిత్రాణాయ సాధూనాం…
వినాశాయచ దుష్కృతాం….
దక్షిణాది సినీ పరిశ్రమ చెత్త సినిమాలతో నీరసించినప్పుడల్లా భారతీయుడు, ఠాగూర్, శివాజీ వంటి సినిమాలు రావడానికి ఇన్‌స్పిరేషన్‌గా నిలిచి ముప్పయ్ ఏళ్ల తర్వాత కూడా రీచార్జ్ చేస్తూనే ఉంది.

జై తెలుగు సినిమా. జై జై బొబ్బిలిపులి.

రోరింగ్ రికార్డ్స్
విడుదల: 1982 జులై 9
నిర్మాణ వ్యయం: సుమారు 50 లక్షల రూపాయలు
నిర్మాణ ప్రాంతాలు: మద్రాసు, ఊటీ
నిర్మాణ సమయం: 50 రోజులు
రికార్డులు:
తెలుగునాట తొలిసారి 100కు పైగా థియేటర్లలో విడుదలైంది.
తొలిరోజే రూ.13 లక్షలు వసూలు చేసింది.
తొలివారంలో రూ.71 లక్షలకు పైగా వసూలు చేసింది.
రెండు వారాలకు కోటి రూపాయలు వసూలు చేసింది.
ఓవరాల్‌గా రూ.మూడు కోట్లకు పైగా వసూలు చేసింది.
39 కేంద్రాల్లో వందరోజులు ప్రదర్శితమైంది.
హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎం.థియేటర్‌లో
175 రోజులాడి రికార్డ్ సృష్టించింది.

ఆ క్రమశిక్షణ రాదు
సినిమా ఫీల్డ్‌లోకి ఎంటరైనప్పటినుంచీ ఎన్టీఆర్‌తో సినిమా తీయాలనేది నా కల. ‘బొబ్బిలిపులి’ ఆ కల నెరవేర్చింది. దాసరితో నాది ప్రత్యేకమైన అనుబంధం. ఆయనతో పది సినిమాలు తీశాను. ఎన్టీఆర్ లాంటి హీరోని మళ్లీ చూడలేం. దాసరి లాంటి దర్శకులు ఇక రారు. ఉదయం ఏడు గంటలకు షూటింగంటే 6 గంటల 45 నిమిషాలకే మేకప్‌తో సిద్ధంగా ఉండేవారు ఎన్టీఆర్. దాసరి కూడా క్రమశిక్షణ విషయంలో ఎన్టీఆర్‌తో పోటీపడేవారు. అలాంటి క్రమశిక్షణ వల్లే ‘బొబ్బిలిపులి’ లాంటి భారీ చిత్రాన్ని కూడా అవలీలగా చేయగలిగాం. ఈ సినిమా మీద నమ్మకంతో ఒక్క ఏరియా మినహా మొత్తం సొంతంగా రిలీజ్ చేసుకున్నాం.
– వడ్డే రమేష్, నిర్మాత

దటీజ్ ఎన్టీఆర్
బొబ్బిలి రాజవంశానికి చెందిన తాండ్ర పాపారాయుడికి ‘బొబ్బిలిపులి’ అని బిరుదు ఉంది. దాన్నే టైటిల్‌గా పెట్టాను. ఈ సినిమాకు క్లైమాక్సే ప్రాణం. దాదాపు 20 నిమిషాలు కోర్టు సీన్. మద్రాసు ఏవీయమ్ స్టూడియోలో కోర్టు సెట్ వేశాం. ఎన్టీఆర్ ఉదయం 9 గంటలకు వస్తారు. నేను గంట ముందే లొకేషన్‌కు వెళ్లాను. సెట్‌లో ఓ మూల కూర్చున్నాను. ఏవేవో ఆలోచనలు. కోర్టు సీన్ మార్చి ఇంకా బాగా రాయాలనిపించింది. వెంటనే మొదలుపెట్టాను. అలా ఏకధాటిగా 35 పేజీలు రాసేశాను. టైమ్ చూస్తే 11 గంటలైంది. అప్పటికే ఎన్టీఆర్ వచ్చేశారు. నేను రాసుకోవడం చూసి డిస్ట్రబ్ చేయొద్దని ఆయనే చెప్పారట. అందరికీ నేను రాసిన కొత్త డైలాగ్స్ వినిపించాను. ఎన్టీఆర్ ఆ స్క్రిప్టు తీసుకుని ‘‘మధ్యాహ్నం రెండు గంటల నుంచి షూటింగ్ చేద్దాం’’ అని వెళ్లిపోయారు. ఇంటికి లంచ్‌కి వెళ్లారేమోననుకున్నా. కానీ.. ఆయన మెరీనా బీచ్‌కి వెళ్లి అక్కడ ఆ డైలాగ్స్‌ని ప్రాక్టీస్ చేశారట. ఆ తర్వాత అన్నీ సింగిల్ టేక్‌లోనే చేసేశారు. దటీజ్ ఎన్టీఆర్.
– దాసరి నారాయణరావు


సంభవం… నీకే సంభవం
తెలుగు చలనచిత్ర చరిత్రలో రికార్డులు తిరగరాయాలన్నా…రికార్డు బ్రేక్‌ కలెక్షన్లు సృష్టించాలన్నా…తన రికార్డులు తానే బద్దలు కొట్టుకోవాలన్నా ఒక్క నందమూరి తారక రామారావుకే సంభవం. కేవలం ఆరువారాల గ్యాప్‌లో రెండు బ్లాక్‌బస్టర్‌ చిత్రాలలో నటించిన ఖ్యాతి ఒక్క నటరత్నకే సంభవం…9-7-1982న విడుదలెైన ‘బొబ్బిలిపులి’ 38 సంవత్సరాలు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ‘బొబ్బిలిపులి’పెై ప్రత్యేక వ్యాసం…

కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఎన్‌టిఆర్‌ న్యాయమూర్తిగా జీవించిన చిత్రం ‘జస్టిస్‌ చౌదరి’ విడుదలెైన ఆరువారాలకే దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మరో సంచలనం సృష్టించడానికి విడుదలెైన చిత్రం ‘బొబ్బిలి పులి’. విజయమాధవి ప్రొడక్షన్స్‌ పతాకంపెై వడ్డే శోభనాద్రి నిర్మాతగా 1982 జులెై 9న సుమారు 100కు పెైగా థియేటర్లలో విడుదలెైన తొలి తెలుగు చిత్రంగా ఒక రికార్డును సృష్టించిన ఈ సినిమాకి అడ్డంకులెన్నో. విడుదల కాకముందర అనేక సెన్సార్‌ ఇబ్బందులను ఎదుర్కొని ఆఖరుకు కేంద్ర మంత్రులు కూడా ఈ సినిమాను చూసి ఎట్టకేలకు ఎటువంటి కట్స్‌ లేకుండా సినిమాను విడుదల చేసుకోవచ్చనే అనుమతిని ఇచ్చారు. దీనికి మూడు నెలలకు పెైగానే పట్టింది. సరిగ్గా అదే సమయానికి నటరత్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీస్థాయికి రెపరెపలాడేలా చేశారు.

అప్పటి కేంద్ర ప్రభుత్వం బొబ్బిలి పులి మీద కక్షసాధింపు చర్యగా భావించి , రాష్టవ్య్రాప్తంగా ఎన్‌టిఆర్‌ అభిమానులు ‘బొబ్బిలిపులి’ చిత్రం విడుదల కోరుతూ ఉద్యమాలు, ధర్నాలు నిర్వహించారు. అలా విడుదల కాకముందే ఈ చిత్రం మరో సంచలనం సృష్టించింది. ఇక విడుదలయ్యాక అప్పటిదాకా కేవలం రోజుకు 3 ఆటలు ప్రదర్శించే థియేటర్లు బొబ్బిలి పులి చిత్రం విడుదలయ్యాక జనం రద్దీని తట్టుకోవడానికి రోజుకు నాలుగు ఆటలూ బొబ్బిలిపులి చిత్రాన్నే ఆడించాల్సి వచ్చింది. ఆ రోజుల్లో 38 కేంద్రాలలో శతదినోత్సవం జరుపుకున్న తొలి చిత్రంగా మరో అరుదెైన రికార్డును సొంతం చేసుకుంది బొబ్బిలి పులి. 70 ప్రింట్లతో విడుదలెైన ఈ చిత్రం తొలి వారంరోజులకే రూ.71 లక్షలు వసూలు చేసింది. ఇవాళ కోట్లు వసూలు చేశాయంటున్న పెద్ద హీరోల సినిమా కలెక్షన్ల కన్నా ఎక్కువ రెట్ల మొత్తంలో కలెక్షన్లువసూలు చేసింది బొబ్బిలి పులి. అప్పటి లక్షలు ఈ రోజుల్లో కోట్లతో సమానం. ఆ రోజుల్లో తెలుగునాట ఎక్కువ ఆటలతో శతదినోత్సవం జరుపుకున్న చిత్రాలు మూడే. అవి అడవిరాముడు, కొండవీటి సింహం, బొబ్బిలి పులి. ఈ మూడూ ఎన్‌టిఆర్‌వే కావడం విశేషం.

ఇక ఈ చిత్రంలో మన న్యాయవ్యవస్థలో ఉన్న లోపాలను ఎత్తిచూపించే డెైలాగులు ఉన్నాయి. ‘కోర్టు కోర్టుకు…తీర్పు తీర్పుకు ఇంత మార్పు ఉంటే…మీ న్యాయస్థానంలో న్యాయం ఉన్నట్టా యువరానర్‌’ అంటూ ఎన్టీఆర్‌ డెైలాగులు చెబుతుంటే కింది క్లాస్‌ నుంచి పెై క్లాస్‌ దాకా చప్పట్లతో థియేటర్లు మార్మోగిపోయాయి. ఇక దేశ సరిహద్దుల్ని కాపాడే వీరజవాన్‌గా పనిచేసిన ఎన్టీఆర్‌కు దేశం లోపల చీడపురుగుల్లాంటి కొంతమంది దేశాన్ని ఏ విధంగా దోచుకుతింటున్నారో చూసి చలించిపోయి అటువంటి వారికి తనదెైన రీతిలో బుద్ధి చెబుతాడు. ఈ క్రమంలో బొబ్బిలి పులిగా మారి అవినీతి, లంచగొండితనంపెై తిరుగబాటు చేస్తాడు. ఈ చిత్రం కథ స్ఫూర్తితో తర్వాత భారతీయుడు, ఠాగూర్‌ వంటి ఎన్నో చిత్రాలు వచ్చాయి. ఇక ఇందులోని పాటలు ఎంతో ఉద్వేగభరితంగా ఉంటాయి.

ముఖ్యంగా దర్శకరత్న దాసరి నారాయణరావు రచించిన ‘సంభవం…నీకే సంభవం’, ‘జననీ…జన్మ భూమిశ్చ’ వంటి పాటలు నభూతో నభవిష్యతి అన్న రీతిలో పదికాలాల పాటు పాడుకునే పాటలుగా నిలిచిపోయాయి. ఇక క్లైమాక్స్‌లో వచ్చే కోర్టు సీన్‌లో శ్రీదేవి లాయర్‌గా చక్రధర్‌ పాత్రధారి ఎన్టీఆర్‌ని అడిగే సన్నివేశంలో ఎన్టీఆర్‌ చెప్పే డెైలాగులు విని చప్పట్లు కొట్టని తెలుగువాడు ఉండడేమో ఆ రోజుల్లో…శ్రీదేవి ‘మీరొక్కరే ఏం చేస్తారు?’ అని ఎన్‌టిఆర్‌ని అడుతుంది అప్పుడు ‘ మహాత్మాగాంధీ ఒక్కడే నడుం కడితే యావత్‌ దేశమే ఆయన వెనక వచ్చింది’, ‘అల్లూరి సీతారామరాజు ఒక్కడే విల్లు పడితే…మన్యం మన్యమే ఆయన వెంట కదిలి వచ్చింది, భగత్‌ సింగ్‌ ఒక్కడే..యావత్‌ యువశక్తి ఆయన వెంట వచ్చింది’ అంటూ రామారావు చెప్పే డెైలాగులు చప్పట్లు కొట్టించేలా చేశాయి. జె.వి. రాఘవులు అందించిన సంగీతం ఈ చిత్రానికి ఆక్సిజన్‌లా పనిచేసింది. వాడవాడలా రికార్డు కలెక్షన్లు సృష్టించిన చిత్రంగా నిలిచింది.

👉 సౌజన్యం: అనప్పిండి సూర్యలక్ష్మీ కామేశ్వరరావు

జూలై 5, 2020

సినీ ‘లంకె’బిందువులు

Posted in వెండి తెర ముచ్చట్లు at 12:26 సా. by వసుంధర

ఈ ప్రపంచంలో ఎవరైనా ఏమైనా చెయ్యగలరు – అవకాశం రావాలంతే – అనుకుంటాం కదా! అది నాయకత్వానికే కాదు – లలిత కళలకూ వర్తిస్తుందని నమ్మేవారిలో భారతీయులు అగ్రగణ్యులు. అందుకే అన్ని రంగాల్లోనూ అభిమానులు కూడా తరతరాలుగా కొనసాగుతుంటారు.

మన చిత్రసీమలో వాసత్వానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు ఈ కింది లంకెల్లో ఉన్నాయిః

చిత్రసీమలో నట వారసత్వం

పై లంకెకు సవరణలతో – తనయులపై ఎన్టీ ఆర్ ప్రయోగాలు

మన చుట్టూ ఎన్ని కథలున్నా, ఎంత సృజనాత్మకత ఉన్నా – అవి వడ్డించిన విస్తరి లాంటివి కాదు కదా! మన సినీ రంగం అలాంటి విస్తళ్ల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూంటుంది. ఒకోసారి ఒకే విస్తరి చుట్టూ కూడా తిరుగుతుంటుంది. మచ్చుకి ఈ కింది లంకెః

ఓ వడ్డించిన విస్తరి

జూలై 1, 2020

చలనచిత్ర కళాపద్మం కమలాకర కామేశ్వరరావు

Posted in వెండి తెర ముచ్చట్లు at 10:31 ఉద. by వసుంధర

వాట్‌సాప్ బృందం సౌజన్యంతో

(ఈరోజు కమలాకర వర్ధంతి – 4 అక్టోబర్ 1911 – 29 జూన్ 1998)

వేదాధారమైన మన రామాయణ, భారత, భాగవత పురాణ గ్రంధాలు ప్రముఖంగా ధర్మప్రబోధకాలు. ఈ పురాణ కథలకు రూపకల్పన చేసి సినిమా మాధ్యమంగా ప్రజలకు చేరువ చేయాలని ఎందరో మహనీయులు వందేళ్ల క్రితమే ప్రయత్నం ప్రారంభించారు. చలన చిత్ర పితామహుడు దాదా సాహెబ్‌ ఫాల్కే 1912లోనే ‘రాజా హరిచంద్ర’ పురాణ కథనే చిత్రాంశంగా ఎన్నుకొన్నారు. ఫాల్కే నిర్మించిన తొలి చిత్రాలు ‘మోహినీ భస్మాసుర’, ‘సత్యవాస్‌ సావిత్రి’ కూడా పౌరాణికాలే. తెలుగు చలన చిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్య కూడా తొలుత ‘భీష్మ ప్రతిజ్ఞ’ అనే మూకీ చిత్రాన్ని, తర్వాత ‘భక్తప్రహ్లాద’ టాకీ చిత్రాన్ని నిర్మించారు. ఆ పరంపరలో చిత్తజల్లు పుల్లయ్య ‘లవకుశ’, ‘‘సీతాకల్యాణం’ వంటి సినిమాలనే తీశారు. అటువంటి సినిమాలకు ఊపిరులద్దిన అతికొద్ది దర్శకరత్నాలలో కమలాకర కామేశ్వరరావు ప్రథములు. అందుకే కమలాకరను చిత్రసీమ ‘‘పౌరాణిక బ్రహ్మ’’గా గుర్తించి ఆదరించింది. ఈ అద్భుత చలనచిత్ర నిర్దేశకుని చలన చిత్ర ప్రస్థానం గురించి అవలోకిస్తే… ఈరోజు ఆయన వర్ధంతి. ఈ సందర్భంగా విశేషాలు…

మూర్తీభవించిన తెలుగుదనం…
అతనిది పదహారణాల తెలుగుతనం ఉట్టిపడే విగ్రహం. నెరసిన జుట్టు, గ్లాస్గో పంచె, తెల్లని మల్లెపూల వంటి జబ్బా, నుదట కాసంత కుంకుమ బొట్టు… ఇదీ కమలాకర కామేశ్వరరావు ఆహార్యం. 1937లో చిత్ర పరిశ్రమలో చేరిన నాటి నుంచీ అదే వస్త్రాధారణ. 1911 అక్టోబర్‌ నాలుగున మచిలీపట్నంలో జన్మించిన కామేశ్వరరావు బీఏ పట్టభద్రుడు. మొదటి నుంచి సినిమాలంటే ప్రాణం. పుస్తకాలు బాగా చదివేవారు. సినిమాలను చూసి వాటి మీద సమీక్షలు రాస్తుండేవారు. ఆ రోజుల్లో ‘కృష్ణా పత్రిక’కు చాలా మంచి పేరుండేది. ఆ పత్రికలో కమలాకర సినీ సమీక్షలు అచ్చవుతూ ఉండేవి. ఆ రోజుల్లో బెజవాడ (నేటి విజయవాడ)లో కొత్త సినిమాలన్నీ విడుదలవుతూ ఉండేవి. వాటిపై కమలాకర సమీక్షలు ప్రామాణికంగా ఉండేవి. 1931లో నోబెల్‌ బహుమతి గ్రహీత పెరల్‌ బుక్‌ రాసిన ‘గుడ్‌ ఎర్త్‌’ నవలను 1937లో సిడ్నీ ఫ్రాంక్లిన్‌ దర్శకత్వంలో ఇర్వింగ్‌ తాల్‌ బర్గ్‌ సినిమాగా నిర్మించాడు. ఇందులో పాల్‌ముని, లూసీ రైనర్‌ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రం ఆస్కార్‌ను గెలుచుకుంది. ఈ సినిమా గురించి కమలాకర నాలుగు వారాలు సమీక్షలు రాశారు. నిశిత దృష్టితో రాసిన ఆ సమీక్షలు పాఠకులను విపరీతంగా ఆకర్షించాయి. ఆ రోజుల్లో బెజవాడ సరస్వతీ టాకీస్‌ వారు సి.ఎస్‌.ఆర్‌, కన్నాంబ నటించగా హెచ్‌.వి.బాబు దర్శకత్వంలో ‘‘ద్రౌపదీ వస్త్రాపహరణము’’ సినిమాను నిర్మిస్తే, లక్ష్మీఫిలిమ్స్‌వారు జగన్నాథ స్వామి దర్శకత్వంలో బళ్లారి రాఘవ, బందా కనకలింగేశ్వరరావు, కమలాబాయి నటించిన ‘‘ద్రౌపదీ మాన సంరక్షణము’’ సినిమాను సమాంతరంగా నిర్మించారు. ఇరవై రోజుల తేడాలో ఈ రెండు సినిమాలు 1936 మార్చి నెలలో విడుదలయ్యాయి. ఈ సినిమాల మీద కమలాకర సమీక్షలు వరుసగా నాలుగు వారాలు కృష్ణా పత్రికలో వచ్చాయి. ఆ సినీ సమీక్షలే దర్శకనిర్మాత గూడవల్లి రామబ్రహ్మం దృష్టిని ఆకర్షించాయి. ‘‘ద్రౌపది వస్త్రాపహరణం’’ సినిమా ఆర్థికంగా విజయవంతమై, రెండవ సినిమా పరాజయం పాలైంది. కానీ కమలాకర రెండవ సినిమానే బాగుందని రాశారు.

మద్రాసులో కామేశ్వరం…
కమలాకర సమీక్షలకు ఆకర్షితుడైన రోహిణీ అధిపతి హెచ్‌.ఎం.రెడ్డి ‘కనకతార’ సినిమా తర్వాత తలపెట్టిన ‘గృహలక్ష్మి’ సినిమాలో పనిచేసే అవకాశం కల్పించారు. అప్పుడే కమలాకర మద్రాసులో అడుగుపెట్టారు. రోహిణీ వాళ్లకు ఒక లాడ్జీ ఉండేది. అందరితోపాటే కమలాకరరావుకు కూడా అక్కడే మకాం. అక్కడే బి.ఎన్‌.రెడ్డి, కె.వి.రెడ్డి, రామనాథ్‌, శేఖర్‌, సముద్రాల వంటి పెద్దలతో పరిచయాలు పెరిగి అనుభవం సంతరించుకున్నారు. కె.వి.రెడ్డి అప్పుడు రోహిణీ సంస్థకు క్యాషియర్‌గా ఉండేవారు. గృహలక్ష్మి సినిమా పూర్తయ్యాక ఆ సినిమాకు కమలాకర బెజవాడ, ఏలూరు కేంద్రాల్లో ఫిలిం రిప్రజెంటేటివ్‌గా వ్యవహరించారు. తర్వాత బి.ఎన్‌., రామనాథ్‌, శేఖర్‌ కలిసి వాహిని సంస్థను ఆరంభించారు. వారు నిర్మించిన ‘వందేమాతరం’ చిత్రానికి కమలాకర సహాయదర్శకునిగా పనిచేశారు. ఆ చిత్రానికి బి.ఎన్‌. దర్శకుడు కాగా, కె.వి.రెడ్డి ప్రొడక్షన్‌ మేనేజర్‌గా వ్యవహరించేవారు. బి.ఎన్‌. దర్శకత్వంలో ‘సుమంగళి’ సినిమాకు పనిచేశాక, 1941లో వాహినీ వారు ‘దేవత’ సినిమా నిర్మించినపుడు బి.ఎన్‌కు సహకార దర్శకుడిగా కమలాకర వ్యవహరించారు. 1943లో వాహినీ పతాకం మీద కె.వి.రెడ్డి దర్శకత్వం వహించిన ‘భక్తపోతన’ సినిమాకి కూడా కమలాకరే సహాయ దర్శకుడు. అప్పుడే సినిమా టైటిల్స్‌లో కె.వి. సరసన కమలాకర పేరు కనిపించడం గొప్ప విషయం. వాహినీ వారి ‘గుణసుందరి కథ’ సినిమా కోసం కథను తయారు చేసినవారిలో కమలాకర కూడా ఒకరు. ‘యోగి వేమన’ తర్వాత వాహినీ సంస్థ విజయాలో విలీనమైనప్పుడు కమలాకర విజయా సంస్థలో నిలదొక్కుకున్నారు. పింగళి నాగేంద్రరావును కె.వి.రెడ్డి, బి.ఎన్‌.రెడ్డిలకు పరిచయం చేసింది కామేశ్వరరావే. ‘పాతాళభైరవి’ కథాచర్చలలో కమలాకర పాల్గొని అద్భుతమైన కథను అల్లే పక్రియలో నాగిరెడ్డి – చక్రపాణిల అభిమానం చూరగొన్నారు. అతని ప్రతిభను గుర్తిస్తూ ‘చంద్రహారం’ సినిమాకు దర్శకత్వం నిర్వహించే అవకాశాన్ని విజయవారు కమలాకరకు అప్పగించారు. ‘చందనరాజు కథ’ను చంద్రహారంగా తీర్చిదిద్దగా దురదృష్టవశాత్తు ఆ తొలి అవకాశం కమలాకరకు సత్ఫలితాలను ఇవ్వలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు మాత్రం దక్కాయి. ఈ సినిమా టెక్నిక్‌ కొత్తగా ఉండడంతో కొన్ని దృశ్యాలను విదేశీ టెలివిజన్లు (ఆ రోజుల్లో టి.వి.లు అక్కడ ఉండేవి) ప్రసారం కూడా చేశాయి. తర్వాత వాహినీ సంస్థ వారి ‘పెంకిపెళ్లాం’ సినిమాకు దర్శకత్వం చేపడితే అది కూడా కాసులు రాల్చలేదు.

ప్రతిభకు పట్టం
కమలాకర ప్రతిభను గుర్తించిన ఎన్‌.టి.రామారావు మాత్రం తన సొంత సినిమా ‘పాండురంగ మహాత్మ్యం’ సినిమాకు కమలాకరనే దర్శకునిగా ఎన్నుకున్నారు. 1957లో విడుదలైన ఆ సినిమా విజయభేరి మోగించింది. ఆ విజయంతోనే ‘శోభ’, ‘మహాకవి కాళిదాసు’ వంటి విజయవంతమైన సినిమాలకు నిర్దేశకత్వం వహించి కమలాకర మంచి పేరు గడించారు. 1962లోనే వచ్చిన విజయావారి సాంఘిక కామెడీ సినిమా ‘గుండమ్మకథ’, చారిత్రాత్మక చిత్రం ‘మహామంత్రి తిమ్మరుసు’ సూపర్‌హిట్లు కావడంతో కమలాకరకు జాతీయస్థాయిలో రాష్ట్రపతి రజతం లభించింది. 1963లో లక్ష్మీరాజ్యం, శ్రీధరరావులు నిర్మించిన ‘నర్తనశాల’కు అంతర్జాతీయ కీర్తి లభించింది. ఇక 1965లో మాధవీ ప్రొడక్షన్‌ పతాకం మీద ఎ.ఎస్‌.ఆర్‌ ఆంజనేయులు నిర్మించిన ‘పాండవ వనవాసము’ చిత్రం 13 కేంద్రాల్లో శతదినోత్సవాన్ని కూడా చేసుకుంది. స్వప్నసుందరి హేమామాలినికి తొలి అవకాశమిచ్చి, ఆమె చేత ఈ సినిమాలో నాట్యం చేయించిన ఘనత కూడా కమలాకరదే. ఇక కమలాకర కామేశ్వరరావు దర్శకత్వానికి తిరుగులేకపోయింది. వరుసగా ‘శ్రీకృష్ణ తులాభారము’, ‘కాంభోజరాజు కథ’, ‘శ్రీకృష్ణావతారం’, ‘వీరాంజనేయ’వంటి పౌరాణిక చిత్రాలు కమలాకర దర్శకత్వంలో వచ్చి ఆయనను ‘‘పౌరాణిక బ్రహ్మ’’గా నిలబెట్టాయి. ‘కలిసిన మనసులు’, ‘మాయని మమత’వంటి సాంఘికాలు కూడా మంచి చిత్రాలుగానే పేరు తెచ్చుకున్నాయి. వీనస్‌-మహీజా నిర్మాత సి.హెచ్‌.ప్రకాశరావు రంగుంల్లో నిర్మించిన బాలల చిత్రం ‘బాలభారతం’ని కమలాకర విజయవంతం చేశారు. జానపదాలకు, పౌరాణికాలకు ఆదరణ తగ్గిన రోజుల్లో కూడా అటువంటి సినిమా నిర్మాణంపై ఏదైనా చర్చ వస్తే సినీ జగత్తులో తొలుత వినిపించే పేరు కమలాకరదే. 70వ దశకంలో కూడా కమలాకర కొన్ని పౌరాణిక సినిమాలకు నిర్దేశకత్వం వహించారు. వాటిలో నటుడు కృష్ణ నిర్మించిన ‘కురుక్షేత్రం’ గురించి చెప్పుకోవాలి. సాంకేతికంగానూ, సందేశంగానూ అతి తక్కువ వ్యవధిలో అత్యద్భుతంగా నిర్మించిన చిత్రమది. ఆ రోజుల్లోనే వచ్చిన ‘శ్రీదత్త దర్శనం’, ‘సంతోషిమాత వ్రత మహాత్మ్యం’, ‘అష్టలక్ష్మి వైభవం’ సినిమాలు కూడా ఆ కోవలోనివే. పౌరాణిక సినిమాలు తెరమరుగవడంతో కామేశ్వరరావు చేతికి పనిలేకుండా పోయింది. ఆ సమయంలోనే పౌరాణికాలకు మహర్దశ రాకపోతుందా అనే విశ్వాసంతో ఆయన కొన్ని సినిమా కథలకు స్క్రిప్టు తయారు చేసి పెట్టుకున్నారు. వాటిలో ‘శ్రీకృష్ణకుచేల’, ‘శ్రీరంగనాథ వైభవం’, ‘మహిషాసుర మర్దిని’ సినిమా కథలు కొన్ని. సరైన నిర్మాతలు లేక, ఉన్నా కొందరు ముందుకు రాక ఆ స్క్రిప్టులు రూపకల్పనకు నోచుకోలేకపోయాయి. కమలాకర పారితోషికాల విషయంలో ఏనాడూ ఖచ్చితంగా వ్యవహరించలేదు. అతని మనసెరిగిన వారు ఆదరిస్తే, అతని మనస్తత్వం తెలిసిన నిర్మాతలు వాడుకొని వదిలేశారు. అయినా కమలాకర బాధపడలేదు. ఒక మంచి సినిమాను తీయగలిగాననే తృప్తితోనే కాలం వెళ్లబుచ్చారు. మద్రాసు ఫిలిం ఫ్యాన్స్‌ సంఘం కామేశ్వరరావును రెండు సార్లు ఉత్తమ దర్శకునిగా ఎన్నుకుంది. ‘‘సినిమాలో అన్ని శాఖలూ, అందరూ కనిపించాలి గాని, దర్శకుడు మాత్రం కనిపించకూడదు. అన్ని శాఖలనూ కనిపింపజేయడమే దర్శకుని ఘనత. మణిహారంలో సూత్రం ఉంటుంది. అది అన్ని మణులను కలిపి హారంగా రూపొందిస్తుంది. కానీ సూత్రం మాత్రం పైకి కనిపించదు. చిత్ర దర్శకుడు కూడా ఆ సూత్రంలాంటివాడే’’ అని దర్శకుని పాత్ర గురించి ఆయన గొప్పగా చేప్పేవారు. ఈ దర్శకరత్న పుంగవుడు మద్రాసు విడిచి తన కుమారుని వద్ద ఉంటూ 1998లో ఇదే రోజు తన 88వ ఏట తనువు చాలించారు.

👉 సౌజన్యం: ఆచారం షణ్ముఖాచారి

గత పేజీ · తరువాతి పేజీ