జూన్ 24, 2020

భర్తృహరి అభాషితం

Posted in కథాజాలం, విద్యారంగం, వ్యాపారం, సాహితీ సమాచారం at 12:26 సా. by వసుంధర

మన చుట్టూ జరిగే వాటిలో కలవరపర్చే అంశాల్లో ముఖ్యమైనవి – విద్య, వ్యాపారదృక్పథమే ప్రధానంగా మారుతున్న జ్ఞాన విజ్ఞానాలు.

ఆ కలవరాన్నే కథాంశంగా తీసుకుని ప్రముఖ రచయిత శ్రీ తాడికొండ శివకుమారశర్మ రచించిన ‘భర్తృహరి అభాషితం‘ – ‘ఈమాట’ వెబ్ పత్రిక 2016 సెప్టెంబరు 2016 సంచికలో వచ్చింది.

ఈ కథలో ‘

‘చదువు ఇంకొకళ్లకోసం కాదు. చదువుకోవడ మనేది ఊపిరి పీల్చడం లాగా, నీళ్లు తాగడం లాగా ఎవరికి వాళ్లు చెయ్యలసిన పని. ఊపిరి పీల్చడం వల్ల, నీళ్లు తాగడం వల్ల, ఎవరికి వారే లాభపడతారు. చదువు అందించే విజ్ఞానంవల్ల చుట్టుపక్కల సమాజానికి తోడ్పడే అవకాశం అందుతుంది’ అన్న ఆవశ్యకమైన గొప్ప వివరణ ఉంది.

‘నాగరికత చిరుతపులి లాంటిది. పిల్ల ముద్దుగా ఉన్నది గదా అని తెచ్చి పెంచుకుంటే, అది పెద్దయిన తరువాత పెంచినవాళ్లనే కబళించక మానదు. నాగరికత ప్రకృతిని మనిషికి దూరం చేస్తోంది’ అన్న అర్థవంతమైన హెచ్చరిక ఉంది.

పాత్రల్లో

కార్పొరేట్ సంస్కృతిని వంటబట్టించుకుని – అలా వంటబట్టించుకోని మేధావుల్ని బాగా చిన్నచూపు చూసే వెంకటరెడ్డి. ప్రముఖ వ్యాపార రీసెర్చి సంస్థనుంచి యూనివర్సిటీకి, అక్కణ్ణించి కమ్యూనిటీ కాలేజికి, తదుపరి హైస్కూలుకి, చివరికి అడవి బిడ్డల మధ్యకు చేరి – గంగాదేవిని స్ఫురింపజేసే మేధావి రాజు. ఈ ఇద్దరికీ మిత్రుడిగా సామాన్యుడైన ఓ కథకుడు.

ఇంకా – రాజుని ఆరాధిస్తూ, అతడి ఆశయాలని గౌరవిస్తూ, ఆచరణలో మాత్రం వాస్తవాలకు అనుగుణంగా సద్దుకున్న రాజు శిష్యులు.

పై పాత్రలన్నీ రాజును కలిసేందు వెడుతూ – జరిపిన సంభాషణల్లో మొత్తం కథంతా ఇమిడి ఉంటుంది.

పాత్రానుగుణమైన భావచిత్రణ, వాస్తవంపట్ల అవగాహనతో సూచించబడిన సన్నివేశాలు – ఆ సంభాషణని ప్రయోజనాత్మకం చేశాయి.

కథలో గొప్పతనం ఏమిటంటే – రచయిత ముందే నిర్ధారించిన ఏదో సందేశాన్నివ్వడానికి కాక – చదువుతున్న పాఠకులతోపాటు తనకూ ఎప్పటికప్పుడు పరిస్థితి అర్థం కావడానికి చేస్తున్న ప్రయత్నంలా సాగుతుంది కథ.

అందుకే కథ ముగింపుకి ముందర – ఏనుగు లక్ష్మణకవి అనువదించిన ‘ఆకాశంబుననుండి శంభుని శిరంబు’ అనే భర్తృహరి సుభాషితాన్ని ప్రస్తావిస్తూ –

‘గంగాదేవి ఆకాశంలో గానీ, శంభుని శిరం మీద గానీ ఉండిపోతే, ఎవరికీ లాభం లేదు. శీతాద్రి మీదకి చేరడం ఆమెకు భూమి మీద పారే శక్తి నిచ్చింది. దానితో భూమిమీద వందల మైళ్లు ప్రవహిస్తూ, ఆ నది పరీవాహక ప్రాంతాలని సస్యశ్యామలం చేస్తోంది. చివరకు సముద్రంలో కలిసిన తరువాత పాతాళానికే జేరుకున్నదనుకున్నా, అలా చేరడం వల్ల ఆ నదీ తీరాలకి దూరంగా ఉన్నవాళ్లకి గూడా అత్యంత అవసరమయిన నీటిని బావుల ద్వారా చేరుస్తోంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న గంగాదేవికి వివేక భ్రష్టత నాపాదించడం సమంజసమెలా అవుతుంది? ఆ పద్యంలోని చివరి పాదాన్ని ‘వివేకద్యుమ్న సంభావనల్’ అనీ, మూలమైన సంస్కృత శ్లోకంలో అయితే, ‘వివేకద్యుమ్నానాం భవతి సుమభావః శతముఖః,’ అనీ మార్చాలేమో!’

అని స్వగతించినా –

‘సముద్రంలో కలిసిన గంగానదికి పాతాళం ఒక్కటే గమ్యం కాదు. ఆవిరై మబ్బుగా మారడం కూడా. అట్లా మళ్లీ ఆకాశాన్ని చేరుతుంది. అందుకు తగిన వేడినిచ్చే నుప్పు సెగ పెట్టాలి’

అన్న ప్రతిపాదనని అయిష్టంగానే అయినా స్వాగతించారు.

భర్తృహరి శ్లోకాన్ని ఇలా విశ్లేషించడం, ఆ విశ్లేషణను నేటి విద్యా వ్యవస్థకు అన్వయించడం అపూర్వమైన ప్రతిభ. మరింత ప్రయోజనంకోసం – ఈ కథను మేధావులు, ప్రపంచ విద్యాసంస్థలు అధ్యయనం చేయాల్సి ఉంది. విద్యాసంస్థల్లో పాఠ్యాంశంలో చేర్చవలసి ఉంది.

మహాత్ములు సందర్భానుసారంగా కొన్ని వివాదాస్పద విషయాల్ని చెప్పవచ్చు. కానీ వారి కలాలకి రెండు వైపులా పదునుంటుంది. అందుకే వారు చెప్పింది వింటూనే, వారు చెప్పనివి (అభాషితాలు) కూడా గ్రహించడమెలాగో మచ్చుగా చూపారు రచయిత. అభాషితం అన్న పదం వాడడంలో చమత్కారంతో పాటు సందేశమూ ఉంది.

సంభాషణలకు బదులు సన్నివేశాల సమాహారంగా నడిపిస్తూ పెద్ద కథగానో, నవలికగానో మలిస్తే – ఈ రచనలో శిల్పానికి ప్రాముఖ్యం లభించి ఉండేదేమో! కానీ కథగానూ రాణించిన ఆలోచనాత్మక, ప్రయోజనాత్మక విశిష్ట రచన ఇది.

మా అభిప్రాయంలో – తెలుగు సాహిత్యం నేడు చేరుకున్న స్థాయికి ఓ మెచ్చుతునక ఈ కథ. రచయితకు అభివందనాలు!

నవంబర్ 28, 2014

తయారీ ఇండియాలోనా, ఇండియాకోసమా?

Posted in వ్యాపారం at 6:55 సా. by వసుంధర

make in india

ఆంధ్రజ్యోతి

అక్టోబర్ 1, 2014

మీ చేతకు మా చేయూత

Posted in వ్యాపారం at 10:02 సా. by వసుంధర

we sell for you

ఈనాడు

సెప్టెంబర్ 14, 2014

మార్గదర్శివమ్మా మహిళా…

Posted in వ్యాపారం at 9:50 సా. by వసుంధర

margadarsi

                       ఈనాడు

సెప్టెంబర్ 9, 2014

వందే ‘మాత’రం

Posted in వ్యాపారం at 7:52 సా. by వసుంధర

vandemataram

తరువాతి పేజీ