ఆగస్ట్ 21, 2012
అంతర్జాతీయ చిత్రకారుడు శ్రీ కాపు రాజయ్యకు అక్షర నీరాజనం!
ప్రముఖ అంతర్జాతీయ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత శ్రీ కాపు రాజయ్య 20-08-2012 న సిద్ధిపేటలో తుది శ్వాస విడిచారు. ఆయన గత కొంత కాలంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1993లో కళాప్రవీణ, 1997లో కళావిభూషణ్, 2000లో హంస, 2007లో లలిత కళారత్న అవార్డులు అందుకున్నారాయన. సిద్దిపేటలో జన్మించిన రాజయ్య జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు. ఏడు దశాబ్దాలకు పైగా తన చిత్రాలద్వారా ఎన్నో అవార్డులందుకున్న రాజయ్య సిద్దిపేటను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. రాజయ్య చిత్రాలను పార్లమెంటు, న్యూఢిల్లీలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్, సాలార్ జంగ్ మ్యూజియం, ఆంధ్రప్రదేశ్ లోని లలితకళా అకాడమిలో ప్రదర్శనకు ఉంచారు. సిద్దిపేటలో ఓ కళా పరిషత్ ను కూడా శ్రీ రాజయ్య స్థాపించారు. ఆధునిక చిత్రకళలో తెలంగాణ గ్రామీణ జీవితానికి కాపు రాజయ్య చిత్రం ప్రతిబింబం అయ్యింది. బీద కుటుంబంబంలో ఇద్దరు అక్కలకు తమ్ముడిగా చిన్న వ్యాపారస్తుడైన శ్రీ రాఘవులుకు 1925 ఏప్రిల్ 6వ తేదీన సిద్ధిపేటలో జన్మించిన రాజయ్య లలితకళా అకాడెమీ అవార్డు గ్రహీతగా జాతీయ స్థాయి చిత్రకారుడిగా ప్రఖ్యాతి చెందారు. చిన్నతనంలోనే తండ్రి చనిపోవడంతో దిక్కుతోచని కుటుంబాన్ని తండ్రి స్నేహితుడు శ్రీ చంద్రయ్యగౌడ్ ఆదుకున్నాడని రాజయ్య తన జీవితాంతం గుర్తు చేసుకునేవారు. కాపు రాజయ్య జీవితంతో పోరాటం చేసి కళాకారుడయ్యారు. తనకు ఇష్టమైన చిత్రకళలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్నారు. ప్రపంచీకరణ నేపధ్యంలో పల్లె జీవితం చెరిగిపోకుండా, గుర్తుండేటట్లు, తన కుంచెతో తెలంగాణా పల్లె జీవనానికి ప్రాణంపోసిన చేయితిరిగిన చిత్రకారుడు శ్రీ రాజయ్య. ఈయన చిత్రాలు ముందు తరాలవారికి, తెలంగాణా పల్లె జీవితాన్ని,సంస్కృతిని మరచిపోకుండా చేస్తాయి అని అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.రేఖా చిత్రాలతో,మనసును ఆకట్టుకునే రంగులతో ఈయన చిత్రాలు మురిపిస్తాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో చిత్రకళను అభ్యసించిన శ్రీ రాజయ్య దక్షిణాది ప్రాంతాలన్నిటినీ తిరిగి అన్నిరకాల చిత్రకళారీతులను పరిశీలించి, తనదైన సొంత బాణీని ఏర్పరుచుకున్నారు. తక్కువ గీతలలో ఎక్కువ అర్ధం వచ్చేటట్లుగా ఆయన చిత్రాలు ఉంటాయి. లండన్ నుంచి వెలువడే ‘స్టుడియో’ అనే పత్రిక రాజయ్య వర్ణచిత్రాన్ని ప్రచురించుకుని నీరాజనం పలికింది. ఆయన కళానైపుణ్యాన్ని ప్రతిబింబించే ఈ క్రింది చిత్రాలను పరిశీలించండి.
శ్రీ రాజయ్యకు ఆత్మశాంతి కలగాలని భగవంతుని ప్రార్ధించుదాం!
టీవిఎస్ శాస్త్రి
ఆగస్ట్ 20, 2012
సర్దార్ సర్వాయి పాపన్న- బహుజన రాజ్యాధికారానికి ప్రతీక!
(1675లో సర్వాయి పాపన్న తొలిసారి కోటను నిర్మించిన సర్వాయిపేట (కరీంనగర్ జిల్లా) కొండల మీద 18-08-2012 న ఆ బహుజన నేత విగ్రహ ప్రతిష్టాపన జరిగిన సందర్భంగా ..)
దళిత బహుజనులు ఏకమై ఉద్యమిస్తే రాజ్యాధికారం సాధించవచ్చని 17వ శతా బ్దంలోనే నిరూపించిన ధీరుడు సర్దార్ సర్వాయి పాపన్న. పాపన్న క్రీ.శ.1650లో నేటి వరంగల్ జిల్లా ఖిలా షాపురంలో కళ్లు తెరిచాడు. గౌడ కులంలో పుట్టిన పాపన్న బాల్యంలో పశువులను కాస్తూ, యుక్త వయసులో కల్లు గీస్తూ జీవనం సాగించేవాడు. అయితే అనతి కాలంలోనే పాపన్నకు కులవృత్తి కొన సాగింపు వ్యర్థకార్యకలాపంగా తోచింది.‘‘తాళ్లెక్కితేమొస్తుంది? కల్లమ్మితేమొస్తుంది? రాజులమవుతామా? రాజ్యమొస్తుందా? కోటలు కొట్టాలి! రాజ్యమేలాలి!’’ ఇదీ పాపన్న ఆకాంక్ష. శూద్ర, అతి శూద్ర కులాలకు చెందిన అణగారిన జనాల జీవనంలో పరివర్తన తేవడం, అణచివేతలో పాలు పంచుకుంటున్న అగ్ర భూస్వామ్య కులాల ఆధిపత్యాన్ని అంతంచేయడం పాపన్న జీవిత లక్ష్యంగా మారింది. పాపన్న పోరాటంలో ఐదు అంశాలు ఉన్నా యి. బ్రాహ్మణీయ భావజాల వ్యతిరేకత, సామ్రాజ్యవాద వ్యతిరేకత, భూస్వామ్య వ్యతిరేకత, బౌద్ధ-జైన తత్వచింతన, దళిత బహుజన రాజ్యాధికార లక్ష్యం. మన దేశ చరిత్రలో అన్ని రాచరిక వ్యవస్థల్లో పాలకులు పూజారి వర్గాన్ని నెత్తిన పెట్టుకున్నారు. హిందూమత సంప్రదాయాలను అనుసరించిన రాజులందరూ గుడులు కట్టించి, దేవుని పేరిట మాన్యాలు కట్టబెట్టారు. పాపన్న ఇందుకు భిన్నంగా కొత్తగా గుడులు కట్టించకపోగా అప్పటికే ఉన్న గుడుల యాజమాన్యం దళిత బహుజనులకే అప్పజెప్పాడు. మొగల్ పాలకుల పెత్తనాన్ని ప్రశ్నించి వారి పాలనకు వ్యతిరేకంగా పోరుసలిపిన విప్లవకారుడు పాపన్న. ఆ కాలంలో దొరలు, భూస్వాములు మొగల్ పాలకులకు ఏజెంట్లుగా వ్యవహరిస్తూ అణగారిన ప్రజలను అనునిత్యం వేధింపులకు గురి చేసేవారు. ఈ క్రమంలోనే పాపన్నలో పోరాటతత్వం ప్రజ్వరిల్లింది.బుద్ధుడు ప్రవచించిన ‘బహుజన హితాయ బహుజన సుఖాయ’ అనేసూక్తిని పాపన్న మనసా వాచా కర్మణా ఆచరించాడు. దళిత బహుజనుల సంక్షేమం కోరుతూ పెక్కు కార్య కలాపాలను చేపట్టడాన్నిబట్టి చూస్తే పాపన్న మీద బౌద్ధంతోపాటు జైనతత్వ ప్రభావం కూడా ఉన్నట్లు గోచరిస్తుంది. బౌద్ధానికి ప్రధాన కేంద్రాలుగా నిలిచిన ధూళిమిట్ట, ధూళికట్టలలో జరిపిన తవ్వకాలలో పాపన్న వీరత్వాన్ని ప్రతిఫలించే శిల్పసంపద బయల్పడటం ఇందుకు ఓ తార్కాణం. క్రీ.శ.1707లో ఔరంగజేబు మరణించాడు. ఔరంగజేబు కుమారుడు ఖాన్బక్ష్ అప్పటి దక్కన్ సుబేదారు. ఢిల్లీ రాజకీయాలకు అంకితమైన ఖాన్బక్ష్ కు దక్కన్పై పట్టు సడలింది. ఈ పరిస్థితులను ఆసరా చేసుకుని క్రీ.శ.1708 ఏప్రిల్ 1న పాపన్న వరంగల్ కోటను ముట్టడించాడు. ఎంతో సాహసంతో కూడుకున్న ఈ ముట్టడిని పాపన్న సమర్థంగా నిర్వహించి మొగల్ అధీనంలో ఉన్న వేలమంది బందీలను విడుదల చేశాడు. అనంతరం ధనరాసులను కైవసం చేసుకుని వాటిని తరలించాడు. వరంగల్ కోట స్వాధీనంతో పాపన్న పేరు నలుదిశలా వ్యాపించింది. అణగారిన కులాలకు చెందిన యువకులు వేలాదిగా పాపన్న సైన్యంలో చేరారు. పాపన్నపై చేసిన పలు కుట్రపూరిత ప్ర యోగాలు వికటించడంతో దిక్కుతోచని ఫౌజుదార్లు, సుబేదార్లు, జమీందార్లు ఢిల్లీ పాదుషా బహదూర్షాకు మొరపెట్టుకున్నారు. బహదూర్షా యూసుఫ్ ఖాన్ రుజ్బహానీకి పెద్దసంఖ్యలో సైన్యాన్ని ఇచ్చి పాపన్న మీదికి పంపించాడు. వరంగల్ కోటను స్వాధీనం చేసుకున్నాక పాపన్న మరికొన్ని దుర్గాలను నిర్మించి సైన్యాన్ని పటిష్టపరుచుకున్నాడు. గోల్కొండ కోటను కొట్టడానికి అనువైన పరిస్థితులు ఏర్పడటంతో పాపన్న తనసైన్యానికి ఆధునిక ఆయుధాలు, మరఫిరంగులు ఉపయోగించడంలో శిక్షణ ఇప్పించాడు. లక్ష్యాలను ఛేదించ డానికి వ్యూహరచన చేసుకున్నాడు. అప్పటికి పాపన్న సైన్యం 12 వేలకు చేరుకుంది. క్రీ.శ. 1709 తొలిదినాల్లో పాపన్న సైన్యం గోల్కొండపైకి దండెత్తి వెళ్లింది. మొగల్ సైన్యాలతో పాపన్న సైన్యాలు వీరోచితంగా పోరాడాయి. అంతిమంగా గోల్కొండ పాపన్న వశమైంది. పాపన్న తన లక్ష్యాన్ని ఛేదించి అనుకున్నది సాధించాడు. పాపన్న చేతిలో ఓటమి మొగల్ రాజ్యాధినేతలకు ఊహించని పరిణామం. అందుకు మొగల్ నాయకత్వం పరాభవంతో రగిలిపోయి అదనపు సైన్యాలను ఢిల్లీ నుంచి రప్పించి పాపన్న సేనలపై యుద్ధాన్ని తిరిగి కొనసాగించాయి. ఈ యుద్ధంలో పాపన్న సైన్యం భారీగా నష్టపోయింది. చివరిదాకా శత్రువుతో అలుపెరగని పోరాటం సాగించిన పాపన్న శత్రువు చేతికి చిక్కడానికి సిద్ధపడక బాకుతో పొడుచుకొని ఆత్మార్పణ చేసుకున్నాడు. దళిత బహుజనులు పాపన్న చూపిన ఐక్యతా మార్గంలో నడచిన నాడే రాజ్యాధికారం వారికి సిద్ధిస్తుంది.
(కొంపెల్లి వెంకట్ గౌడ్, ‘సాక్షి’ సౌజన్యంతో…)
టీవీఎస్ శాస్త్రి
ఆగస్ట్ 19, 2012
ఇతిహాస సుందరి టిజి కమల

ఆగస్ట్ 15, 2012
మన జాతి గీతికలు
ఈ మహత్తర జాతి గీతికలను, నేడు చాలామంది మరచిపోతున్నారు. కొందరికి కొంచెమే వచ్చు. ఈ ప్రబోధాత్మక గీతాలను, నేటి తరం పిల్లలకు నేర్పటానికి ముందు, మనమొకసారి పునశ్చరణ చేసుకుందాం!
వందేమాతరం వందేమాతరం
సుజలాం సుఫలాం మలయజ శీతలాం
సస్యశ్యామలాం మాతరం వందేమాతరం
శుభ్రజ్యోత్స్న పులకిత యామినీమ్
ఫుల్ల కుసుమిత ద్రుమదళ శోభినీమ్
సుహాసినీమ్ సుమధుర భాషిణీమ్
సుఖదాం వరదాం మాతరం
వందేమాతరం
జన గణ మన అధినాయక జయహే
భారత భాగ్య విధాతా
పంజాబ సింధు గుజరాత మరాఠా
ద్రావిడ ఉత్కళ వంగా
వింధ్య హిమాచల యమునా గంగా
ఉచ్చల జలధి తరంగా
తవ శుభ నామే జాగే
తవ శుభ ఆశిష మాగే
గాహే తవ జయ గాథా
జన గణ మంగళ దాయక జయహే
భారత భాగ్య విధాతా
జయహే జయహే జయహే
జయ జయ జయ జయహే
జైహింద్!!!
భవదీయుడు,
టీవీయస్.శాస్త్రి
ఆగస్ట్ 12, 2012
భాషే శ్వాసగా మిగిలిన భద్రిరాజు
ఇరవయ్యవ శతాబ్దపు భాషాశాస్త్ర కోవిదులలో ఎన్నదగ్గ వ్యక్తి ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి. భాషాశాస్త్రాన్ని సమగ్రంగా అధ్యయనం చేసి, అధ్యాపనం చేయగల సత్తా నిరూపించుకున్న పండితుడు భద్రిరాజు కృష్ణమూర్తి. 84 సంవత్సరాల వయసులో – నిన్న, అనగా ఆగస్ట్ 11 (2012) ఉదయం హైదరాబాదులో మెడిసిటి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ అంతిమ శ్వాస విడిచారు. ఐతే భాషలో వారి శ్వాస మనకు నిత్యానుభూతి కాగలదన్నది పరమసత్యం.
భాషాభిమానులందరూ వారికి నివాళులు అర్పిస్తున్నారు. శ్రీ టివిఎస్ శాస్త్రి బాష్పాంజలికై ఇక్కడ క్లిక్ చెయ్యండి.