జనవరి 1, 2021
శుభాకాంక్షలు 2021
అల్లకల్లోలం 2020
అదృష్టం తను నిన్నే వెళ్లిపోయింది
అధఃపాతాళమే ఇక తనకి
అందరిదీ ఇప్పుడదే కోరిక!
అద్భుతాల నిలయం 2021
అనుకుందాం తను నేడే వచ్చింది
ఆకాశమే హద్దని మనకిక ఆశ
అందరికీ అభీష్ట సిద్ధిరస్తు!
నూతన సంవత్సర శుభాకాంక్షలు!
అక్టోబర్ 13, 2020
ముందు – వెనుక
ఎవరో కానీ చక్కగా రాసారు, పూర్తిగా చదవండి:
నేత: అవును ఇప్పుడు మంచి సమయం వచ్చింది
ప్రజలు: మీరు ఇప్పుడు దేశాన్ని దోచేస్తారా
నేత: లేదు
ప్రజలు: మీరు మాకోసం పని చేస్తారా
నేత: అవును, ఖచ్చితంగా
ప్రజలు: మీరు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారా
నేత: దానిగురించి ఆలోచించకండి
ప్రజలు: మీరు మాకు ఉద్యోగాలు, జీవనావసరాలు ఇస్తారా
నేత: ఖచ్చితంగా
ప్రజలు: మీరు దోపిడీ, అక్రమాలు చేస్తారా
నేత: మీకు పిచ్చా, లేదు
ప్రజలు: మేము మీ మీద నమ్మకం పెట్టుకోవచ్చా
నేత: హా
ప్రజలు: ఓహ్ మా నేత
నేత ఎన్నికల్లో గెలిచాడు, గెలిచి వచ్చాడు
ఇప్పుడు కిందనుండి పైకి చదవండి
మార్చి 28, 2020
దేవుళ్లు
కరోనా వీరవిహారం చేస్తుంటే
తలుపులు మూసుకుని ఇళ్లలో దాక్కున్నాం
ఐనా ఏమాత్రం లోటు లేకుండా
పీల్చుకుందుకు గాలి దొరుకుతోంది
అందుకే దేవుడికో నమస్కారం
ఇంకా
కుళాయిలో నీళ్లొస్తున్నాయి
దీపాలు వెలుగుతున్నాయి ఫాన్లు తిరుగుతున్నాయి
వీధులు శుభ్రపడుతున్నాయి
పప్పూ ఉప్పూ కూరా నారా మందూ మాకూ
వగైరా వగైరాలకు దుకాణాలూ, వైద్యుల ఇళ్లూ తెరిచున్నాయి
అందుకే ఆ దేవుళ్లందరికీ కోటి నమస్కారాలు
మార్చి 25, 2020
నో పిలుపు నీ కోసమూ
కరోనా అంటే మనకు లేదు ఇష్టం. తనొస్తే మనకి అంతా ఇంతా అనలేని కష్టం.
‘కరోనా అహంకారి. మనింటికొచ్చి తలుపు తట్టదు. మనం పిలిస్తేనే వస్తది. పిలుద్దామా!’ అని చమత్కరించారు తెలుగు రాష్ట్రం తెలంగాణకు ముఖ్యమంత్రి కెసిఆర్.
కరోనా నిజంగానే అహంకారి. మనింటికొచ్చి తలుపు తట్టదు కానీ – మనం బయట కనబడితే తనని పిలవడానికే అనుకుంటుంది. పెదవి కదిలితే తనకి పిలుపేననుకుంటుంది. ఎంతెక్కువమంది కలిసి కనిపిస్తే అంతెక్కువ ఉత్సాహపడి మనతో వచ్చేస్తుంది.
కరోనాకి మనం అలాంటి భ్రమలు కలిగించొద్దు. అందుకని మనమసలు బయటికే వెళ్లొద్దు. ఎప్పుడైనా తప్పనిసరై వెళ్లినా ఒకసారికి ఒకరికి మించి వెళ్లొద్దు. సాటి మనిషిని కొన్ని మీటర్ల దూరంలో ఉంచుదాం. పెదవి కదలికలు కనబడకుండా, ‘నో పిలుపు నీ కోసమూ’ అని స్పష్టమయ్యేలా నోటికి ముసుగు వేసేద్దాం.
శార్వరి ఉగాదికి మనం తీసుకునే మొదటి నిర్ణయం ఇదే! ఆ తర్వాతనే మరే నిర్ణయానికైనా అవకాశం దొరుకుతుంది….
అందరికీ అక్షరజాలం ఉగాది శుభాకాంక్షలు.
ఇక్కడ కరోనాపై వచ్చిన రెండు ఫన్నీ, పన్నీ ఆంగ్లవ్యాసాలకు (Times of India) ఇక్కడ లంకె ఇస్తున్నాం.
https://flatforum.wordpress.com/2020/03/25/carona-virus-and-the-generation-gap/
https://flatforum.wordpress.com/2020/03/25/the-spirit-of-spit/