జూన్ 27, 2018

ఓహో తెలుగు పద్యమా!

Posted in కవితా చమత్కృతులు, Uncategorized at 4:19 సా. by వసుంధర

నక్షత్రయుక్తం చమత్కారం చూ( చదవండి )డండి :-

నక్షత్రము గల చిన్నది
నక్షత్రము చేతబట్టి నక్షత్రప్రభున్
నక్షత్రమునకు రమ్మని
నక్షత్రము పైనవేసి నాథుని పిలిచెన్

ఇందులో నాలుగు నక్షత్రాలు దాగి ఉన్నాయి. పదే పదే చదివితేనే కానీ అంతసులువుగా అర్థమయేవికావు. ఇటువంటి ప్రహేళికలను’ప్రముషితా’ ప్రహేళికలని అంటారని కవి దండి తన’కావ్యాదర్శం’ లో చెప్పాడు.

ఇప్పుడు వివరణ చూద్దాం!
మహాభారతంలో విరాటపర్వం చదువనివారుండరు. విరాటరాజు కుమార్తె “ఉత్తర” (నక్షత్రం పేరు ) ఆమె అభిమన్యుని భార్య. నక్షత్రము చేతబట్టి అంటే కుంకుమ పాత్ర “భరణిని” ( నక్షత్రం పేరు ) చేతిలో పట్టుకొని ; నక్షత్రప్రభున్ నక్షత్రాలకు ప్రభువైన చంద్రుని వంశపు ( చంద్రవంశము ) అభిమన్యుని; నక్షత్రమునకు రమ్మని అంటే ఒక “మూల” ( నక్షత్రం పేరు) కు రమ్మని పిలిచి; నక్షత్రము పైనవేసి అంటే “హస్త” (నక్షత్రం పేరు ) మును అతని మీదవేసి; నాథుని పిలిచెన్ అంటే పతియైన అభిమన్యుని ప్రేమగా పిలిచిందట.

అమ్మో! ఈ పద్యం అర్థంకాకుంటే మీకు నిజంగానే నక్షత్రాలు కనిపించేవి కదూ! అదీ మరి కవి చమత్కారమంటే!

జనవరి 8, 2017

సూర్య నమస్కారం

Posted in కవితా చమత్కృతులు, భాషానందం, Uncategorized at 7:03 సా. by వసుంధర

ఈనాడు

surya-namaskaram-eenadu

డిసెంబర్ 1, 2014

అవధాన రాజధాని- ఒక నివేదిక

Posted in కవితా చమత్కృతులు at 5:21 సా. by వసుంధర

శ్రీ మోచర్ల హరికృష్ణ తెలుయజేస్తున్నారు.

‘అవధాన రాజధాని’  కార్యక్రమములు  02 11 2014 నుండి 09 11 2014 వరకూ భారత రాజధానిలో బ్రహ్మశ్రీ డా. మాడుగుల నాగఫణి శర్మచే  అవధాన సరస్వతీపీఠం వారి ఆధ్వర్యంలో  ఢిల్లి తెలుగు అకాడెమి వారి సహకారముతో  కన్నుల పండువగా నిర్వహింప బడినవి . ఈ కార్యక్రమములో  ఎందరో మహనీయులు పాల్గొని అవధాని శ్రీ మాడుగుల నాగఫణి శర్మని, వారి సృజనాశక్తిని, అసాధారణమైన ధారణాశక్తిని, సుమధుర గాత్ర  సంగీతమును వేనోళ్ళ ప్రస్తుతించిరి. 

ఈ 8 రోజులలో శ్రీ నాగఫణి శర్మ శ్రోతలను, పృచ్ఛకులను తన పాండిత్య పాటవముతో మంత్రముగ్ధులను చేసినారు. ప్రారంభోత్సవము 02 11 2014 న ఫిక్కీ భవనములో కన్నుల పండువగా జరిగినది. ఈ సభలో డా. మంగళంపల్లి బాల మురళీకృష్ణ, శ్రీ ఎం.వి. రమణ  (సుప్రీమ్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి ) , శ్రీ జి .వి.జి . కృష్ణమూర్తి  (ప్రధాన ఎన్నికల అధికారి – భారత ప్రభుత్వము), వారి శ్రీమతి  జి. పద్మ, శ్రీ బలదేవానంద సాగర్ (ఆకాశవాణి సంస్కృత వార్త ప్రవాచకులు), ప్రముఖ సినీ  నిర్మాత, దర్శకుడు శ్రీ తమ్మారెడ్డి భరద్వాజ , జ్ఞానపీఠ   గ్రహీతలు, పద్మభూషణ్  శ్రీ సత్యవ్రత శాస్త్రి, లాల్ బహదూర్ శాస్త్రి సంస్కృత విద్యాలయము యొక్క పూర్వ కులపతి శ్రీ శ్రీధర్ వసిష్ట, ఢిల్లి తెలుగు అకాడెమి అద్యక్షులు శ్రీ నాగరాజు, డా.  సుగుణ కుమార్ మొహంతి – (హిమాచల ప్రదేశ్ లో సంస్కృత అధ్యాపకులు) మొదలగువారు శ్రీ నాగఫణి శర్మతో పాటు  వేదికనలంకరించిన  ప్రముఖ వ్యక్తులు.  

8 రోజుల పాటు జరిగిన ఈ అవధాన రాజధాని కార్యక్రమంలో బృహత్ ద్విసహస్రావధాని, బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ తన ప్రత్యేకమయిన ధైర్యము, ధార, ధారణ, సమయస్ఫూర్తి, స్వచ్చమయిన, స్పష్టమయిన కవితా చాతుర్యముతో, చక్కని గాత్రముతో సభాసదులను  మంత్ర ముగ్ధులను చేసిరి.

03 11 2014 నుండి 09 11 2014 వరకూ ఈ అవధాన కార్యక్రమం ఆంధ్ర భవన్, న్యూ ఢిల్లి నందు కన్నుల పండుగగా జరిగినది. షడ్రసోపేతమయిన భోజనము, వీనుల విందయిన పాటలు, ఒక్కొక్క రోజు ఒక్కొక ప్రత్యేక రీతిలో భక్తిపూరకమైన గీతములతో కార్తిక మాస మహోత్సవములు ఒక పండుగ వాతావరణములో నిర్వహింపబడినవి. ఈ కార్యక్రమము ఇంత చక్కగా జరిపిన నిర్వాహకులు  ప్రసంశనీయులు. 

09 11 2014 న జరిగిన  ‘విజయోత్సవము’ కన్నుల పండువగా జరిగినది. కేంద్ర మంత్రివర్యులు శ్రీ వెంకయ్యనాయుడు, పూజ్యులు శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానందస్వామి ఈ ‘విజయోత్సవము’లో పాల్గొని, బ్రహ్మశ్రీ నాగఫణి శర్మకి తమ అభినందనలు,  ఆశీర్వాదములు తెలియజేసారు. ప్రముఖ సంస్కృత కవి శ్రీ రామానంద శుక్లా , బ్రహ్మశ్రీ నాగఫణి శర్మని ‘అవధాన సామ్రాట్ ‘ అని ప్రస్తుతించారు.  

ఈ 8 రోజుల అవధాన రాజధాని కార్యక్రమములో సుమారు 500 మంది పృచ్ఛకులు ఇచ్చిన సమస్యలకు అవధాని అవలీలగా, ఆశువుగా పద్యాలు పూరించిన విధము అనిర్వచనీయము. సమస్యా పూరణము కడు మనోరంజకముగా, ఆహ్లాద కరముగా శ్రోతలను బాగా ఆకట్టుకొన్నవి.  కొన్ని సమస్యలు, వాటికి అవధాని పూరణములు ఇక్కడ ఉదహరిస్తున్నాను.

సమస్యః ‘సోనియా మోడితో కలసి శ్లోకము  పాడెను పార్లమెంటులో’

ఏ నియమంబు చూచినను యెప్పటికయినను ఒక్కటే కదా 

లేనిది లేదనంవలదు లేమిక లేదని చెప్పగా వలెనని 

నేనును నీవును ఈ ప్రజకు ఏకత సేవల నిమిత్తమంచు ఆ 

సోనియ మోడితో కలసి శ్లోకము పాడెను పార్లమెంటులో

సమస్య: ‘కోళ్ళను కాల్చిరి ద్విజుల్ సంకోచమ్ము లేకుండగాన్’

నీళ్ళున్ నిప్పులు లేని కారడవిలో నిత్యాగ్ని హోత్రుల్ ద్విజుల్ 

ఫెళ్ళున్ త్రుళ్ళింతలు పడుచుండిరి మహా దుర్వర్షముల్ క్రమ్మగా 

త్రెళ్ళున్ వంటకు కట్టె ల్లేవు యనగా విని ఆ మంచము 

కోళ్ళను కాల్చిరి ద్విజుల్ సంకోచమ్ము లేకుండగాన్

సమస్య: ‘గుటుక్కుమంచు మింగె వాడు గూటిలోని లింగమున్’

పుటుక్కునన్ తటాలునన్ అభూత కల్పనాఢ్యుడై 

చటుక్కునన్ కొరుక్కొనన్ విశాల విద్య వానిదే 

నిటారు లేదు నింగి లేదు నీచ ముచ్చమున్నదా  

గుటుక్కుమంచు మింగె వాడు గూటిలోని లింగమున్

సమస్య: ‘దుష్కరమైన ప్రాస ఇది దుర్గమమా కవిత చెప్పగా’

పుష్కలమైన భాష ఇది పుట్టుకతోడన్ కలుగు వానికి  

గ్రీష్కలమయిన వాక్య తతి గ్రీష్మము ఓలె ప్రతాపమొప్పగా 

నిష్క సహస్ర కోటియై  నిల్వవె ప్రాసలు సద్వవధానికిన్  

దుష్కరమైన ప్రాస ఇది దుర్గమమా కవిత చెప్పగా

సమస్య: మన ప్రధాని మోది- ఆంధ్ర, తెలంగాణ ముఖ్య మంత్రులు- కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు పేర్లు వచ్చేలా ఒక పద్యం.

మోది పాలించి సుజనానుమోది యయ్యె 

చంద్రుడొక వంక మనశ్చంద్రుడయ్యె 

కలువకుంటల చంద్రుడు ఘనుడునయ్యె

భరత జాతికి వెంకయ్య వన్నె తెచ్చె

ఈ ఉదాహరణలు కేవలము స్థాళీ పులాక న్యాయముగా ఈయబడినవి.  అవధాన సమయములో త్వరత్వరగా వ్రాయ బడినవి కనుక చిన్నచిన్న ముద్రారాక్షసములు, ఛందస్సు  లోపములు ఉన్న యెడల క్షంతవ్యుడను. ఈ   అవధాన విజయములో అప్రస్తుత ప్రసంగము చేసిన శ్రీ శంకరనారాయణ తమ హాస్య చతురోక్తులతో శ్రోతలను నవ్వులలో ముంచెత్తినారు. ఇటువంటి రమణీయమయిన, కమనీయమయిన కార్యక్రమములో ఒక పృచ్ఛకుడిగా, కార్య కర్తగా పాల్గొని, శ్రీ గణపతి సచ్చిదానందస్వామి వారి దర్శనము, అనుగ్రహము – అవధాన సరస్వతీ పీఠం వారినుండి ‘సరస్వతీ  ప్రసాదము’ అందుకొను అదృష్టము నాకు కల్గినది. 

ఇది నా పూర్వ జన్మ సుకృతముగా భావిస్తున్నాను. 

– మోచర్ల హరికృష్ణ

నవంబర్ 30, 2014

మేధోమధనం

Posted in కవితా చమత్కృతులు at 7:22 సా. by వసుంధర

mind editorial

ఈనాడు

అక్టోబర్ 6, 2014

కవిత్వంలో వ్యంజకాలు

Posted in కవితా చమత్కృతులు at 10:23 సా. by వసుంధర

vyanjakalu

ఆంధ్రభూమి

తరువాతి పేజీ