అక్టోబర్ 13, 2020

ముందు – వెనుక

Posted in జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం at 10:48 ఉద. by వసుంధర

ఎవరో కానీ చక్కగా రాసారు, పూర్తిగా చదవండి:


నేత: అవును ఇప్పుడు మంచి సమయం వచ్చింది

ప్రజలు: మీరు ఇప్పుడు దేశాన్ని దోచేస్తారా

నేత: లేదు

ప్రజలు: మీరు మాకోసం పని చేస్తారా

నేత: అవును, ఖచ్చితంగా

ప్రజలు: మీరు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతారా

నేత: దానిగురించి ఆలోచించకండి

ప్రజలు: మీరు మాకు ఉద్యోగాలు, జీవనావసరాలు ఇస్తారా

నేత: ఖచ్చితంగా

ప్రజలు: మీరు దోపిడీ, అక్రమాలు చేస్తారా

నేత: మీకు పిచ్చా, లేదు

ప్రజలు: మేము మీ మీద నమ్మకం పెట్టుకోవచ్చా

నేత: హా

ప్రజలు: ఓహ్ మా నేత

నేత ఎన్నికల్లో గెలిచాడు, గెలిచి వచ్చాడు

ఇప్పుడు కిందనుండి పైకి చదవండి

మే 22, 2018

ప్రజాస్వామ్య హంతకులు (జీ జీ వా జీ – 4)

Posted in కథాజాలం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ముఖాముఖీ at 11:50 ఉద. by వసుంధర

(అగస్త్య మహాముని – తన కడుపులో ఉన్న వాతాపి అనే మహారాక్షసుణ్ణి జీర్ణించుకుందుకు వాడిన మంత్రం ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’.  పిల్లలకు తిన్న పదార్థం సులభంగా అరగడానికి తల్లులు ఈ మంత్రాన్ని వాడడం ఆచారంగా వస్తోంది.  మన పురాణాల్లోని ఈ కథను క్రింద ఇస్తున్నాం. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడీ కథ ఎందుకంటే – నేడు సాంఘికంగా జరిగే ఎన్నో విశేషాలు సామాన్య పౌరులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆ విశేషాల్ని ఒకటొక్కటిగా చెప్పుకుని – ఈ మంత్రం పఠించదం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేమీ లేదు. 

ఈ శీర్షికకు తగిన విశేషాల్ని ఎవరైనా కథారూపంలో పంపవచ్చు. బాగున్నవి యథాతథంగానో, అవసరమనిపిస్తే ఆ మేరకు సరిచేసి కానీ అక్షరజాలంలో ప్రచురించగలం)

కర్ణాటక రాష్ట్రంలో ఎన్నికలొచ్చాయి. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యది కాంగ్రెస్ పార్టీ. మాజీ భారత ప్రధాని దేవెగౌడది జనతాదళ్ సెక్యులర్ పార్టీ. ఒకప్పుడు అవినీతి ఆరోపణల నెదుర్కొని బయటపడ్డాననిపించుకున్న యెడ్యూరప్పది బిజేపీ. ఈ మూడు పార్టీలూ అధికారం కోసం తీవ్ర పోరాటం సాగించాయి. ఆ పోరాటంలో ప్రతి పార్టీ మిగతా రెండు పార్టీలనీ దుమ్మెత్తి పోశాయి.

ఫలితాలు వచ్చాయి. బీజేపీకి అందరికంటే ఎక్కువగా 104 సీట్లు వచ్చాయి. కాంగ్రెసుకి 78, జేడీ ఎస్‍కి 38. చెప్పాలంటే ప్రజలు మూడు పార్టీలనీ నిర్ద్వంద్వంగా తిరస్కరించారు.

ఫలితాలు చూస్తూనే అంతవరకూ పరస్పరం దుమ్మెత్తి పోసుకున్న కాంగ్రెస్, జేడీఎస్‍లు ఒక్కటయ్యాయి. కేవలం 38 సీట్లున్న జేడీఎస్ నేత కుమారస్వామిని ముఖ్యమంత్రిని చెయ్యడానికి కాంగ్రెస్ ఒప్పుకుంది. తనకి 116 సీట్లు ఉన్నాయి కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకి తననే పిలవాలని కుమారస్వామి గవర్నర్‍కి లేఖ వ్రాశాడు.

విడివిడిగా చూస్తే ఆ రెండు పార్టీలకంటే తమకే ఎక్కువ సీట్లు వచ్చాయి కాబట్టి ప్రభుత్వం ఏర్పాటుకి తననే పిలవాలని యెడ్యూరప్ప గవర్నర్‍కి లేఖ వ్రాశాడు. 

ఇటీవలే వివిధ గవర్నర్లు గోవా,  మణిపూర్, బీహార్ వగైరా రాష్ట్రాల్లో – ఎక్కువ సీట్లొచ్చిన పార్టీలని కాదని, ఎక్కువ సీట్లున్న కూటములకే ప్రాధాన్యమివ్వడం జరిగింది. కూటములు, గవర్నర్లు కూడా బీజేపికి అనుకూలంగా వ్యవహరించాయని కాంగ్రెస్ ఆక్రోశించిందప్పుడు.

ఇప్పుడు కర్ణాటకలోనూ గవర్నర్ బీజేపీకి అనుకూలం. ఆయన బీజేపీకి అనుకూలమైన సంప్రదాయాన్ని పాటించడం ఎంత చిత్రమో, అందుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఆక్రోశించడమూ అంతే చిత్రం. కానీ యెడ్యూరప్పకు 104గురు సభ్యులతో సంఖ్యాబలాన్ని ఋజువు చెయ్యడం ఎలా?

కాంగ్రెసునీ, జేడీఎస్‍నీ ప్రజలు తిరస్కరించారనీ, ఎన్నికలముందు ఒకరిపై ఒకరు దారుణమైన ఆరోపణలు చేశారనీ – వారు కూటమిగా ఏర్పడ్డం అనైతికమనీ బీజేపీ అంటుంది. అంటూనే తమ ప్రత్యర్థి పక్షాలనుంచి కొందరు ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోవడం అనైతికం అనుకోదు.

తమ కూటమికి సంఖ్యాబలముందని చెబుతూనే – ఏ క్షణాన వారు బీజేపీ వైపు మళ్లిపోతారేమోనని భయపడుతూ వాళ్లని రహస్యంగా దాచిపెడుతోంది కాంగ్రెస్ కూటమి.

ఓ పార్టీ తరఫున ప్రజలముందు నిలబడి ప్రతినిధిగా ఎన్నికైనా – మర్నాటికే అదే పార్టీలో కొనసాగుతారా అన్నఅనుమానానికి తావిచ్చే ఎమ్మెల్యేలు. వారి బలంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చెయ్యాలనుకునే పార్టీలు. 

సంఘటనలు తమకు ప్రతికూలంగా జరిగినప్పుడల్లా – ‘ప్రజాస్వామ్యం హత్యకు గురయింది’ అంటున్నారు నేతలు.

మనుషుల్నే కాదు – విలువల్నీ, సంప్రదాయాల్నీ కూడా హత్య చెయ్యడమే ప్రజాస్వామ్యానికి ప్రాతిపదికగా ఉన్నట్లు పౌరులు భావిస్తున్న ఈ తరుణంలో – ప్రజాస్వామ్యం హత్యకు గురయిందనడం – ఓ జబర్దస్త్ జోక్. 

ఏం చేస్తాం – జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం!

(ఇది ఈనాటి కథ కాదు. ఎమ్మెల్యేలని రహస్యంగా దాచడం అంశంగా 1988లో వసుంధర వ్రాసిన బానిస కథ చదవండి)

ఏప్రిల్ 18, 2018

బలహీనుల ప్రతినిధిగా…. (జీ జీ వా జీ – 3)

Posted in జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, Uncategorized at 7:34 సా. by వసుంధర

(అగస్త్య మహాముని – తన కడుపులో ఉన్న వాతాపి అనే మహారాక్షసుణ్ణి జీర్ణించుకుందుకు వాడిన మంత్రం ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’.  పిల్లలకు తిన్న పదార్థం సులభంగా అరగడానికి తల్లులు ఈ మంత్రాన్ని వాడడం ఆచారంగా వస్తోంది.  మన పురాణాల్లోని ఈ కథను క్రింద ఇస్తున్నాం. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడీ కథ ఎందుకంటే – నేడు సాంఘికంగా జరిగే ఎన్నో విశేషాలు సామాన్య పౌరులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆ విశేషాల్ని ఒకటొక్కటిగా చెప్పుకుని – ఈ మంత్రం పఠించదం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేమీ లేదు. 

ఈ శీర్షికకు తగిన విశేషాల్ని ఎవరైనా కథారూపంలో పంపవచ్చు. బాగున్నవి యథాతథంగానో, అవసరమనిపిస్తే ఆ మేరకు సరిచేసి కానీ అక్షరజాలంలో ప్రచురించగలం)

శ్రవణ్ కుమార్ తెలుగు చిత్రసీమలో పెద్ద హీరో. అతడికోసం ప్రాణాలు కూడా ఇచ్చే అభిమానులున్నారు. అతడి కొత్త చిత్రం విడుదలైతే టికెట్లకోసం తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయినవారు కూడా ఉన్నారు.

శ్రవణ్ కుమార్‍వి ఉన్నతాశయాలు. సామాన్యుడిగా పుట్టిన తను అసామాన్యుడిగా వెలిగి పోతూ, వైభవ జీవితాన్ని గడపడానికి కారణం జనమేనని అతడికి తెలుసు. ఆ జనం కోసం ఏదైనా చెయ్యాలన్న ఆలోచన అతడికి వచ్చింది. అందుకు రాజకీయాలే అనువు కాబట్టి కొత్త పార్టీ పెట్టాలనుకున్నాడు.

అప్పటికే రాష్ట్రంలో చాలా పార్టీలున్నాయి. వాటికి భిన్నంగా ఉండాలంటే – కొత్త నినాదం ఉండాలనుకున్నాడు. ‘నేను బలహీన వర్గాల ప్రతినిధిని, అందరికీ సమానావకాశాల కోసం కృషి చేస్తాను’ అని అతడు ప్రకటించగానే జనంలో కొత్త ఉత్సాహం వచ్చింది.

కొత్త పార్టీ కార్యకలాపాలకోసం అతడొక కార్యాచరణ కమిటీ వేశాడు. ఆ కమిటీ కొద్ది నెలల పాటు చర్చించి చర్చించి ఓ ప్రణాళిక రూపొందించింది. ఆ వివరాలు వినిపించడానికి కమిటీ అధ్యక్షుడు దిలీప్ శ్రవణ్ కుమార్‍ని కలవడానికి వెళ్లాడు. అతడికి వివరాలు వినిపించి, ”ఇంతవరకూ ఎన్నో పార్టీలు వచ్చాయి. వేటికీ చిత్తశుద్ధి లేదు. అందుకే జనంలో బలహీనులు బలహీనులుగానే ఉండిపోతున్నారు. అందరికీ సమానావకాశాలు రావడం లేదు. మన పార్టీ ఆ లోటు తప్పక తీర్చగలదన్న నమ్మకం కలిగించేలా ఈ ప్రణాళిక రూపొందింది. మనకే అధికారం వస్తే – ఏడాదిలోగానే అందరికీ సమానావకాశాలు కలిగించగలం” అని ఇంకా ఏదో చెబుతుండగా – అక్కడికి జనార్దన్ వచ్చాడు.

శ్రవణ్ కుమార్‍ కొత్త సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ ఏర్పాట్లు చూడ్డానికి వేసిన కమిటీ అధ్యక్షుడు జనార్దన్.

“అన్నీ సవ్యమే కదా!” అన్నాడు శ్రవణ్ కుమార్.

“సవ్యమే కానీ – ప్రస్తుతం రెండు చిన్న సినిమాలు బాగా ఆడుతున్నాయి. గ్యాప్ లేకుండా ఇంకో రెండు వారాలు ఆడితే మంచి లాభాలు తీస్తాయి. మన సినిమా విడుదలైనా కూడా తమ కోసం కొన్ని థియేటర్లు వదలమని ఆ నిర్మాతలు అడుగుతున్నారు సార్!” అన్నాడు జనార్దన్.

“దానికి మీరేమన్నారు?”

“మా శ్రవణ్ కుమార్ సినిమా విడుదలైతే కనీసం రెండు రోజులు ఏ థియేటర్లోనూ ఆ సినిమా తప్ప మరొకటి ఆడకూడదు. అది నియమం కాదు, శాసనం – అని ఖచ్చితంగా చెప్పాను”

“గుడ్” అని గర్వంగా నవ్వి దిలీప్ వైపు తిరిగి, “ఇందాకా మనమెక్కడున్నాం” అన్నాడు శ్రవణ్ కుమార్.

“బలహీనుల ప్రతినిధిగా మీరు స్థాపించనున్న కొత్త పార్టీ ఆశయాలు…..”

అతడేం చెబుతున్నాడో మీకు తెలుసు. సగటు పౌరులారా – జీర్ణించుకోవడం కష్టంగా ఉందా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకోండి.

మార్చి 30, 2018

దీని పేరు సంస్కారం (జీ జీ వా జీ – 2)

Posted in జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, Uncategorized at 7:03 సా. by వసుంధర

(అగస్త్య మహాముని – తన కడుపులో ఉన్న వాతాపి అనే మహారాక్షసుణ్ణి జీర్ణించుకుందుకు వాడిన మంత్రం ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’.  పిల్లలకు తిన్న పదార్థం సులభంగా అరగడానికి తల్లులు ఈ మంత్రాన్ని వాడడం ఆచారంగా వస్తోంది.  మన పురాణాల్లోని ఈ కథను క్రింద ఇస్తున్నాం. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడీ కథ ఎందుకంటే – నేడు సాంఘికంగా జరిగే ఎన్నో విశేషాలు సామాన్య పౌరులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆ విశేషాల్ని ఒకటొక్కటిగా చెప్పుకుని – ఈ మంత్రం పఠించదం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేమీ లేదు. 

ఈ శీర్షికకు తగిన విశేషాల్ని ఎవరైనా కథారూపంలో పంపవచ్చు. బాగున్నవి యథాతథంగానో, అవసరమనిపిస్తే ఆ మేరకు సరిచేసి కానీ అక్షరజాలంలో ప్రచురించగలం)

మచ్చుకి ఓ కథ

ఆయన ఒక తెలుగు ఎంపీ. ఆయనకు తెలుగు రాష్ట్రప్రభుత్వంపై కోపం వచ్చింది. ఆ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించడమే పనిగా పెట్టుకున్నాడు.

అంతేకాదు. ఐదు కోట్ల మంది ప్రజలకు ప్రతినిధిగా గుర్తించబడ్ద ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని – ఇంచుమించు బూతు అనతగ్గ పదాలతో నిందించాడు. అది సంస్కారం కాదని ఎత్తిచూపినవారిని కూడా నిరసించాడు.  తన విశ్వాసం కోల్పోయినవారిని అలాంటి మాటలనడం సబబేనన్నాదు.

అదే ఎంపీకి కేంద్ర ప్రభుత్వంపై కూడా విశ్వాసం నశించింది. అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించాడు.

సభలో ఆ తీర్మానం చర్చకు రావడానికి ఆటంకాలు వచ్చాయి. ఈలోగా ఒకరోజున ఆయన సభలో ప్రధానమంత్రికి ఎదురు పడ్డాడు. తన విశ్వాసం కోల్పోయిన కేంద్ర ప్రభుత్వానికి నాయకుడు ప్రధానమంత్రి. అప్పుడీ ఎంపీ ఆయన్ని ఏమంటాడో ఏమిటోనని అంతా భయపడ్డారు.

కానీ ఆ ఎంపీ ఆయనకు రెండు చేతులూ జోడించి నమస్కరించాడు.

అప్పుడలా, ఇప్పుడిలా – ఇదేమిటని చాలామంది ఆయన్ని నిలదీసారు. ఆయన ఏమాత్రం తడుముకోకుండా – ‘ప్రభుత్వంమీద నాకు విశ్వాసం లేకపోవచ్చు. కానీ ఆయన కోట్లాది ప్రజలకు ప్రతినిధిగా ఉన్న దేశానికి ప్రధానమంత్రి. ఆయనకు చేతులు జోడిస్తే – దాని పేరు సంస్కారం. ఈమాత్రం తెలియదా?’ అని బదులిచ్చాడు.

సగటు పౌరులారా – జీర్ణించుకోవడం కష్టంగా ఉందా? జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అనుకోండి.

 

జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం – 1

Posted in కథాజాలం, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం, ముఖాముఖీ, Uncategorized at 6:28 సా. by వసుంధర

అగస్త్య మహాముని – తన కడుపులో ఉన్న వాతాపి అనే మహారాక్షసుణ్ణి జీర్ణించుకుందుకు వాడిన మంత్రం ‘జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం’.  పిల్లలకు తిన్న పదార్థం సులభంగా అరగడానికి తల్లులు ఈ మంత్రాన్ని వాడడం ఆచారంగా వస్తోంది.  మన పురాణాల్లోని ఈ కథను క్రింద ఇస్తున్నాం. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఇప్పుడీ కథ ఎందుకంటే – నేడు సాంఘికంగా జరిగే ఎన్నో విశేషాలు సామాన్య పౌరులకు జీర్ణించుకోవడం కష్టంగా ఉంది. ఆ విశేషాల్ని ఒకటొక్కటిగా చెప్పుకుని – ఈ మంత్రం పఠించదం మినహా ప్రస్తుతానికి మనం చెయ్యగలిగినదేమీ లేదు. 

ఈ శీర్షికకు తగిన విశేషాల్ని ఎవరైనా కథారూపంలో పంపవచ్చు. బాగున్నవి యథాతథంగానో, అవసరమనిపిస్తే ఆ మేరకు సరిచేసి కానీ అక్షరజాలంలో ప్రచురించగలం.

ఇక ముందుగా మూల కథ చదవండి.

రాక్షస సోదరులైన వాతాపి, ఇల్వలుడు తమ చుట్టుపక్కలవారిని తెగ హింసిస్తూ ఉండేవారు. మనుషుల్ని నిర్దాక్షిణ్యంగా చంపేసి తినేవారు. వీళ్ళ దైత్య ప్రవృత్తికి తట్టుకోలేక అందరూ తప్పించుకు తిరిగేవారు. దాంతో రాక్షసులకు మనుగడ కష్టమై మరో ఎత్తుగడ పన్నారు.

ఆ రాక్షసులు బ్రాహ్మణ వేషం ధరించి, దారిన పోయేవారిని నిలిపి ”తాము బ్రాహ్మణునికి భోజనం పెట్టదలచుకున్నామని, దయచేసి తమ ఆతిథ్యం స్వీకరించమని” వినయంగా చెప్పేవారు. ఏరోజుకారోజు ఎవరో ఒక బ్రాహ్మణుడు ఈ రాక్షసుల మాటలు అమాయకంగా నమ్మి, బలయిపోయేవాడు.

వాతాపి మేకగా మారగా, ఇల్వలుడు ఆ మేకమాంసంతో అతిథికి భోజనం పెట్టేవాడు. పాపం, ఈ మోసమంతా తెలీని బ్రాహ్మణుడు తృప్తిగా భోజనం చేసి ఇల్వలునికి కృతజ్ఞతలు తెలియజేసి, ”అన్నదాతా సుఖీభవ” అని దీవించేవాడు. ఇల్వలుడు గుంభనంగా నవ్వి, ”వాతాపీ! బయటకు రా” అనేవాడు. ఆ పిలుపు వినగానే మేక మాంసం రూపంలో ఉన్న వాతాపి, తక్షణం బ్రాహ్మణుడి ఉదరాన్ని చీల్చుకుని బయటకు వచ్చేవాడు. ఇక వాతాపి, ఇల్వలుడు – ఇద్దరూ బ్రాహ్మణుని మృత శరీరాన్ని సంతృప్తిగా భుజించేవారు.

రాక్షసులకు భోజనంగా మారిన విప్రుడు తిరిగిరాడు గనుక మరో బ్రాహ్మణుడికి ఈ విషయం తెలిసే అవకాశం లేకుండా పోయింది. కానీ, నిజం నిప్పు లాంటిది. అది ఎప్పుడో ఒకప్పుడు బయటపడుతుంది. అనేకమంది విప్రులు మాయమవుతూ ఉండటంతో అగస్త్య్యుడు దివ్యదృష్టితో చూసి ఏం జరుగుతోందో తెలుసుకున్నాడు. వెంటనే వారి ఆట కట్టించేందుకు బయల్దేరాడు.

అగస్త్య్యుడు ఏమీ తెలీనట్లుగా వాతాపి, ఇల్వలుడు తిరిగే మార్గంలో వెళ్ళి నిలబడ్డాడు. ఆ రాక్షస సోదరులు మహదానందంతో ఎప్పట్లాగే ”ఈపూట మేమో బ్రాహ్మణోత్తమునికి భోజనం పెట్టాలనుకుంటున్నాం. దయచేసి మా ఆతిథ్యాన్ని స్వీకరించి మమ్మల్ని సంతుష్టుల్ని చేయండి” అని వేడుకున్నారు.

ఆ పిలుపు కోసమే ఎదురుచూస్తోన్న అగస్త్య మహాముని చిరునవ్వుతో వారి వెంట వెళ్ళాడు. యథాప్రకారం వాతాపి మేకగా మారాడు. ఇల్వలుడు ఆ మేకను చంపి వండిన మాంసంతో భోజనం వడ్డించాడు. ఇక ఇల్వలుడు ”వాతాపీ, బయటకు రా” అని పిలుద్దాం అనుకుంటుంన్నంతలో అగస్త్య్యుడు ”జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం” అంటూ ఉదరాన్ని తడుముకున్నాడు.

మహా మహిమాన్వితుడైన అగస్త్య మహాముని వాక్కు ఫలించింది. వాతాపి వెంటనే జీర్ణమయ్యాడు. ఇక తర్వాత ఇల్వలుడు ”వాతాపీ, బయటకు రా” అంటూ ఎన్నిసార్లు పిలిచినా ప్రయోజనం లేకపోయింది. అగస్త్యుని కడుపులో జీర్ణమైపోయాడు గనుక బయటకు వచ్చే అవకాశం లేకపోయింది. అసలు సంగతి అర్ధం కాగానే ఇల్వలుడు పారిపోయాడు.

అగస్త్య మహాముని వలన రాక్షసుల పీడ విరగడయింది. అప్పట్నుంచీ జీర్ణ ప్రక్రియలో ఇబ్బంది చోటు చేసుకుంటే ”జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం..” అనడం ఆచారంగా మారింది. అది ఇప్పటికే ఆనవాయితీగా వస్తోంది.