ఫిబ్రవరి 26, 2021
భువినుండి దివికి

సింగమనేని నారాయణ గారు అనంతపురం పట్టణానికి దగ్గరలో వున్న బండమీదపల్లి గ్రామంలో మధ్యతరగతి రైతు కుటుంబంలో జూన్ 23, 1943లో జన్మించాడు.
అనంతపురంలో ఉన్నత పాఠశాల లో విద్యపూర్తి చేసుకుని తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలో విద్వాన్ చదివాడు.
అనంతపురం జిల్లా లోని గ్రామీణ ప్రాంతాల హైస్కూళ్లలో తెలుగు పండిట్‌గా పనిచేసి 2001లో పదవీ విరమణ చేశాడు.
రచనలు
ఇప్పటివరకు 43కు పైగా కథలు వ్రాశాడు. మొట్టమొదటి కథ “న్యాయమెక్కడ? “1960లో కృష్ణాపత్రికలో అచ్చయ్యింది. ఈయన కథలు జూదం (1988), సింగమనేని నారాయణకథలు (1999), అనంతం (2007), సింగమనేని కథలు(2012) అనే నాలుగు కథాసంపుటాలుగా వెలువడ్డాయి. సీమకథలు, ఇనుపగజ్జెలతల్లి, తెలుగు కథలు – కథన రీతులు, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ వారి ‘తెలుగుకథ’ మొదలైన పుస్తకాల సంపాదకత్వం వహించాడు. సంభాషణ పేరుతో ఒక వ్యాస సంపుటిని కూడా వెలువరించాడు. అప్పాజోస్యుల-విష్ణుభొట్ల-కందాళం ఫౌండేషన్ఈయనకు సాహిత్య సేవామూర్తి జీవితకాల సాధన పురస్కారాన్ని 2013లో అందజేసింది. ఆదర్శాలు – అనుబంధాలు, అనురాగానికి హద్దులు, ఎడారి గులాబీలు అనే నవలలు వ్రాశాడు.
అవార్డులు
1997లో ఆంధ్రప్రదేశ్ అభ్యుదయరచయితల సంఘం, గుంటూరు జిలాశాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకటశివయ్య సాహితీ సత్కారం
2017లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చే కళారత్న పురస్కారం.
ప్రముఖ రచయిత శ్రీ సింగమనేని నారాయణ గారి మృతికి రంజని తెలుగు సాహితీ సమితి సంతాపం ప్రకటిస్తూ, వారికి ఊర్ధ్వ గతులు ప్రాప్తించాలని ప్రార్థిస్తున్నది.
ప్రసిద్ధ మార్క్సిస్టు రచయిత,సాహిత్య విమర్శకుడు,సీమాంధ్రులు,విశాలాంధ్ర తెలుగు కథ లు ,తెలుగు కథకులు,కథను రీతులు గ్రంథాలసంపాదకుడు,కథావరణం,సమయమూ సందర్భమూ,సంభాషణ,తెలుగే ఎందుకు,మధురాంతకం రాజారాం వంటి అనేక గ్రంథాలు రచయిత, గొప్ప వక్త సింగమనేని నారాయణ గారు గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడి ,ఇప్పుడే తుది శ్వాస విడిచారు. ఆయన మృతికి ఆం.ప్ర. అరసం ప్రగాఢమైన సంతాపం ప్రకటిస్తున్నది. జూదం,సింగమనేని కథలు వంటి కథా సంపుటాలు తో తెలుగు కథావికాసానికి దోహదం చేసిన సింగమనేని మరణం వల్ల తెలుగు సాహిత్యం పెద్ద దిక్కును కోల్పోయిందని అరసం అభిప్రాయపడింది.
మట్టినీళ్ల సిరాబుడ్డి
– మహమ్మద్ ఖదీర్‌బాబు
‘మా అనంతపురంను ఒక దేశం చేస్తే తప్ప అది బాగుపడదు’ అనేవారు సింగమనేని నారాయణ.
ఆయన టీచరు. కాని అనంతపురము నేలా, మట్టి, ఎడారి, మొండి కంపలు, మోడు గుట్టలు వాటి నడుమ మాసిన గుడ్డలను కూడా పట్టించుకోకుండా బతుకుబాదరబందీలో తిరుగాడే మనుషులు… వీటిని తన పాఠ్యాంశాలుగా ఆయన స్వీకరించారు. పాఠకులను చూచోబెట్టి బ్లాక్‌బోర్డు మీద ఏమి రాసి చూపాలో ఏ కథను బొమ్మకట్టి ఛాతీలకు గుచ్చాలో ఆయనకు తెలుసు.
తెల్లటి పంచె కట్టు, మోచేతుల వరకూ మడిచిన తెల్లటి అంగీ… ‘జాగ్రత్త.. నా వాళ్లంతా పొలాల్లో పనుల్లో ఉన్నారు. వారి ప్రతినిధిగా నేను వచ్చాను. మా హక్కుకు దక్కవలసిన మర్యాద నేను దక్కించుకుంటాను’ అన్నట్టు ఉండేవారాయన.
అనంతపురం మర్యాద, రాయలసీమ మర్యాద, తెలుగు కథ మర్యాద – సింగమనేని నారాయణ.
ఆయన లెఫ్ట్ ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అరసము ఆయనది. ఆయన అరసానికి. జనం కోసం పని చేశారు. సంఘంలో పెద్దమనిషి. ఇంత పెద్ద అనంతపురం జిల్లాలో ఆవాసయోగ్యమైన ఏ స్థలం అయినా న్యాయంగానే ఆయన పొందవచ్చు. అడిగితే ఇస్తారు. అడక్కపోయినా ఆయన అనుకుంటే ఆయనదే. అద్దె ఇంట్లో ఉంటారాయన. అద్దె ఇంట్లోనే తుది శ్వాస విడిచారు.
‘ఎండ కదప్పా’ అంటారాయన. అనంతపురపు ఎండను ఆయన ప్రీతిగా అనుభవించారు. చివరి రోజుల్లో హైదరాబాద్‌లో ఉంచుదామని కుటుంబం ప్రయత్నిస్తే అనంతపురం గాలికై అలమటించారు. అనంతపురం వచ్చే వరకూ హటం మానితేనా.
సాయంత్రం అవ్వాలి. సింగమనేని గారు విశాలాంధ్ర వరకూ నడిచి రావాలి. దాని బయట కుర్చీ వేసుకు కూచోవాలి. నలుగురూ అక్కడ చేరాలి. కథలు కొలువు తీరాలి. ఇక మీదట కథ అచ్చోట తన ఇంటి పెద్దకై వెతుకులాడుతూ ఉండొచ్చు.
వానకు తడవనివాడూ అనంతపురం వచ్చి సింగమనేని ఆతిథ్యం స్వీకరించనివారూ ఉండరు. పొద్దున మీటింగ్‌కు వచ్చి, తారసపడిన నలుగురిని కలుపుకుని ‘పదండప్పా భోజనానికి’ అని ఇంటికి కబురు పెడితే ఆ హటాత్ అతిథుల తాకిడిని అంతే ఆదరంతో స్వాగతించి ఆయన శ్రీమతి ఆరుగురికి భోజనాలు సిద్ధం చేస్తే ఈయన ఎనిమిదిమందితో హాజరైన రోజులు కొల్లలు. కాని ఆ ఇంటి ముద్దది ఆకలి మరిపించే రుచి. సీమ ఆతిథ్యపు కొసరి వడ్డింపు అది.
కుమారుడు, కుమార్తెల జీవితాలు, మనమలు మనమరాండ్ర చదువులు… వీటికి ఇవ్వాల్సిన సమయం సాహిత్యం కోసం ఇచ్చారా అనిపిస్తుంది. ఆయన మూడు విషయాల కోసం అచంచలంగా నిలబడ్డారు. కథ, తెలుగు భాష, రాయలసీమ. కథ రైతు కోసం. భాష బడిపిల్లల కోసం. రాయలసీమ– ప్రజల న్యాయమైన హక్కుల కోసం.
సింగమనేని గారు గొప్ప వక్త. మెస్మరైజ్ చేస్తారు. రోజువారి నిద్రమబ్బు ముకాలతో ఉన్న మనల్ని తట్టి లేపుతారు. నువ్వు మంచి కథ రాశావా గంట మాట్లాడతారు. నువ్వు ఏదో ఒక మంచికి ఒక లిప్తైనా నిలబడ్డావా. గట్టిగా హత్తుకుంటారు. శ్రీశ్రీ ఎంత రాశారో ఆయనకు శ్రీశ్రీ కంటే ఎక్కువ తెలుసు. ‘మహా ప్రస్థానం’ కంఠోపాఠం. ఆయనకు అస్తమా సమస్య ఉంది. ఫ్లాస్కులోని వేడినీటిని కాసింత కప్పులో నుంచి గుక్కపట్టి ‘ఓ మహాత్మా… ఓ మహర్షి’ అందుకుంటే వినాలి చెవులున్న భాగ్యానికి. ఏ మారుమూలనో శ్రీశ్రీ వాడిన ఒక మాట సందర్భానుసారం టప్పున వాడి సభ నిస్సారతను చిట్లగొడతారు.
ఆయన సంపాదకులు. విమర్శకులు. కథకుడికి బుద్ధి జ్ఞానం ఉండాలని నమ్మినవారు. కథకుడికి హేతుబద్ధమైన ఆలోచన ఉండాలని అభిలషించినవారు. కథకుడు కురచగా, కాలక్షేపంగా, గాలికి పోయే ఊకగా ఉండటాన్ని ఈసడించినవారు. కథకుడు కలాన్ని హలంగా ధరించి, పనిముట్టగా చేసి, స్త్రీ కంఠస్వరంగా మలిచి, నోరు లేనివాడి నోరుగా చేసి, ఒక దుర్మార్గంపై కూల్చే బండరాయిగా మార్చి ఆనెక కథకుడిననే యోగ్యత పొందాలనే నిశ్చితాభిప్రాయము కలిగినవారు. అట్టి కథకులను ఆయన తీర్చిదిద్దారు. దారి చూపారు. స్ఫూర్తిగా నిలిచారు.
మధురాంతకం రాజారాం గారి తర్వాత కేతు విశ్వనాథ రెడ్డి గారు, సింగమనేని గారు రాయలసీమ నుంచి తెలుగు కథాశిఖరాల వలే నిలబడ్డారు. ఎందుచేత శిఖరము? సాహిత్యంలో కొత్తధోరణి వచ్చింది.. వీరు స్వాగతించారు. సాహిత్యంలో ఒక కొత్త దారి తెరుచకుంది వీరు స్వాగతించారు. స్త్రీవాద, దళిత, మైనారిటీ సాహిత్యాలకు దన్నుగా నిలిచారు. శిఖరం అనిపించుకోవాలంటే ఆ ఔన్నత్యం ఉండాలి.
ఆయన నా ప్రతి పుస్తకాన్ని అనంతపురం విశాలాంధ్రలో కొని ఒక సెట్‌గా తన షెల్ఫ్‌లో ఉంచుకున్నారు. ‘చూడప్పా.. నీది మాత్రం జాగ్రత్తగా పెట్టుకున్నా’ అన్నారు ఆయన ఇంటికి వెళ్లినప్పుడు. భోజనం వేళ దాటిపోయింది ఆ సమయాన. ఉల్లిపాయ వేసిన ఆమ్లెట్‌ను పెట్టకుండా ఆయన పంపిస్తాడా ఏం?
ఆయన కథ ‘అడుసు’ను నేను ‘బ్రహ్మ కడిగిన పాదం’ అని రీటెల్లింగ్ చేస్తే ఆయన ఎంత సంతోషడ్డారో. రైతుపాదాన్ని దేవతలు, పాలకులు ఎన్నిసార్లు కడిగితే రుణం తీరుతుందనే నా వ్యాఖ్యకు పొంగిపోయారు.
ఫోన్ చేస్తే ‘ఖదీరూ’… అని అవతలిపక్క ఖంగున మోగే ఆయన గొంతు ఇక వినపడదు.
హైదరాబాద్ నుంచి అనంతపురం తిరిగి వచ్చేశాక ఆయనను ఫోన్లకు దూరంగా వుంచిన శ్రీమతి నేను ఫోన్ చేస్తే మాత్రం ఇచ్చారు. ‘సార్.. సార్’ అన్నాను. ‘ఏం రాస్తున్నావు ఖదీరూ’ అన్నారు. ‘వినపడటం లేదప్పా’ అని నీరసించారు.
అది ఆఖరు.
తెలుగు కథ ఒక గొప్ప కథా ఉపాధ్యాయుణ్ణి నేడు కోల్పోయింది. మీకు నా కన్నీరు సార్.
– ఫిబ్రవరి 26, 2021.